Friday, March 27, 2026

 *****
                   *వాసంత సమీరం*
                    ==========
                        (కథానిక)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

వేసవి శెలవుల అనంతరం ఆ స్కూలు ఆ రోజునే  తిరిగి ప్రారంభమైంది. పచ్చని చేల మీద తిరిగే తెల్లని కొంగల్లా కనబడుతున్నారు, పచ్చటి మొక్కల మధ్య తెల్లటి యూనిఫారం వేసుకుని నడుస్తున్న ఆ బడి పిల్లలు. కల్లాకపటం తెలియని వారి కేకలతో, ఆటలతో ఆ ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంది.

ఆ రోజునే అక్కడ టీచర్ గా చేరడానికి వచ్చిన చంద్రశేఖర్,  ఆ దృశ్యం చూస్తూ బాల్యంలో తనకు దక్కని ఆ ఆనందాన్ని వాళ్లలో చూసుకుంటూ అలా మైమరచి ఉండిపోయాడు.

"సార్! కొత్తగా వచ్చిన చంద్రశేఖర్ సార్ మీరేనా? హెడ్మాష్టారు రమ్మంటున్నారు" అంటూ వచ్చిన అటెండర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి, అతనితో కలిసి ఆఫీసు రూమ్ వైపు నడిచాడు.

     *****     *****     *****     *****

ఉద్యోగ నియామకానికి సంబంధించిన తతంగం పూర్తి అయిన తర్వాత, చంద్రశేఖర్ ని తీసుకుని నాల్గవ తరగతి గది వద్దకు వచ్చారు హెడ్మాష్టారు. ఆయనని చూసిన ఆ తరగతి పిల్లలు "గుడ్ మార్నింగ్ సార్" అంటూ  లేచి నిలుచున్నారు. వాళ్లని కూర్చోమని చెప్పి,

"చూడండి పిల్లలూ! ఈయన చంద్రశేఖర్ అని, కొత్తగా చేరిన మాష్టారు. ఈరోజు నుంచి ఈయనే మీ క్లాసు టీచర్" అని పరిచయం చేసి, అక్కడి నుంచి నిష్క్రమించారు హెడ్మాష్టారు.

     *****     *****     *****     *****

"డియర్ స్టూడెంట్స్, మొన్నటి వరకూ నేను కూడా మీలాగే విద్యార్థినే! కొన్ని పరీక్షలు రాసి ఇదిగో ఈరోజు ఇలా మీకు పాఠాలు చెప్పే మాష్టారుగా వచ్చాను. అలాగే మీరు కూడా బాగా చదివి నాకన్నా పెద్ధ ఉద్యోగాల్లో స్థిరపడాలి, ఓకేనా? సరే, నేను ఈ స్కులుకే కాదు, ఈ ఊరికే కొత్త.  కానీ, మీరంతా ఇదే పాఠశాలలో మూడో తరగతి పాస్ అయ్యి నాలుగులోకి వచ్చి ఉంటారు. మీరెవరూ నాకు తెలియదు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ముందుగా మీ పేరు చెప్పి, తర్వాత మీ తల్లి తండ్రులు గురించి చెప్పండి. ముందుగా పాపా! నువ్వు చెప్పమ్మా" అంటూ ముందు బెంచీలో కూర్చున్న అమ్మాయిని అడిగాడు చంద్రశేఖర్.

"సార్! నా పేరు క్షితిజ. మా నాన్న గారు ఆర్టీసీ డ్రైవర్. మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు" అని చెప్పి కూర్చుంది ఆ అమ్మాయి.

"వెరీగుడ్. నెక్స్ట్?"

"నా పేరు హిమజ. మా అమ్మా,  నాన్న ఇద్దరూ టైలర్లే" 

"గుడ్. నువ్వు చెప్పు బాబూ!"

"నా పేరు అక్షజ్. మా డాడీ యమ్డీవో ఆఫీసులో సూపర్నెంట్. మమ్మీ ఎల్.ఐ.సీ లో క్లర్క్" కొంచెం గర్వంగా చెప్పాడు.

"వెరీ నైస్. నెక్స్ట్ ?"

"సార్, నా పేరు సుభాష్. మా డాడీ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తారు. మమ్మీ ఇంట్లోనే" చెప్పాడు.

"గుడ్..నెక్స్ట్ ?"

"సార్, నా పేరు వినాయక్. మమ్మీ ఓ హాస్పిటల్ లో నర్స్" అని చెప్పి కూర్చున్నాడు.

"మరి మీ నాన్న గారు?" అడిగాడు చంద్రశేఖర్.

ఆ కుర్రాడు లేచాడు కానీ, ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఈలోగా లేచిన అక్షజ్,

"వాడికి వాళ్ల డాడీ ఎవరో తెలియదు సార్! వీడు పుట్టకుండానే ఆయన ఇంట్లోంచి వెళ్లి పోయారుట" కొంచెం వెటకారం ధ్వనించింది అతని మాటల్లో. అది విన్న చంద్రశేఖర్,

"తప్పు అక్షజ్, ఒకరు బాధపడేలా అలా మాట్లాడకూడదమ్మా. ఇకనుంచి మీరు ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉండాలి. సరేనా? ముందు ఇద్దరూ కూడా షేక్ హాండ్ ఇచ్చుకుని తర్వాత కూర్చోండి. ఓకేనా ?....నెక్ట్స్?" అంటూ మిగతా వారిని ప్రశ్నించసాగాడు చంద్రశేఖర్.

కాసేపటికి, బెల్ మోగడంతో తరగతి గది నుంచి బయటకు వెళ్తూ, 

"ఇదిగో, వినాయక్! మధ్యాహ్నం భోజనాల సమయంలో ఓసారి స్టాప్ రూమ్ కి వచ్చి నన్ను కలుసుకో" అని చెప్పి బయటకు నడిచాడు చంద్రశేఖర్.

     *****     *****     *****     *****

స్టాప్ రూమ్ లో భోజనానికి కూర్చోబోతున్న చంద్రశేఖర్, పక్కనే చేతులు కట్టుకుని నిలబడిన, వినాయక్ ని చూసి,

"ఏరా? వచ్చావా? గుడ్. ఔనూ, ఎందుకు అలా ఏడుస్తున్నావు?" అతని తల నిమురుతూ అడిగాడు.

"సార్! నేను కడుపులో ఉండగానే మా నాన్న మా అమ్మని వదిలేసి ఎక్కడికో పోయాడుట. అందరికీ నాన్న ఉన్నాడు. నాకే లేడు. నాకు కూడా నాన్నుంటే.." అంటూ బిక్కమొహం వేసుకుని ఏడుస్తూ చెప్పాడు వినాయక్.

"ఎవరో లేరని అలా బాధ పడకూడదురా! ఆ మామిడి చెట్టు చూడు. తనని ఎవరు నాటారో, తనకు ఎవరు నీరు పోసారో ఆలోచించదు. తనకు తెలిసిందల్లా తను బతికినంత కాలం తీయటి పండ్లు అందించడమే! అలాగే మనం కూడా జరిగిన దానికి కాదు, జరగబోయే దాని గురించే ఆలోచించాలి, మిగతా వాటి గురించి ఆలోచించకూడదు. అర్థమయ్యిందా?" అనునయిస్తూ చెప్పాడు చంద్రశేఖర్.

"అలాగే సార్! కానీ నాన్నుంటే ఇంకా బాగుండేది కదా అని......" నసుగుతూ చెప్పాడు వినాయక్.

"సరే! నీకు నాన్న లేని లోటు గురించి నేను ఆలోచిస్తా కానీ, మీ ఇల్లు ఎక్కడ?"

"రంగమహల్ థియేటర్ పక్క సందులో కుడి వైపు ఉన్న ఐదో ఇంట్లో మధ్య వాటా సార్" తడుముకోకుండా చెప్పాడు వినాయక్.

"సరే ఏదో ఒక ఆదివారం వచ్చి మాట్లాడతానని మీ అమ్మగారికి చెప్పు" అతని తల నిమురుతూ చెప్పాడు చంద్రశేఖర్.

"అలాగే చెబుతా సార్! థాంక్స్ సార్" అని చెప్పి అక్కడి నుండి తరగతి గదికి వెళ్లాడు వినాయక్. 

     *****     *****     *****     *****

మూడు నెలలు గిర్రున తిరిగాయి. వర్షాకాలం మొదలైంది. ఆ ఆదివారం రోజు ఉదయం  వినాయక్ ఇంటికి బయలుదేరాడు చంద్రశేఖర్. అడ్రసు ప్రకారం ఆ ఇంటికి చేరి తలుపు కొట్టాడు. తలుపు తీసి చంద్రశేఖర్ ని చూసి ఆశ్చర్యపోయిన వినాయక్,

"మమ్మీ! మన ఇంటికి మా చంద్రశేఖర్ సార్ వచ్చారు" అంటూ సంతోషం ఆపుకోలేక గట్టిగా అరిచాడు. 

"నమస్కారం మాష్టారూ! రండి. నా పేరు పార్వతి. మీ గురించి మా వాడు ప్రతీరోజూ చెబుతూ ఉంటాడు. ఎలా ఉంది మా వాడి చదువు?" అంటూ పలకరించింది వంటింట్లోంచి వచ్చిన పార్వతి.

"బాగానే చదువుతున్నాడండీ! ఇక వాడి గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు. వాడి బాధ్యత నాది" అని చెబుతూ, తెచ్చిన స్వీట్ పాకెట్ వినాయక్ చేతిలో పెడుతూ,

"ఒరే ! నేను కాసేపు ఇక్కడే ఉంటా! నేను వెళ్లేలోగా హోమ్ వర్క్ కంప్లీట్ చేసి నాకు చూపించాలి. ఓకేనా? గదిలోకి వెళ్లి ఆ పని మీద ఉండు మరి" అని వినాయక్ ని అక్కడ నుంచి పంపించాడు చంద్రశేఖర్.

     *****     *****     *****     *****

"ఇప్పుడు చెప్పండి మాష్టారూ! ఎందుకు వచ్చారు? మా హాస్పిటల్ తో  ఏదైనా అవసరం పడిందా ?" అనుమానంగా అడిగింది పార్వతి.

"అబ్బే! అలాంటి అవసరం ఇంతవరకు పడలేదండి. ఇక టైం వేస్ట్ చేయకుండా పాయింట్ లోకి వచ్చేస్తున్నా. వినాయక్ వాళ్ళ నాన్నగారు ఎవరు?  ఆయన మిమ్మల్ని ఎందుకు వదిలేసారు? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి" పార్వతిని సూటిగా అడిగాడు చంద్రశేఖర్.

"చెప్పడానికి అభ్యంతరం ఏముంది మాష్టారూ?" అంటూ చెప్పసాగింది పార్వతి.

     *****     *****     *****     *****

"మాది చాలా పరువు ప్రతిష్టలు కలిగిన కుటుంబం. మా అమ్మానాన్నలకు ఇద్దరు అబ్బాయిలు తర్వాత నేను పుట్టడం వలన చిన్నప్పటి నుంచి చాలా గారంగా, పెంకితనంగా పెరిగాను. డిగ్రీ చదువుకునే రోజుల్లో, మా కాలేజ్ కేంటీన్ లో పనిచేసే  ఒకతన్ని ప్రేమించి, మా వాళ్లను ఎదిరించి అతన్ని గుళ్లో పెళ్లి చేసుకున్నాను. ఈ విషయం తెలిసి, పరువుకు ప్రాణం ఇచ్చే  మా నాన్న, అన్నయ్యలు నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. అంతే, పౌరుషం వచ్చి నేను కూడా జన్మలో ఈ ఇంటి గడప తొక్కనని శపథం చేసి బయటకు వచ్చేసాను" చెబుతూ ఆగింది పార్వతి.

"అయ్యో, పుట్టింటి వారు అలా ప్రవర్తించడం చాలా బాధాకరం అండీ, సరే తర్వాత ఏం జరిగింది చెప్పండి" ఆశక్తిగా అడిగాడు.

"వెంటనే ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాం. నేను డిగ్రీ ప్రైవేటుగా కట్టేను. అతడు ఇక్కడ ఓ హొటల్లో పనిచేసేవాడు. కొన్నాళ్ళు బాగానే గడిచాయి.  ఇక అక్కడనుంచి నేను మా వాళ్లతో అనవసరంగా గొడవపడి వచ్చేసాననీ, మా ఇంటికి వెళ్లి వాళ్లని బతిమాలి అయినా సరే డబ్బులు తెమ్మని సాధించేవాడు. ఆత్మాభిమానం కల నేను,  'చావనైనా చస్తాను కానీ,  పుట్టింటికి వెళ్లి అడుక్కునే ప్రసక్తే లేదని' కరాకండీగా చెప్పాను. అప్పుడే తెలిసింది, వాడి ప్రేమ నా మీద కాదనీ, మా నాన్న నాకు ఇచ్చే ఆస్తి మీద అని. అంతే ఓ రోజు ఉదయం లేచి చూసేసరికి వాడు కనబడలేదు. తెలిసిన అన్ని చోట్లా ఎంక్వయిరీ చేసాను. ఫలితం లేదు. అంతే కాదు వాడు ఇచ్చినవన్నీ రాంగ్ అడ్రసులే అని తెలిసింది. అంతే మళ్లీ కనబడలేదు. నేనూ వాడి గురించి వెతకలేదు. కానీ, ఆ తర్వాత నేను గర్భవతిని అనీ, నాకు ఐదవ నెల అని తెలిసింది" అంటూ ఏమాత్రం తత్తరపాటు లేకుండా చెప్పింది పార్వతి.

"మరి, మీరు గర్భవతి అన్న విషయం మీ ఇంట్లో వాళ్లకు చెప్పలేదా?" అనుమానంగా అడిగాడు చంద్రశేఖర్.

"చెప్పాను మాష్టారూ! మా అమ్మ అయితే విని బాధపడింది కానీ, మా నాన్న, అన్నయ్యలు అయితే వినకుండానే ఫోన్ కట్ చేసారు. ఆత్మాభిమానంతో నేను మళ్ళీ ఈరోజు వరకూ వాళ్లకు ఫోన్ చేయలేదు. ఆ తర్వాత ఒక సంఘ సేవకురాలు నన్ను కూతురులా చేరదీసి, పురుడు పోయించి, అదే హాస్పిటల్ లో నర్స్ ఉద్యోగం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హాయిగా బతుకుతున్నాం, మాకు ఎటువంటి సమస్యలు లేవు మాష్టారూ!  నా కొడుక్కి నాన్న లేడన్న లోటు తప్పించి.." అంటూ ఎంతో ఆత్మస్థైర్యంతో చెప్పింది పార్వతి.

అంతా విని

"మీరు ఒప్పుకుంటే, మీ అబ్బాయికి నాన్న లేని లోటు నేను..." అని చెప్పబోతున్న చంద్రశేఖర్ తో,

"ముందు మర్యాదగా బయటకు నడవండి. ఇదే ప్రపోజల్ తో ఇంతవరకూ పదిమంది వచ్చారు. మా అబ్బాయికి విద్యాబుద్ధులు నేర్పే మాష్టారు అని ఆలోచిస్తున్నా! లేకపోతే మీ బండారం బయటపెట్టేద్దును. ఇదిగో ఇలాంటివి చూసిన తర్వాతే నాకు మగవాళ్ళు అంటే అసహ్యం పుట్టింది. నా ఖర్మ కొద్దీ నాకు మగ పిల్లవాడినే ఇచ్చాడు ఆ భగవంతుడు" అంటూ ఆవేశంగా మాట్లాడుతూ చంద్రశేఖర్ ని బయటకు వెళ్లమన్నట్టుగా చెయ్యి చూపించింది పార్వతి.

ఆమె మాటలకు బిత్తరపోయిన చంద్రశేఖర్ కాసేపటికి తేరుకుని,

"మీరు నన్ను తప్పు అర్థం చేసుకున్నారు. నేను చెప్పదలచుకున్నది 'మీ అబ్బాయికి నాన్న లేని లోటు నేను తీర్చలేను కానీ వాడికి ఒక మేనమామగా, మీకు ఒక తమ్ముడిగా ఆ బాధ్యత తీసుకోగలను' అని. నిజం అక్కా! నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒక అనాథ ఆశ్రమంలో పెరిగాను. నాకూ ఒక పెద్ద కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకునేవాడిని. మీరు అంగీకరిస్తే.." అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడసాగాడు చంద్రశేఖర్.

కాసేపటికి తేరుకున్న పార్వతి,
"భలేవాడివయ్యా! అందరు మగవాళ్ల లాగే నిన్నూ జమ కట్టాను. నువ్వు అలాంటివాడివి కాదని తెలిసింది. సరే కానీ మా మరదల్ని కాపురానికి ఎప్పుడు తీసుకొస్తావ్?" అని నవ్వుతూ అడిగింది.

"నాకు ఇంకా పెళ్లి కాలేదక్కా! నీలాగే ఒక మంచి ధైర్యవంతురాలైన అమ్మాయి నాకు భార్యగా దొరకాలని ఆశీర్వదించు అక్కా" అంటూ ఆమె పాదాలకు నమస్కరించాడు చంద్రశేఖర్.

"తథాస్తు" అని దీవించి, "ఉండు తమ్ముడూ! ఈ సంధర్భంగా ఏదైనా స్వీట్ చేస్తా" అంటూ లేవబోయింది పార్వతి.

"స్వీట్ వద్దు అక్కా! ఏకంగా భోజనమే చేస్తా!" అంటూ చెప్పాడు చంద్రశేఖర్.

ఈలోగా లోపలినుంచి వచ్చి,

"మమ్మీ మనకు చందమామ అతి దగ్గరగా ఏరోజు ఉంటాడు?" అని తల్లిని అడిగాడు వినాయక్.

"ఆ చందమామ కేవలం పౌర్ణమి రోజునే దగ్గరగా ఉంటాడు. కానీ ఈ చంద్రంమామ ఇంక ప్రతీరోజూ నీకు దగ్గరగా ఉంటాడు. వెళ్లి మావయ్యకు నమస్కారం చెయ్యి" కొడుకుతో చెప్పింది పార్వతి.

"ఒరే! ఇంట్లో ఉన్నప్పుడే మావయ్యా అనాలి. స్కూల్లో మటుకు కాదురోయ్" నవ్వుతూ చెప్పాడు చంద్రశేఖర్.

"సరే!  మామా, అల్లుడు కూర్చుని కబుర్లు చెప్పుకోండి. ఈలోగా భోజనం ఏర్పాట్లు చేస్తా" అంటూ, పెరట్లో  గాలికి ఊగుతున్న  రెండు గులాబీ మొక్కలకు పూసిన మూడు పువ్వుల వంక ఆనందంగా చూసి, ఆ మొక్కలకు నీరు పోసి, తరువాత వంటగది వైపు నడిచింది పార్వతి. 

     *****     **శుభం**     *****

(నేను రాసిన ఈ కథ జనవరి 2024,
తపస్వి మనోహరం అనే అంతర్జాల పత్రికలోప్రచురితమైనది)

No comments:

Post a Comment