సుహాసిని
ధవళగిరి రాజైన యశోధనమహారాజు ఆదర్శప్రాయుడైన రాజు. ప్రజలను సుఖ పెట్టటానికి ఆయన అస్తమానమూ పాటు పడేవాడు. ఒకనాడాయన తన రాజధాని శివార్లలో మారువేషంతో తిరుగుతూండగా ఒక పూరిగుడిసెలో ముగ్గురు అప్పచెల్లెళ్లు కూచుని మాట్లాడుకుంటూ ఉండటం ఆయనకు వినిపించింది.
ముగ్గురిలోకి పెద్దది, "నాకు రాజుగారికి ఫలహారాలు చేసేవాణ్ణి పెళ్లాడాలని ఉన్నది. అలా అయితే రాజుగారు తినగా మిగిలిన ఫలహారాలన్నీ కూచుని హాయిగా తినవచ్చు," అన్నది. "ఫలహారాలతో ఏం కడుపు నిండుతుంది? నాకు రాజుగారి వంటవాణ్ణే చేసుకోవాలని ఉన్నది," అన్నది రెండవది. మూడవది ఏమీ అనలేదు. కాని దాని అక్కలు ఒత్తిడిచేసి, "నీకెవరిని చేసుకోవాలని ఉన్నదో చెప్పు!" అన్నారు. చివరకామె "నాకు రాజుగారినే చేసుకుని రత్నాలవంటి బిడ్డలను కనాలని ఉన్నది," అన్నది.
ఈ మాటలు విన్న రాజుగారు వారి ముగ్గురి కోర్కెలూ తీర్చటానికి నిశ్చయించి, మర్నాడు ఆ అప్పచెల్లెళ్ళను పిలిపించాడు. ఒకే ముహూర్తంలో ముగ్గురికీ పెళ్లిళ్ళు అయ్యాయి. అయితే ఆఖరు చెల్లెలి పెళ్లి రాజుగారితో గనక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది. తాను రాణి అయినానని ఆఖరు చెల్లెలు గర్వించలేదు. ఆమె తన అక్కలను ఎంతో ఆదరంతో చూసేది, వారి కేలోటూ రానిచ్చేది కాదు. కాని అక్కలు మాత్రం తమ చెల్లెలి వైభవం చూడలేక ఎప్పుడూ అసూయతో కుమిలిపోసాగారు. యశోధన మహారాజు మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసేవాడు. ఆమె తక్కువ వంశంలో జన్మించినా ఎంతో ఉదార బుద్ధి, ధర్మగుణం కలది. ఆమె అన్నివిధాలా ఆయనకు తగిన భార్య అని పెంచుకున్నది.
కొద్దికాలానికి రాణి గర్భవతి అయింది. కనే రోజులు వచ్చాయి. ఆమె అక్కలు ఆమెకు స్వయంగా పురుడు పోయవచ్చారు. రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు. అది చూసి వాళ్ళు మరింత అసూయ పడ్డారు. వారా పిల్లవాణ్ణి ఒక తొట్టెలో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలవలో వదిలేసి, ఒక కుక్కపిల్లను తెచ్చి బాలింతరాలి పక్కలో పెట్టారు. తన భార్య కుక్కపిల్లను ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగిపోయినట్టయింది. కాని ఆయనకు తన భార్యపైన ఆగ్రహం కలగలేదు.
రాణిగారి అక్కలు తొట్టెలో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు. సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి 'సుజాతుడు' అని పేరు పెట్టుకుని పెంచుకోనారంభించాడు. మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాణ్ణి ప్రసవించింది. ఆమెకు పురుడు పోసిన అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక పిల్లిని పెట్టి ఆ కుర్రవాణ్ణి కూడా కాలవలో వదిలేశారు. వాడుకూడా తోటమాలికి దొరికాడు. తోటమాలి వాడికి 'సుకేతుడు' అని పేరు పెట్టుకుని పెంచసాగాడు. తన రాణి వరసగా రెండుసార్లు గర్భవతి అయి జంతువులను ప్రసవించటం చూసి రాజు చాలా బాధపడ్డాడు, కాని రాణిపై ప్రేమ గలవాడు కనక క్షమించాడు.
మూడవసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది. ఆమె అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లనుకూడా నీటిలో వదిలేశారు. ఆ పిల్ల కూడా తోటమాలికి దొరికింది. ఆ పిల్ల చాలా అందగత్తె. ఆమె ముఖం వికసించిన పుష్పంలాగా ఉండేది. ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి. ఆమెకు తోటమాలి 'సుహాసిని' అని పేరు పెట్టుకున్నాడు.
ముగ్గురు పిల్లలూ ఇంకా చిన్నవాళ్ళుగా ఉండగానే తోటమాలి భార్య మరణించింది. అతను రాజుగారివద్ద కొలువు చాలించుకుని, ఆయన ఇచ్చిన సొమ్ముతో ఊరి బయట ఒక చక్కని ఉద్యానవనం నిర్మించుకుని, అందులో పెద్ద కుటీరం వేసుకుని, తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలాకాలం జీవించాడు. పిల్లలు ఎదిగివచ్చే సమయానికి తోటమాలి చనిపోతూ సుహాసినిని ప్రాణంతో సమంగా కాపాడమని సుజాతుడికి, సుకేతుడికి చెప్పిపోయాడు. అన్నలు ఎప్పుడైనా వేటకు వెళ్లేవారు గాని సుహాసిని ఎన్నడూ తన ఉద్యానవనం దాటి బయటికి వెళ్ళి ఎరగదు.
ఒకనాడామె ఆ ఉద్యానంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసలిది వచ్చి, "ఆహా, ఎంత చక్కని తోట! ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉంది! కాస్సేపు ఇక్కడ కూచుని పోనిస్తావా, తల్లీ?" అని సుహాసినితో అన్నది. సుహాసిని ఆ ముసలిదానితోబాటు చెట్ల నీడన కూచుని, "ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయా, అవ్వా?" అన్నది. "మాట్లాడే పక్షి, పాడే చెట్టూ, జీవజలమూ ఉన్నట్టయితే ఈ తోటలాటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందా, తల్లీ?" అన్నది ముసలిది.
ఆ మూటినీ ఎలాగైనా సాధించాలని సుహాసినికి తోచింది. "అవి ఎక్కడ ఉంటాయవ్వా?" అని ఆమె ముసలిదాన్ని ఆత్రంగా అడిగింది. "తూర్పుగా బయలుదేరి ఇరవై రోజులు గుర్రంమీద ప్రయాణం చేసి అరవయ్యో రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేవీ చెబుతాడు. కాని వాటిని తీసుకురావటం సులభంకాదు, తల్లీ!" అన్నది ముసలిది, లేచి తన దారిన బయలుదేరుతూ.
అన్నలు ఇంటికి రాగానే సుహాసిని వారితో ముసలిదాని మాటలు చెప్పింది. అంతా విని సుజాతుడు, "నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానంలో ఉంచుతాను!" అన్నాడు. అతను మర్నాడే తన గుర్రం ఎక్కి తూర్పుగా బయలుదేరాడు. అతను ఇరవై రోజులూ పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్య మధ్యంలో ఉన్న ఒక పెద్ద కొండ దగ్గిరికి వచ్చాడు. కొండ కింద గల ఒక మహావృక్షం కింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆ రోజు తనకు కనబడిన మొదటి మనిషి ఆయనే గనక సుజాతుడు ఆయనను పలకరించి, "మునీశ్వరా, మాట్లాడే పక్షి, పాడేచెట్టూ, జీవజలమూ ఎక్కడ ఉంటాయో దయచేసి చెబుతారా?" అని అడిగాడు. "అవి ఈ కొండ శిఖరంపైనే ఉన్నాయి. కాని వాటికోసం వెళ్లినవారెవరూ తిరిగి రాలేదు, నాయనా!" అన్నాడు కపిలుడు.
సుజాతుడు భయపడక కొండ ఎక్కసాగాడు. అతనికి దారివెంబడి నల్లరాతి మనుష్య విగ్రహాలు కనిపించాయి. మనుష్యులే శిలలుగా మారారని అతనికి తెలియదు. కొంతదూరం వెళ్ళేసరికి అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్టూ, భయపెడుతున్నట్టూ అనిపించింది. అతను ఆగి అటూ ఇటూ పరీక్షగా చూశాడు. మరుక్షణం అతనుకూడా ఒక శిల అయిపోయాడు.
నలభైరోజులు గడిచినా తన అన్న తిరిగి రాకపోవటం చూసి సుకేతుడు బయలుదేరాడు. వెళ్ళవద్దని సుహాసిని ఎంత బతిమాలినా అతను వినలేదు. అతనుకూడా అన్నలాగే కపిలుణ్ణి చూసి, ఆయన వద్దంటున్నకొద్దీ కొండ ఎక్కి, కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్లరాతి శిల అయిపోయాడు.
తన అన్నలు తిరిగి రారని రూఢికాగానే సుహాసిని హృదయం రాయిలాగా అయిపోయింది. ఆమె కనీసం వారినైనా తెచ్చుకుందామనే ఉద్దేశంతో గుర్రమెక్కి బయలుదేరి కపిలుడుండే చోటికి వచ్చింది. ఆమె తన సంగతి యావత్తూ ఆయనతో చెప్పుకుని, "మునీశ్వరా, నా అన్నలు ఇటుగా వచ్చారా?" అని కపిలుణ్ణి అడిగింది. "వచ్చారు. వారు శిలలైపోయారమ్మా!" అన్నాడు కపిలుడు. "స్వామీ, వారిని బతికించుకోవటమెలాగ? వాళ్ళు తప్ప నాకు దిక్కులేదు," అన్నది సుహాసిని. "ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షినీ, పాడే చెట్టునూ, జీవజలాన్నీ తెచ్చుకుంటేనే నీ అన్నలను బతికించుకోగలవు. నీవు వాటి కోసం కాక, నీ అన్నలకోసం పోతున్నావు గనక నీకు విజయం లభిస్తుంది!" అన్నాడు కపిలుడు.
ఆమె కొండ ఎక్కేటప్పుడుకూడా కేకలూ, అరుపులూ వినిపించాయి. కాని ఆమె వాటికి బెదరలేదు. ఆమె కొండ శిఖరాన్ని చేరుకుని అక్కడ పంజరంలో ఉన్న పక్షిని చూసింది. అదే మాట్లాడే పక్షి. ఆ పక్షి ఆమెకు పాడే చెట్టునూ, జీవజలం ఉన్న మడుగునూ చూపింది. ఆమె పాడేచెట్టు మండ ఒకటి విరుచుకుని, జీవజలం తీసుకుని పక్షితోసహా బయలుదేరింది. ఆమె దారిలో ఉన్న శిలలన్నిటిపైనా జీవజలం ఒక్కొక్క చుక్కవేస్తూ వచ్చింది. అక్కడవున్న రాళ్ళన్నీ రాజకుమారులుగా మారాయి. వారిలో ఆమె అన్నలుకూడా ఉన్నారు. ముగ్గురూ కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు.
తోటలోకి మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడి పాడే పక్షులూ వచ్చి తోటలో కాపరం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి. పాడేచెట్టు మండ పాతిపెట్టగానే దాని ఆకులు పాడసాగాయి. ఆ పాట వినటానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి. జీవజలం ఒక చుక్క వేసేటప్పటికి ఆ తోటలోని నీటికాలవలన్నీ గలగల శబ్దం చేస్తూ ఏడాదిపొడుగునా పారటం ఆరంభించాయి. సుహాసిని ఉండే తోటనుగురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు. రాజుగారికికూడా ఈ వార్త తెలిసింది. తన భార్య మూడవసారికూడా జంతువును కన్నట్టు తెలిసినాక ఆయన ఆమెను కారాగృహంలో పెట్టించాడు. అది మొదలు ఆయన ఆనందమన్నది ఎరగడు. ఈ తోటలో కాస్సేపు కూచుంటే మనస్సు బరువు తగ్గుతుందేమోనని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడికి వచ్చాడు.
ఆ సమయాన సుహాసిని ఒంటరిగా ఉన్నది. రాజుగారు తనకు అతిథిగా వచ్చాడని తెలియగానే ఆమె కంగారుపడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్లి, "పక్షి, పక్షి! రాజుగారికి ఏమి వంటకాలు చెయ్యమన్నావు?" అని అడిగింది. "ముత్యాలు కూరిన అరిసెల్లు వండి పెట్టు!" అన్నది పక్షి. సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజుముందు పెట్టింది. రాజు ఒక అరిసెను విరిచిచూసి, "ఇదేమిటి, ఇందులో ముత్యాలు కూరారు. ఇలాటి వంటకం ఎక్కడైనా ఉంటుందా?" అని ఆశ్చర్యంగా అడిగాడు.
"రాణి గర్భవాసాన కుక్కలూ, పిల్లులూ, ఎలుకలూ పుట్టటం ఎక్కడైనా ఉందా, మహారాజా?" అని మాట్లాడే పక్షి ఆయన్ను అడిగింది. రాజుకు గుండె గతుక్కుమన్నది. "నా భార్య పిల్లలనే కన్నదా? వారేమయారు?" అని ఆయన పక్షిని అడిగాడు. సరిగా ఆ సమయానికే సుజాతుడూ, సుకేతుడూ వేట నుంచి తిరిగివచ్చారు. "ఇదుగో నీ పిల్లలు!" అన్నది మాట్లాడే పక్షి వారిని రాజుకు చూపుతూ. రాజుకంట ఆనందబాష్పాలు రాలాయి.
ఆయన తన పిల్లలను ఆలింగనం చేసుకుని ఇంటికి తీసుకుపోయాడు. తన భార్యను చెర విడిపించి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కలు తనకు తీరని ద్రోహం చేసినా రాణి వారిని క్షమించింది. తరవాత యశోధన మహారాజు తన భార్యతోనూ పిల్లలతోనూ సుఖంగా జీవించాడు.
No comments:
Post a Comment