దేనికి చలించని, హృదయం లేని మనిషి ని కర్కోటకుడని ఎందుకు పిలుస్తారు?
కర్కోటకుడు అంటే కఠినాత్ముడు, మోసగాడు అని వాడుక.
కానీ , కర్కోటకుడు మంచినాగుడే.
అతడు
కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః స్మరణం కలినాశనమ్—
అని కలిదోషాలు శమించడానికి చెప్పిన మంత్రంలో స్మరింపబడిన ఒక పుణ్యాత్ముడు.
పాపం ; మంచివాడికే చెడ్డపేరు నిలబడింది.. నలుడికి కష్టకాలంలో అడగకుండానే సహాయం చేసినవాడు ఈ నాగుడు.
పుష్కరుడు అనే దాయాది వచ్చి జూదానికి పిలిచాడు. కాదనగూడదు గాబట్టి వెళ్లి, కాలం కలిసిరాక అంతా పోగొట్టుకొని కట్టుగుడ్డలతో అడవులు పట్టాడు నలుడు . ఇల్లాలి (దమయంతి) ఆకలిగూడా తీర్చలేని దుస్థితి అంతటి చక్రవర్తికి ఏర్పడింది.
పైన ఎగిరే పక్షులను పట్టుకొందాం — అని కట్టుబట్టను వాటిపై విసిరాడు..అవి ఆ బట్టతోపాటు ఎగరిపోయాయి..
దమయంతి ఈ దుర్దశలో తన పుట్టింటికి వెళ్లినా సుఖపడుతుంది— అని ఆశించాడు.
ఆమె నిద్రించే వేళలో సగం చీర చించుకొని ఆమెను వదలలేక వదలలేక వదిలేసి వెళ్ళిపోయాడు.
పోతూ ఉండగా ఆ కారడవిలో ఒకవైపు దావాగ్ని వ్యాపించింది. రక్షించు అని ఆర్తనాదం వినబడింది. చూస్తే ఆ మంటలలో ఒక సర్పం. మనుష్యభాషలో ఆక్రందన. ఆర్తుల కష్టం పాపడం రాజధర్మం. వెళ్లి ఆ పామును ఆ దావాగ్ని నుండి బయట తీశాడు . నేలపై విడువబోతే పది అడుగులు దాటి దించు అని వేడుకొన్నది ఆ నాగం . నలుడు ఆ మహాసర్పాన్ని అడుగులు లెక్కపెడుతూ ఏకం ద్వే త్రీణి చత్వారి అంటూ ముందుకు నడుస్తూ , పది కాగానే ' దశ ' అంటూ నేలపై విడిచాడు.
వెంటనే ఆ నాగుడు కర్కోటకుడు నలుణ్ణి కాటువేశాడు.
" ఇదేమిటి? నేను నీకు ప్రాణభిక్ష పెట్టగా నీవు నా ప్రాణం తీస్తున్నావే" — అన్నాడు నలుడు.
నీవే 'దశ' అంటివే— అన్నాడతడు నవ్వుతూ. దశ అనే పదం క్రియగా గ్రహిస్తే 'కరువుము' అని అర్థం.
రాజా! నీకీ కష్టకాలంలో అపకీర్తి కలుగకుండా ఈ పని చేశాను. ఇపుడు నీకు రూపం మారిపోయి వికృతరూపం వస్తుంది . ఈ వికృత రూపంతో కాలం గడిపేస్తావు . నీకు అవసరమనిపించిన సమయంలో నన్ను స్మరించు. నీ నిజరూపం వచ్చేస్తుంది— అని చెప్పి వెళ్ళిపోయాడతడు.
నలుడు చంద్ర వంశపు రాజు. పాండవులకు పూర్వీకుడు.
నలరూపంలో బికారిగా తిరగడం చూపరుల మనసులకు బాధాకరం.. మనవల్ల ఒకరి మనసు బాధపడగూడదు.
నలుగురూ చూచి జాలిపడి "అయ్యో అంతటి చంద్ర వంశపు మహారాజు ఇలా అయిపోయాడే"—అనిదీనత పొందగూడదు. వంశానికి ఎప్పుడూ చెడ్డపేరు తేగూడదు. ఉత్తముడి ప్రవర్తన ఎపుడూ ఉదాత్తంగా ఉంటుంది .
నలుడు కర్కోటకుడి చర్యకు సంతృప్తి చెందాడు .
ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడుగా ఆ శనిదశాభుక్తి రెండున్నర సంవత్సరం అనుభవించాడు. తదనంతరం భార్యాబిడ్డలను కలుసుకొని రాజ్యభోగాలు అనుభవించాడు.
ఇక్కడ ఉపకారం చేసినవాడికే అపకారం చేసినవాడుగా సామాన్యుల దృష్టికి కనిపిస్తాడు కర్కోటకుడు.
ఈ చేష్ట ఆయన పేరుకు అప్రతిష్ఠను తెచ్చిపెట్టింది.
No comments:
Post a Comment