*ముక్తి అంటే ఏమిటి?*
సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు.అందుకే అంటారు. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది? వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? అని--- అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని----- ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు -
సామాన్యంగా.మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు. శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసాలిచ్చినా, యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా; సత్కర్మలు - పుణ్యకార్యాలు ఎన్ని చేసినా, దేవతలను ఎంతగా పూజించినా ముక్తిలేదు.వందమంది బ్రహ్మలకాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు - అని.మరి ఎలా వస్తుంది?
'ఆత్మైక్య బోధేన' -
నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు.పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే, వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. అయితే ముక్తి పొందాలనుకున్నవారు - మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి - మనసు పరిశుద్ధమై నిష్కామంగా - ఎట్టి కోరికలు లేకుండా కలిగేంతవరకు కర్మలను చేయాలి. అలా చేయగా, చేయగా మనసు, బుద్ధి దాటి ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఏప్పుడైతే ఆత్మసాక్షాత్కారం అవుతుందో పరిశుద్ధ మైన మనసు, పరిశుద్ధమైన బుద్ధి, ఆత్మ ఒకటే అని గ్రహిస్తావు. అప్పుడే నీకు జన్మ రాహిత్యం(ముక్తి) కలుగుతుంది
అప్పటివరకు పవిత్రమైన సత్కార్యాలు, కర్మలు చేయాల్సిందే . (వివేక చూడామణి: ఆచార్య శంకరులు)
No comments:
Post a Comment