Friday, March 27, 2026

👂 పాపం చెవి గోల వినండి.

 🙏

👂 పాపం చెవి గోల వినండి.

  హలో నేను మీ చెవిని👂
  మేము  ఇద్దరము, కవలలము👂👂, కానీ  మా దురదృష్టమేమిటంటే,   
ఇప్పటి వరకు మేము
ఒకరినొకరు చూసుకోలేదు .
 ఏ శాపమో తెలియదు  
 మేము ఎడ మొహం పెడ మొహంగా అమర్చబడ్డాము.
మా బాధ్యత కేవలము 
 వినడము మాత్రమే. 
 తిట్లు, చప్పట్లు, చాడీలు, పొగడ్తలు, మంచి, చెడు అన్నీ ఒకేలా మేమే వింటాము. 
  
 కానీ  క్రమ క్రమంగా మమ్మల్ని వస్తువుల్ని వేలాడదీసే ఆధారాలుగా మార్చేశారు. కళ్ళ జోడు బరువును మాపై  మోపుతున్నారు. సమస్య కళ్లదైతే, చావు మోత
 మాకేమిటి ? చిన్నతనంలో చదువుకునేటప్పుడు 
ఎవరికైనా మెదడు పని 
చేయకపోతే మాస్టరు గారు 
మమ్మల్నే మెలేస్తారు మాకేంటి సంబంధం చెప్పండి మాస్టారూ 
 
  యవ్వనంలో పురుషులు, 
  మహిళలు అందరూ 
  అందమైన జూకాలు,
  కమ్మలు, లోలకులు 
  మొదలైనవి చేయించుకొని  
  మాపైన వేలాడదీస్తారు. 
 రంద్రాలు చేయడం, రక్తాలు కారడం  నొప్పులు మాకైతే, అందరి పొగడ్తలు మాత్రము  ముఖానికి ఎంత దారుణమో చూడండి. 

 ఎప్పుడైనా ఏ కవి అయినా 
 ఏ ప్రవచన కారులు అయినా చెవుల గురించి ప్రశంసిస్తూ పొగిడారా చెప్పండి.వారి దృష్టిలో  
పెదవులు, చెంపలు సొగసైన కళ్ళు ఇవే మీకు సర్వస్వము మేము గుర్తుకు రాం మీకు . 
  
కళ్లకు బాధ కలిగితే కన్నీరు కారుస్తాయి. ముక్కుకు బాధకలిగితే చీదుతుంది, నోటికి బాధ కలిగితే అబ్బో, అయ్యో  అమ్మా అని అరుస్తూ గోలగోల చేస్తుంది . మరి మాకు బాధ కలిగితే బయటకు తెలియకుండా లోలోపలే భరించాలా ఏం పాపం చేసాము .

ఇక పోతే పెన్నులు, పెన్సిళ్లు, అగ్గి పుల్లలు,  సిగరెట్లు, బీడీలు ఇలా ఎవరికి కావలసింది వారు మా లోపల దాస్తుంటారు.

ఇదివరకు హెడ్ ఫోన్లని మాకు మూతలు వేసేవారు, ఇప్పుడు పైత్యం పెరిగి, ఇయర్ ఫోన్లని మాలోపలికి తోసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏమండీ ఒక్కసారి మీ ముక్కులోకి నోట్లోకి ఏదైనా కూర్చేసి కొంతసేపు మూతవేసి చూడండి ఏం  జరుగుతుందో. 

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా మాయరోగం మా చావుకు వచ్చింది. ముక్కు, మూతి మూసుకోవడానికి వేసుకునే మాస్కులను కూడా మాకే తగిలిస్తున్నారు. మేము చెవులమండీ, చెక్క కొయ్యలం కాదు, ఏది పడితే అది వ్రేలాడెయ్యడానికి. 

బాబుల్లారా! మీకిష్టమొచ్చినట్లు కాకుండా మా పనికి మాత్రమే మమ్మల్ని వాడండి. చెవులే కదా అని చిన్న చూపు చూడకండి. మేం సంయమనం కోల్పోయామంటే మీరు కళ్ళు తిరిగి కింద పడతారు,మీరు నిలబడటానికి బాలన్సు ఇచ్చేది మేమే అన్న ఈ విషయం తెలుసా మీకు, ఏం అనుకుంటుంన్నారో మాతో పెట్టుకోకండి తస్మాత్ జాగర్త, మాకిచ్చే గౌరవం మాకు ఇవ్వండి మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం ఇక సెలవండి.

👂👂👂 *ప్రపంచ వినికిడి దినోత్సవం శుభాకాంక్షలతో*👂👂👂 *ప్రపంచ వ్యాప్తంగా 6.3 కోట్లమంది వినికడిలోపంతో బాధపడుతూన్నారని వినికిడి*
(ఒక సర్వే).

🙏

No comments:

Post a Comment