సమాధానం... సాధికారికంగా!
విత్తనం ఏ చెట్టుదో తెలుసుకోవడానికి ఎవరినైనా అడిగితే వచ్చే సమాధానం సరైందో కాదో కచ్చితంగా తెలియదు. కానీ, దాన్ని మట్టిలో విత్తి కొంతకాలం వేచి చూస్తే మొక్క మొలిచి సాధికారిక జవాబు దొరుకుతుంది. విత్తనమే దృశ్య రూపంలో సమా ధానం ఇచ్చిందన్న మాట. ప్రకృతి ఎవరి తరఫునో వకాల్తా పుచ్చుకుని పక్షపాతవైఖ రితో చెప్పదు. సహజాతి సహజంగా సాగుతుంది కాబట్టే ప్రాకృతిక చర్య ప్రామాణికం. ప్రశ్న విత్తనమైతే పంట సమాధానం. విత్తనాలు నాటితే గానీ పంట పండదు. అదే రీతిన ప్రశ్నలు లేకుండా విజ్ఞాన ఆవిష్కరణలు పురివిప్పుకోవు. విత్తనం, పంట వేర్వేరు కాదు. విత్తనం పంటలో ఒక భాగం. అలాగే సమస్య, పరిష్కారమూ వేర్వేరు కావు. ఒక్కోసారి సమన్యే పరిష్కారమని తెలిసి ఆశ్చర్యపోతాం. కార్యాలయంలో ఒక పని ఆగిపోవడానికి పలు కారణాలు ఉండ వచ్చు. అది కాదు ముఖ్యం. 'పని జరగ లేదు' అన్నదే సమస్యను సృష్టిస్తుంది. అందువల్ల ఆ పని పూర్తవడం అనేది సమస్యకు ముగింపు పలుకుతుంది. విధంగా సమస్యే పరిష్కారం అవుతుంది. పరిహాసానికి, ఆట పట్టించడానికి తలా తోకా లేని ప్రశ్నలు గుప్పించి విలువైన కాలాన్ని వృథా చెయ్యడం అర్థంలేని పని. ఒక్కోసారి అనూహ్యమైన ప్రశ్నలు ఎదురై నప్పుడు అసహనానికి గురవడం వల్ల విచక్షణ జ్ఞానం కోల్పోతారు. కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ కారణంగా అమాన వీయ సంఘటనలూ చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. శాంతి, సహనం వహించినప్పుడు కాలమే ఉత్తమ సమాధా నాలను అందిస్తుంది.
జ్ఞానతృష్ణ అనేది జ్ఞానం కోసం పరితపించే బలమైన వాంఛ. అది అనేక ప్రశ్నలు సంధిస్తుంది. అందువల్లే ఎదిగే పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తుంటారు. వారికి ఏ మాత్రం విసుక్కోకుండా సమాధానాలు చెప్పాలి. దాన్ని బాధ్యతగా భావించి అనుభవ భాండాగారాన్ని పంచాలి. అప్పుడే సమాజ పురోభివృద్ధికి మన వంతు కర్తవ్యం నిర్వర్తించిన వాళ్లమవుతాం. సత్యం పరిధి లేనిది. జ్ఞానం అనంతమైంది. వీటి అన్వేషణలో, ఆవిష్కరణలో ప్రశ్నలు కీలకమైనవి. దేవుణ్ని చూశారా అని అడిగాడు నరేంద్రుడు రామకృష్ణ పరమహంసని. దానికి వివేకానందుడి ఛాతీపై తన పాదాన్ని ఉంచి అనిర్వచనీయమైన సమాధానం ఇచ్చారాయన. దుఃఖానికి మూలం ఏమిటన్న సిద్ధార్థుడి ప్రశ్న ఆయనను అడవుల బాట పట్టించింది. అక్కడ సత్యాన్వేషణకు సంబం ధించిన ప్రశ్నలు లేవనెత్తుతూ మునులు, రుషుల మధ్య కొన్నేళ్లు గడిపాడు. చివరిగా ఒక రుషిపుంగవుణ్ని కలిసి తన సందేహాన్ని ఆయన ముందుంచాడు. అప్పుడా మునీ శ్వరుడు ఇలా చెప్పాడు... 'చూడు గౌతమా, ప్రతిదీ చెప్పడానికి వీలుపడదు. చెప్పలేని దాన్ని ఎలా చెబుతారు? శిష్యుడితో గురువు కొంత దూరమే రాగలడు. ఆ తరవాత శిష్యుడే ఒంటరి పయనం చెయ్యాలి. ఎందుకంటే, ఆ ఇరుకైన దారిలో ఒక్కరు మాత్రమే నడవగలరు. ఆ అంతిమ సత్యాన్ని ఎవరికి వారే కనుక్కోవాలి'. ఆ అన్వేషణలోనే వ్యక్తిగత, సామూహిక ఉన్నతికి మార్గం దొరుకుతుంది.
మునిమడుగుల రాజారావు
No comments:
Post a Comment