Friday, March 27, 2026

 సత్యభామ నిజంగానే పొగరుగా ఉండేదా? లేకపోతే నాటకాలు, సినిమాలు ఆమె స్వభావాన్ని మార్చేసాయా?
 

స్వర్ణకమలం సత్యభామ

తెలుగు కావ్యాలలో నరకాసురవధ ఘట్టంలో సత్యభామ ప్రసక్తి నాచన సోముని ఉత్తర హరివంశంలో వస్తుంది. ఆ ఘట్టాన్ని మరింత రమణీయంగా పోతనామాత్యులు తీర్చిదిద్దారు. నరకాసుర వధకై కృష్ణుడు బయలుదేరుతున్న సమయంలో సత్యభామ తాను కూడా వస్తానని అడుగుతుంది. ఎందుకు రావాలనుకుంటుందో కారణం కూడా చెప్తుంది. యుద్ధంలో నీ వీరపర పరాక్రమాలు చూసి ఇంటికి తిరిగి వచ్చాక ఆ విషయాలన్నీ నీ దేవీ సంఘానికి చెప్పాలని ఉంది అంటుంది.

శ్రీకృష్ణుడు యుద్ధం అంటే ఎంత భయంకరమైనదో చెప్పి ఆమెను నివారించే ప్రయత్నం చేస్తాడు. ఆమె దానవులయితే భయం దేనికి, నీ మానిత బాహుదుర్గమున మాటుగ ఉండగ నేమి శంక అని చెప్పి చేతులు జోడించి మొక్కుతుంది. భర్తపై చాలా నమ్మకము, వినయము ఉన్న సౌశీల్యవతి సత్యభామ.

సత్యభామ విషయము గురించి ఉన్న గ్రంథాలలో తరువాతది పారిజాతాపహరణం. శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియమైన సతులు రుక్మిణి, సత్యభామ. ఇద్దరి మధ్య రవరవలు ఉండేవని నంది తిమ్మన గారు కావ్యం మొదట్లోనే చెప్పారు. సత్యభామ మాత్రమే అసూయతో రగిలిపోయేది అన్నది వట్టి మాట. ఆమె పుణ్యకవ్రతం చేసిన మాట వాస్తవం. భర్తను నారదునికి దానం చేసిన సంగతి కూడా నిజమే. అయితే సత్యభామ మాత్రమే పుణ్యకవ్రతం చేసి పతిని దానమివ్వలేదు. కొడుకు కలగాలన్న కోరికతో జగజ్జనని పార్వతీదేవి పుణ్యకవ్రతం చేసి భర్తను సనత్కుమారునికి దానం ఇచ్చింది. సనత్కుమారుడు శివుని పార్వతికే తిరిగి సమర్పించాడు. సత్యభామ విషయంలోనూ జరిగినది అదే.

ఉత్తర హరివంశంలో రుక్మిణి శ్రీకృష్ణునితో "చూచెదమను సవతులచే నీ చులుకదనమ్ము చేరనీకుము కృష్ణా" అంటుంది. సవతులలో చులకన కారాదన్న కోరిక రుక్మిణిది. కృష్ణునికి సందేశం పంపుతూ తనను ఎప్పుడు ఎక్కడ ఎలా హరణం చెయ్యవచ్చునో చెప్పిన తెలివితేటలు రుక్మిణి సొంతం.

సత్యభామ పాత్ర మళ్లీ ఎక్కువగా కనిపించేది భామాకలాపంలో. ఈ నృత్య రూపకంలో ప్రణయ కలహ సమయంలో అలిగిన శ్రీకృష్ణుడు సత్య నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ఆమె భర్తకి రాయబారం పంపుతుంది. భర్త రాకకై ఎదురుచూస్తుంది. ఎంతో విరహవేదనను అనుభవిస్తుంది. భర్త వస్తున్నాడు అని తెలిసి ఎంతో ఆనందిస్తుంది. భామాకలాపం లో సత్యభామ ప్రణయ స్వరూపిణి.

వినయము సౌశీల్యము ప్రణయము మూర్తీభవించిన సత్యభామ పాత్రను గర్విష్టిగా తీర్చిదిద్దడం ఏ కారణంగా ఎప్పుడు ప్రారంభమై ఉండవచ్చును? 1857 సిపాయిల తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తరువాత విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తీసుకుంది. ఆమె స్త్రీ విద్యకు వ్యతిరేకి. ఆడవాళ్లు చదువుకుంటే సంఘమే నాశనం అయిపోతుందన్న నమ్మకం ఆమె చాలాసార్లు వ్యక్తపరిచింది.

అవే భావాలు ఆమె ఏలుబడిలో ఉన్న భారతదేశంలో కూడా ప్రవేశించి ఉంటాయి. (నేటికీ చాలా విక్టోరియల్ మోరల్స్ ని భారతీయులు, ముఖ్యంగా హిందుత్వ వాదులు, వదులుకోవడం లేదు). స్త్రీకి విద్య ఉండరాదు అన్న నమ్మకం ఉన్నప్పుడు నరకాసురునితో యుద్ధం చేసిన సత్యభామ పాత్ర ఆనాటి ప్రజలకు నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అందుకే సత్యభామ పాత్రను కొంత హీనంగా చూపించే ప్రయత్నంలోనే ఈ కృష్ణతులాభారం నాటకరచన జరిగి ఉంటుంది. ఆ నాటకాన్ని చాలాసార్లు ప్రదర్శించారు. తరువాత సినిమాలగా కూడా తీశారు. సత్యభామను గర్విష్టిగా చూపించడంలో పూర్తిగా ఫలితం సాధించారు. ఎంత గర్విష్టిగా చూపించారంటే ఒక సినిమాలో సత్యభామ ఆంజనేయ స్వామిని ఒరేయ్ ఆశీర్వదిస్తాను రారా అనేటంతగా చిత్రీకరించారు.

భాగవతంలో, ఉత్తర హరివంశంలో సత్యభామ వినయవతి, వీరవనిత. పారిజాతాపహరణం, భామా కలాపంలో సత్య ప్రేమ స్వరూపిణి, ప్రణయ రూపిణి.

ఆమెను గర్విష్టిగా చూపినది ఆధునిక తెలుగు రచనలలో మాత్రమే.

రూప గోస్వామి రాధయే సత్యభామగా జన్మించిందని రాశారు. తమిళనాడులో సత్యభామ పేరు సర్వసాధారణం. శ్రీకృష్ణ అష్టోత్తరం లో సత్యభామారతాయ నమః అని మాత్రమే ఉంది.

రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే

No comments:

Post a Comment