🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సకల గుణాభిరాముడు*
➖➖➖✍️
```
*పురుషుడు పుణ్యపురుషుడిగా రాణించాలంటే ఉత్తమగుణాలు అలవరచుకొని జీవనం సాగించాలని స్కాందపురాణం చెబుతోంది.
*ఉత్తములంటే ఎవరు, ఎటువంటివి ఉత్తమగుణాలని నారదుణ్ని అడిగాడు వాల్మీకి. ఇతరులకు ఏ మాత్రం కష్టం కలిగించక, వారిని సదా ప్రేమిస్తూ, ప్రజోపకర చర్యలతో అందరి హృదయాలను చూరగొనే గుణాలు కలిగినవాడే ఉత్తముడు, అతడు పాటించే గుణాలే శ్రేష్ఠమైనవని చెప్పాడు నారదుడు. అటువంటి వ్యక్తి ఉత్తమ గుణాలను లోకానికి విశదపరచాడు.
*త్వరగా కార్యాన్ని నిర్వహించమని ఇతరులు చెప్పేముందే దాన్ని నిర్వహించి మెప్పు పొందే లక్షణం ఉత్తములది.
ఇది విజయానికి సోపానం. ఎల్లవేళలా శ్రీరాముడు దీన్ని ఆచరించి చూపించాడు. కార్యంపట్ల అలసట ప్రదర్శించక దీక్షతో ముందుకు సాగాలి.
*యుద్ధరంగంలో రాత్రింబగళ్లు పద్నాలుగు వేలమంది రాక్షసులను అలవోకగా జయించి, ఏ మాత్రం అలసట కనబరచనివాడు రాముడు.
*ధర్మాన్ని ఆచరించడం మహాపురుషుల లక్షణం. రాజ్యార్హత నీకే ఉందని భరతుడు ఎంత వేడినా, అతడి ప్రార్ధనను సున్నితంగా తిరస్కరించి ధర్మాన్ని, ధర్మస్వరూపాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించాడు రఘురాముడు.
*జటాయువు చేసిన మేలును గుర్తుంచుకొని అతడి అంతిమ సంస్కారాన్ని తానే స్వయంగా నిర్వహించి కృతజ్ఞతకు మారుపేరై నిలిచాడు రాఘవుడు.
*అగ్నిసాక్షిగా ఏర్పరచుకొన్న స్నేహబంధాన్ని దృఢతరం చేస్తూ సుగ్రీవుణ్ని రాజును చేసేందుకు వాలి వధకు పూనుకొన్న సత్యవాక్పరిపాలకుడు రఘునందనుడు.
*తండ్రి ఆదేశాన్ని తలదాల్చి పితృవాక్పరిపాలన అనే దృఢవ్రతాన్ని చేపట్టిన వందనీయుడు దాశరథి.
*విశ్వామిత్రుడి వెంట కారడవుల్లో సాధారణ వ్యక్తిలా సంచరించి, కంద మూలాలు స్వీకరించి భూశయనం చేశాడు దశరథనందనుడు. గురువు చెప్పిన రాక్కసిమూకలను మట్టుపెట్టి ఆనందం కలిగించాడు.
*కబంధుడి వధానంతరం ఉదారహృదయంతో అతడికి అగ్ని సంస్కారం చేసిన కరుణాంతరంగుడు.
*శ్రద్ధాసక్తులు కనబరచి, క్రమశిక్షణతో సకల శాస్త్రాలు, వేదవేదాంగాలు నేర్చి వాటి ఆవశ్యకతను లోకానికి అందించాడు.
*కార్యదీక్షాదక్షుడై అపార పారావారధిని దాటి దుర్భేద్యమైన లంకను చేరి అరివీరభయంకరుడై శత్రుసేనను నిర్జించాడు.
*అంతులేని భక్తివిశ్వాసాలతో తనను వేడిన ముని బృందాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకొని శత్రుమూకలను చీల్చిచెండాడిన అభయమూర్తి.
*కోపాన్ని జయించినవారు జితక్రోధులు. తనను అడవికి పంపిన పినతల్లి కైకను కొంచమైనా నిందించక, శాంతవర్తనుడై ఆమె పాదాలకు ప్రణమిల్లిన పుణ్యమూర్తి శ్రీరాముడు.
*అపూర్వ తేజస్సుతో వెలుగొందుతూ శత్రువులకు కంటిపై కునుకు లేకుండాచేసిన కాంతిమంతుడు.
*ఇతరుల దోషాలను లెక్కించనివాడు, అసూయ అంటే తెలియనివాడు రాఘవుడు.
*తనవారి దోషాలను ఎంచక, రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి, అడవులపాలైన రాముడు స్తవనీయుడు.
*ధర్మపరిరక్షణ కోసం వీరత్వం ప్రదర్శించి శత్రువులకు గుణపాఠం చెప్పమని బోధిస్తోంది రాజనీతి. యుద్ధంలో వైరివీరులను తుద ముట్టించి లోకకల్యాణానికి నాందిపలికాడు శ్రీరామచంద్రుడు.
*ఇన్ని గొప్ప గుణాల మేలుకలయికే రాముడి జీవితం అని చెప్పాడు నారదుడు.
*అందుకే ఆయన సకల గుణాభిరాముడు.
వీటిలో కొన్నింటినైనా అందిపుచ్చుకొని ఆచరిస్తే మానవ జీవితం ధన్యమవుతుంది.🙏```
-మాడుగుల రామకృష్ణ✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment