*_ఎవరు సరైన వారసుడు...?_*
_[విశ్వనాథ్ పటేల్ గారి *మనం కాని మనం* అనే పుస్తకం నుంచి...]_
🔁🔁🔁⛔🔀🔀🔀
*ఒక రాజుకు ముగ్గురు కొడుకులు, రాజు ముసలి వాడయ్యాడు. వారసత్వ సమస్య వచ్చింది. ఏ కొడుక్కి రాజ్యభారాన్ని ఒప్పగించాలా... అన్న ఆలోచన వచ్చింది. రాజుకు ముగ్గురు కొడుకులన్నా యిష్టమే. ఒకణ్ణి కాదని ఒకడికి రాజ్యాన్ని ఒప్పగిస్తే వాళ్ల మధ్య కలతలు వస్తాయి. అభిప్రాయ భేదాలు వస్తాయి. అందుకని తన మంత్రిని సలహా అడిగాడు.*
*మంత్రి ఆమోదయోగ్యమైన ఒక మంచి సలహా ఇచ్చాడు. ఆ విషయాన్ని ముగ్గురు కొడుకులకు చెప్పి దాన్ని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారో వాళ్లకు రాజ్యాన్ని ఒప్పగించమని మంత్రి చెప్పాడు. రాజుకు మంత్రి సలహా బాగా నచ్చింది.*
*ఒక రోజు ముగ్గురు కొడుకుల్ని పిలిచి వాళ్ళకు తలా ఒక గోధుమల సంచి యిచ్చి.. _"నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను. రావడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టవచ్చు. నేను వచ్చేదాకా మీకు యిచ్చిన గోధుమల్ని భద్రంగా దాచి నేను తిరిగి వచ్చాక తిరిగి నాకు యివ్వండి"_ అన్నాడు. కొడుకులు సరే అన్నారు. రాజు పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తూ... తాను తిరిగి వచ్చేదాకా రాజ్య పరిపాలనను జాగ్రత్తగా చూసుకోమని మంత్రికి బాధ్యతలు అప్పగించి బయలుదేరాడు.*
*రాజు తీర్థయాత్రలకు వెళ్లిపోయాక, పెద్ద కొడుకు తనకిచ్చిన గోధుమల్ని ఎట్లా రక్షించాలి? ఎట్లా భద్రపరచాలి? అన్న ఆలోచనలో పడ్డాడు. గాలి ఏమాత్రం చొరకుండా ఉండే పెద్ద ఇనుప పెట్టెలో పెడితే ఇవి భద్రంగా ఉంటాయి. ఇక వాటి గురించి ఆలోచించే పనే ఉండదు' అనుకుని వాటిని పెట్టెలో పెట్టి తాళం వేశాడు.*
*రెండో కొడుకు... వీటిని అన్న లాగా పెట్టెలో పెడితే ఇవి చెడిపోతాయి. పొలంలో చల్లితే అన్ని పంటల్లాగా ఇవీ పండుతాయిగదా..! అని పొలంలో చల్లేసి నిమ్మళంగా ఉన్నాడు. పొలంలో చల్లేముందు పొలం దున్ని, ఎరువు వేసి సక్రమంగా నాటితేనే అవి ఎదుగుతాయని అతనికి తెలీదు.*
*ఇక మూడో కొడుకు భూమిని సక్రమంగా దున్నించి, ఎరువులు వేసి గోధుమల్ని నాటాడు.*
*మూడేళ్ల తరువాత తీర్థయాత్రలు ముగించుకుని రాజు తిరిగి వచ్చాడు. పెద్దకొడుకును పిలిచి గోధుమల గురించి వాకబు చేశాడు. పెద్దకొడుకు ఇనుప పెట్టెను తెరచి చూపించాడు. గోధుమలన్నీ పుచ్చి పురుగులు పట్టాయి. అప్పుడు రాజు పెద్దకొడుకుతో... _"నేను నీకు ప్రాణమున్న, తాజాగా ఉన్న గోధుమ గింజలిచ్చాను. వాటిని వేయింతలుగా చేసే వీలుండి కూడా నువ్వు బద్ధకించి వాటిని నాశనం చేశావు. రేపు నీకు రాజ్యమిచ్చినా అట్లానే నాశనం చేస్తావు"_ అన్నాడు.*
*తరువాత రెండో కొడుకుని గోధుమల గురించి అడిగాడు. రెండోకొడుకు మూడేళ్ల క్రితం గింజల్ని పొలంలో చల్లి వచ్చేశాడు. అవి ఉన్నాయా? మొలిచాయా? పెరిగాయా? పంట వచ్చిందా? అని కూడా పట్టించుకోలేదు. తండ్రిని తీసుకుని పొలానికి వెళితే అక్కడ పిచ్చి మొక్కలు వున్నాయి. గోధుమ పంటే లేదు. రాజు రెండో కొడుకుతో _"నీకు రాజ్యమిచ్చినా ఇలాగే నిర్లక్ష్యంగా పాలిస్తావు. అంతా అస్తవ్యస్తమవుతుంది"_ అని ఆగ్రహించాడు.*
*చివరగా మూడోకొడుకు తండ్రిని పొలానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఏపుగా పెరిగిన గోధుమ పంట కళకళలాడుతోంది. అప్పటికే రెండు మూడు సార్లు పంట వేసి తండ్రి యిచ్చిన గోధుమల్ని వందల బస్తాలు వచ్చేలా చేశాడు.*
*మూడో కొడుకు సమర్థతను చూసి రాజు ఎంతో ఆనందించాడు. ఇలాంటి అర్హత కలిగిన కొడుక్కి రాజ్యమిస్తే ఎంతో సుభిక్షంగా పాలిస్తాడని భావించి మూడో కొడుక్కి రాజ్యభారాన్ని ఒప్పగించాడు.*
*దేవుడు ప్రతి మనిషికీ విత్తనాలే యిస్తాడు. మన ఆనందం, ఆహ్లాదం, సంతోషం వాటిల్లో బీజరూపంగా ఉంటాయి. ఆ విత్తనాలు సక్రమంగా మొలకెత్తాలన్నా, పంటలు పండి మనల్ని పరవశింప జేయాలన్నా.. పరిస్థితులని అనుకూలంగా మలచుకోవడమన్నది మన చేతుల్లోనే ఉంది. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే.. అవి మొలకెత్తవు. మనకు దుఃఖాన్నే మిగులుస్తాయి.*
~~~~~~~~~~~~~~~~~
*_{ఈ కథ చిన్నదే... కానీ, ఎంతో గొప్ప విలువైన సందేశం ఉంది..: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు & స్టూడెంట్ మోటివేటర్, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
No comments:
Post a Comment