*కథ : మమ "కారం" *
అమెరికాలో - గడియారం ముల్లు ఉదయం 10 దాటింది. మంచు తెరలు విడిపోయి సూర్యుడు మెల్లగా తొంగి చూస్తున్నాడు, ఆ గాజు కిటికీ బయట అంతా సూర్యకాంతి వెదజల్లుతూ... నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం సావిత్రికి కొత్తేమీ కాదు. కొడుకు అజయ్ ఆఫీస్ కి వెళ్ళిపోయాక, ఆ నాలుగ్గోడల మధ్య ఆమెకు మిగిలేది ఆ నిశ్శబ్దమే.
తన కొడుకు అజయ్ దగ్గరకు అమెరికా వచ్చి పది రోజులైంది. తన భర్త చనిపోయాక ఊర్లో ఒంటరిగా ఉన్న సావిత్రిని అజయ్ ఎంతో ప్రేమతో తన దగ్గరకు తీసుకువచ్చాడు. కొడుకు అజయ్ ఆఫీస్ కి వెళ్ళిపోయాక, ఆ నాలుగ్గోడల మధ్య ఆమెకు మిగిలేది ఆ నిశ్శబ్దమే. సావిత్రికి ఇంగ్లీష్ రాదు. వంటగదిలోని ఓవెన్ చేసే 'బీప్' శబ్దం కూడా ఆమెకు ఒక పరభాషా హెచ్చరికలా వినిపిస్తుంది.
సావిత్రి ది గడగడ మాట్లాడే మనస్తత్వం, అజయ్ ప్రేమున్న కొడుకే, కానీ అతని ప్రేమంతా వీకెండ్ ప్లాన్లలో, ఖరీదైన రెస్టారెంట్లలో ఉంటుంది. రోజంతా అతను మాట్లాడే ఇంగ్లీష్ మాటల మధ్య, ఆమె వెతుక్కునే తెలుగు పలకరింపులకు చోటు దొరకదు.
ఆ రోజు కూడా అంతే.. అజయ్ హడావిడిగా లాప్టాప్ పట్టుకుని "బాయ్ అమ్మ, ఫ్రిజ్లో ఫుడ్ ఉంది, వేడి చేసుకుని తిను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
సావిత్రి మెల్లగా కిటికీ దగ్గర కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో, ఎదురుగా ఉన్న విల్లా కిటికీ తెరలు తెరుచుకున్నాయి. అక్కడ ఒక ఎర్ర జుట్టు ఆవిడ (మిసెస్ స్మిత్) కూర్చుని ఉంది. వయసు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయి. జీన్స్ ప్యాంటు, టీషర్ట్ ధరించిన ఆ మహిళ ఆమె చేతిలో ఒక పుస్తకం ఉంది. ఇద్దరి మధ్య ఒక మంచు కురుసే ఖాళీ ప్రదేశం, రెండు గాజు కిటికీలు ఉన్నాయి. సావిత్రి మనసులో ఈ వయసులో ఈ జీన్స్ పాంట్లు టీషీర్ట్ లు అవసరమా ఈవిడకి, చీర లేకపోతె లేదు, ఒక నైటీ యో, డ్రెసో కట్టుకొని చావొచ్చు కదా.
సావిత్రి అప్రయత్నంగా ఆమెను చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో "నువ్వు కూడా నాలాగే ఒంటరివా?" అన్న ప్రశ్న ఉంది. మిసెస్ స్మిత్ పుస్తకం పక్కన పెట్టి, సావిత్రి వైపు చూసి ప్రతిస్పందనగా ఒక వెచ్చని చిరునవ్వు చిందించింది. ఆమె పెదవులు ఏదో అన్నాయి.. కానీ సావిత్రికి ఆ మాటలు వినబడలేదు, వినబడినా అర్థం కావు. కానీ ఆమె కళ్ళలో ఉన్న ఆత్మీయత సావిత్రికి అర్థమైంది.
మధ్యాహ్నం అయింది. సావిత్రి ఒక చిన్న ప్లేట్ లో అన్నం పెట్టుకుని తింటుంటే, అవతల స్మిత్ తన బ్రెడ్ ముక్కను చూపిస్తూ నవ్వింది. సావిత్రి తన ఆవకాయ అన్నం ముద్దను కిటికీకి చూపిస్తూ, "మా ఊరి రుచి తల్లి" అన్నట్టుగా కళ్ళతోనే సంజ్ఞ చేసింది. స్మిత్ తన కాఫీ కప్పును పైకి ఎత్తి, అభినందనగా తల ఊపింది.
భాషా లేదు, వ్యాకరణం లేదు, కేవలం మనుషుల మధ్య ఉండే సహజమైన స్పందన మాత్రమే ఉంది. ఆ రోజు సావిత్రికి ఆ ఏకాంతం భారం అనిపించలేదు. కిటికీ అవతల ఉన్న ఆ అపరిచిత వ్యక్తి, సావిత్రికి ఒక ' ఫ్రెండ్ ' లా, ఒక ' అక్క ' లా తోడుగా నిలిచింది.
రాత్రి ఎనిమిది గంటలకు అజయ్ ఇంటికి వచ్చాడు. ముఖంలో అలసట. "సారీ అమ్మ, బోర్ కొట్టిందా? రేపు నీకు తెలుగు ఛానల్స్ సెట్ చేస్తాను, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కుంటాను" అన్నాడు గిల్టీగా.
సావిత్రి: (చిరునవ్వుతో) "వద్దురా కన్నా.. ఈ రోజు నాకు ఒక కొత్త స్నేహితురాలు దొరికింది."
అజయ్: (ఆశ్చర్యంగా) "స్నేహితురాలా? ఎవరు? నీకు ఇంగ్లీష్ రాదు కదా అమ్మ.. తను నీతో ఎలా మాట్లాడింది?"
సావిత్రి: (కిటికీ వైపు చూపిస్తూ) "తనేరా.. ఆ ఎదురు ఇంట్లో ఉండే ఆవిడ. తను ఇంగ్లీష్ లో అడిగింది నాకు అర్థం కాలేదు, నేను తెలుగులో చెప్పింది తనకి అర్థం కాలేదు. కానీ, నేను భోజనం చేస్తున్నప్పుడు తను చూసి నవ్వింది.. నేను తనని చూసి నవ్వాను.
అమ్మ కళ్లలోని ఆ వెలుగు చూసి అజయ్ మనసు చలించింది. అమ్మను ఇలానే సంతోషంగా చూడాలి అని మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి అజయ్ కంటికి నిద్ర పట్టలేదు. అమ్మ మాటలు అతనిలో ఒక నిశ్శబ్ద ప్రకంపనను సృష్టించాయి.
మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ, వాక్మెన్ సైజులో ఉన్న ఒక డివైస్ ని తీసుకొని వచ్చాడు, అది "లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్". "అమ్మ, ఇది 142 భాషల్ని మార్చగలదు. నువ్వు తెలుగులో మాట్లాడితే అది ఆమెకు ఇంగ్లీష్ లో వినిపిస్తుంది, తను చెప్పేది నీకు తెలుగులో వినిపిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడు" అని వాడటం నేర్పించి, ఒక కొత్త ఆశను అమ్మ కళ్లలో నింపి వెళ్ళాడు.
గడియారం ముల్లు 11 దాటింది. మంచు తెరలు విడిపోయి సూర్యుడు మెల్లగా తొంగి చూస్తున్నాడు. సావిత్రి ఆ డివైస్ ను గుండెలకు హత్తుకుని కిటికీ దగ్గరకు వచ్చింది. అవతల స్మిత్ ఎప్పటిలాగే తన పుస్తకంతో ఉంది. సావిత్రి మెల్లగా ఆ బటన్ నొక్కి, గొంతు సవరించుకుని అంది.. "ఏవండీ .. బాగున్నారా?"
క్షణాల్లో ఆ పరికరం ఆంగ్లంలో "Hello, how you're doing" అని పలికింది. అవతల ఉన్న స్మిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కిటికీ గాజు పొరలు ఉన్నా, అక్షరాల వారధి ఆ రెండు ప్రపంచాలను కలిపేసింది. స్మిత్ నవ్వుతూ సైగ చేసింది —లోపలికి రమ్మని!
ఆ రోజు ఆ అమెరికా విల్లాలో ఒక అద్భుతం జరిగింది. తన కొడుకు అజయ్ తెచ్చిచ్చిన ఆ మెరిసే 'లాంగ్వేజ్ ట్రాన్స్టర్' పరికరాన్ని, చేతిలో ఆవకాయ సీసా ని పట్టుకుని, పక్కింటి స్మిత్ బామ్మ దగ్గరకు వెళ్ళింది. అది కేవలం ఒక సీసా కాదు.. సావిత్రికి తన ఊరి మీద ఉన్న మమకారం. స్మిత్ వంటగది ఇప్పుడు ఒక భారతీయ నేటివిటీతో నిండిపోయింది. ఆ ట్రాన్స్ లేటర్ సాయంతో వారిద్దరూ మాట్లాడుకుంటుంటే, కాలం వెనక్కి వెళ్ళింది.
వంటగదిలో కూర్చున్న స్మిత్, ఆ ఎర్రగా మెరుస్తున్న ఆవకాయను చూసి ఆశ్చర్యపోయింది. సావిత్రి దాన్ని గిన్నెలో వడ్డిస్తుంటే, స్మిత్ అది ఏదో భారతీయ 'స్ట్రాబెర్రీ హల్వా' అనుకుంది. సావిత్రి ట్రాన్స్టర్ బటన్ నొక్కి "ఇది ఆవకాయ్.. జాగ్రత్తమ్మా!" అని చెప్పేలోపే, స్మిత్ ఒక నిండు చెంచా ఆవకాయను నోట్లో వేసుకుంది.
అంతే!
మరుక్షణం స్మిత్ కళ్ళలో నుంచి గంగ ప్రవహించింది. చెవులు ఎర్రబడ్డాయి. పాపం, ఆ ఘాటు అమెరికా బామ్మకు 'అగ్నిపర్వతం' నోట్లో పడ్డట్టు అనిపించింది. ఆమె అరుపులకు, కంగారుకు పక్కింటి వాళ్ళు ఎవరో పొరపాటు పడి '911' కి కాల్ చేశారు. నిమిషాల్లో సైరన్ శబ్దాలతో పోలీసులు, పారామెడికల్ టీమ్ వచ్చారు. ఆవకాయ ఘాటుకి తట్టుకోలేక కళ్లు తేలేసిన స్మిత్ ను ట్రీట్మెంట్ జరుగుతుంది... పాపం సావిత్రి! ఏం జరుగుతుందో అర్థం కాక, చేతిలో ఆ ట్రాన్స్టర్ పట్టుకుని బిత్తరచూపులు చూస్తుంటే.. పోలీసులు ఆమెను విచారణ చేయటం మొదలుపెట్టారు...
అజయ్ కు ఫోన్ వెళ్ళింది. ఇంటికి పరుగున వచ్చిన అజయ్, అసలు విషయం తెలుసుకుని, "ఆఫీసర్.. అది పాయిజన్ కాదు, ఇండియన్ పికల్!" అని వివరించాక, పోలీసులు కూడా నవ్వుకుంటూ సావిత్రిని పంపించేశారు.
ఆ రాత్రి సావిత్రికి చిన్నపాటి జ్వరం వచ్చింది. "నా వల్ల అనవసరంగా ఆవిడ ఇబ్బంది పడింది" అన్న బెంగ ఆమెను చుట్టేసింది. మరుసటి రోజు సావిత్రి ఆ కిటికీ వైపు చూడటానికి కూడా భయపడింది. అమ్మ పరిస్థితి చూసి అజయ్ ఆఫీస్ కు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇద్దరూ కలిసి మౌనంగా కూర్చున్నారు.
కానీ కిటికీ అవతల స్మిత్ కథ వేరు! హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి రాగానే, ఆమె కళ్ళు సావిత్రి కోసం వెతకడం మొదలుపెట్టాయి. ఆ ఘాటు తెచ్చిన కన్నీళ్ల కంటే, ఆ చిన్న ఆవకాయ ముక్క వెనుక సావిత్రి చూపించిన ఆత్మీయత ఆమెకు ఎక్కువగా గుర్తుంది.
మరుసటి రోజు ఉదయం అజయ్ ఆఫీస్ కు బయలుదేరుతుంటే, స్మిత్ తన వాకిలి దగ్గర వేచి చూస్తోంది. "అజయ్! మీ మమ్మీ ఎలా ఉంది? తప్పు నాదే.. అది హల్వా అనుకుని అంత తిన్నాను. సావిత్రితో ఒక్కసారి మాట్లాడాలి" అని ఆరాటంగా అడిగింది. అజయ్ లోపలికి వెళ్లి అమ్మతో అన్నాడు.. "అమ్మ, భయపడకు.. నీ స్నేహితురాలు నీ కోసం ఎదురుచూస్తోంది. వెళ్ళు."
సావిత్రి మెల్లగా స్మిత్ దగ్గరకు వెళ్ళింది. ట్రాన్స్ లేటర్ ఆన్ అయింది.
స్మిత్: (నవ్వుతూ) "సావిత్రి! ఆ ఘాటుకి నా ప్రాణం పోయినంత పని అయింది, కానీ నా జీవితంలో ఇంత 'ఘాటైన' రుచి ఎప్పుడూ చూడలేదు. నీ ఆవకాయ్ నా నోటికే కాదు.. నా మనసుకి కూడా తగిలింది!" ఆ మాటతో సావిత్రిలోని బెంగ అంతా మంచులా కరిగిపోయింది. సావిత్రి స్మిత్ కు పెట్టిన పేరు సీత, స్మిత్ అని పిలవటం సావిత్రి కి కొత్త మాత్రమే కాదు కష్టం కూడా. స్మిత్ కి ఆ కొత్త పేరు చాలా నచ్చింది.
స్మిత్ కు భారతదేశం అంటే ప్రాణం. ఆ దేశపు రంగులు, పండగలు, ముఖ్యంగా అక్కడి 'ఉమ్మడి కుటుంబ వ్యవస్థ' అంటే ఆమెకు ఒక అంతుచిక్కని గౌరవం. సావిత్రి తన పెళ్లి నాటి ముచ్చట్లు, ఆనాటి మర్యాదలు, తన భర్తతో ఉన్న ఆత్మీయ బంధం గురించి చెబుతుంటే.. స్మిత్ కళ్ళలో ఒకరకమైన ఆర్ద్రత. "మా దేశంలో ప్రేమలు త్వరగా పుడతాయి, పెళ్లిళ్లు త్వరగా విడిపోతాయి సావిత్రి.. మీ దేశంలో బంధం అంటే ఒక్క జన్మ కాదు, ఏడు జన్మల ప్రయాణం అని విన్నాను. అది ఎంత గొప్ప విషయం!" అంది స్మిత్ నిట్టూరుస్తూ. తన ఒంటరితనాన్ని, తన వారసుల దూరాన్ని సావిత్రికి వివరిస్తుంటే, ఆ డివైస్ ఆ కన్నీటి భాషను కూడా సరిగ్గా అనువదించింది.
ఇద్దరూ కలిసి వంట చేశారు. స్మిత్ పాస్తా వండటం నేర్పిస్తే, సావిత్రి గులాబ్ జామున్ ఏలా చేయాలో చూపించి ఆశ్చర్యపరిచింది. మాటలు పెరుగుతున్న కొద్దీ ఆ డివైస్ వాడకం తగ్గిపోయింది. ఎందుకంటే, ఒకరి మనసులోని బాధను అర్థం చేసుకోవడానికి అక్షరాల కంటే 'అనుభూతి' ఎక్కువ పనిచేస్తుందని వారికి అర్థమైంది. సాయంత్రం ఆరు గంటలు. అజయ్ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇల్లు నిశ్శబ్దంగా లేదు. పక్కింటి నుండి సావిత్రి నవ్వులు వినిపిస్తున్నాయి. అతను అటువైపు వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి అతను స్తంభించిపోయాడు.
సావిత్రి, స్మిత్ కలిసి పాత ఆల్బమ్ లు చూస్తున్నారు. స్మిత్ తన తో విడిపోయి దూరంగా ఉంటున్న కుటుంబం గురించి వివరిస్తూ కంటతడి పెట్టుకుంటుంటే, సావిత్రి స్మిత్ కు తన చీర కొంగుతో కన్నీళ్లు తుడిచి ధైర్యం చెబుతోంది. ఆ ట్రాన్స్ లేటర్ డివైస్ పక్కన టేబుల్ మీద పడి ఉంది. అది ఆన్ లోనే ఉంది కానీ, ఇప్పుడు వీరికి దాని అవసరం లేదు.
అజయ్ ఆ ఇద్దరిని చూశాడు. ఒకరు తూర్పు, ఒకరు పడమర.. కానీ ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్నది కేవలం 'మమకారం' అనే ఒకే ఒక్క భాష. అజయ్ కి ఒక గొప్ప సత్యం అర్థమైంది. సాంకేతికత బంధాలను దగ్గర చేయగలదు, కానీ ఆ బంధాలను నిలబెట్టేది మాత్రం కేవలం సమయం మరియు మనసు మాత్రమే.
పెదవి దాటని మాటకైనా, అక్షరం తెలియని మౌనానికైనా... మమకారం అనే ఒకే ఒక్క భాష చాలు, రెండు ప్రపంచాలను కలపడానికి!
మరుసటి రోజు సావిత్రి స్మిత్ ఇంటికి వెళ్ళింది. స్మిత్ చేతిలో ఎప్పటిలాగే ఒక మందపాటి పుస్తకం ఉంది. సావిత్రి: (కుతూహలంగా) "ఏమిటి .. ఎప్పుడూ ఆ పుస్తకాలే చదువుతుంటావు?" స్మిత్: (చిరునవ్వుతో) "ఈ పుస్తకాలే నా ప్రపంచం సావిత్రి. నా ఒంటరితనాన్ని ఓదార్చే తోడు ఇవే. నాకు మీ భారతీయ పురాణాల (Mythology) గురించి తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది." సావిత్రి కళ్ళు వెలిగాయి. వెంటనే పరుగున తన ఇంటికి వెళ్లి, ప్రాణంగా తెచ్చుకున్న 'మహాభారతం' గ్రంథాన్ని తీసుకువచ్చింది.
ఆ రోజంతా ఆ అమెరికా విల్లాలో కురుక్షేత్రం మారుమ్రోగింది. ఆ ట్రాన్స్టర్ పరికరం ద్వారా సావిత్రి మహాభారతంలోని ఎమోషన్స్, విలువల గురించి వివరిస్తుంటే స్మిత్ ఒక చిన్న పిల్లాడిలా వినసాగింది. ధర్మం కోసం నిలబడటం, త్యాగం, అనుబంధాల మధ్య జరిగే సంఘర్షణ.. ఇలా ప్రతి అధ్యాయం స్మిత్ ను ఆశ్చర్యపరిచాయి.
*"పాండవుల ఐకమత్యం, కుంతీదేవి సహనం, కృష్ణుడి మార్గదర్శనం.. ఇవి కేవలం కథలు కావు సావిత్రి, జీవిత సత్యాలు! మానవ సంబంధాలలో ఇంతటి లోతైన డ్రామా ఉంటుందని నేను ఊహించలేదు" అంది స్మిత్ ఆనందబాష్పాలతో. ఆ గొప్ప గ్రంథం ద్వారా భారతదేశం పట్ల స్మిత్ కు ఉన్న గౌరవం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. భారతీయ పురాణాల గురించి తెలుసుకోవాలి అన్న ఆశ ఉన్న స్మిత్ కి, గడ గడా మాట్లాడటమే తెలిసిన సావిత్రి కి, ఇక కాలం వెనక్కి నడవసాగింది.*
*మన భారతీయ సంస్కృతి గురించి చర్చించాలంటే రోజులు సరిపోతాయా, నెలలు సరిపోతాయా, సంవత్సరాలు సరిపోతాయా మరీ.*
No comments:
Post a Comment