కవల పిల్లలు
(రచన: ఆర్. కోదండరామయ్య)
పూర్వం కాంచన నగరంలో ధనపాలుడనే వర్తకుడుండేవాడు. ఆయన వర్తకం నిమిత్తమై స్వర్ణద్వీపానికి వెళుతూ తన భార్యనుకూడా వెంటపెట్టుకు వెళ్లాడు. వారక్కడ ఒక సంవత్సరం ఉండవలసి వచ్చింది. ఆ కాలంలో ధనపాలుడి భార్య కవలపిల్లలను ప్రసవించింది. వారిద్దరూ మగపిల్లలు, అచ్చగా ఒకే పోలిక. ధనపాలుడు తన కొడుకులిద్దరికీ 'మాధవుడు' అనే పేరు పెట్టుకున్నాడు; ఒకడు పెద్ద మాధవుడు, రెండోవాడు చిన్నమాధవుడు.
చిత్రమేమిటంటే ధనపాలుడి భార్య కవలపిల్లలను కన్నరోజునే ఆ సమీపంలో ఒక పేదవాడి భార్యకూడా కవలపిల్లలను కన్నది; వారూ మగపిల్లలే, ఒకే పోలిక గలవారే. వారి తండ్రి అయిన పేదవాడు ధనపాలుడితో, "బాబూ, మాకే పొట్ట గడపటం లేదు, ఈ పిల్లలను నేను పెంచలేను. మీ పిల్లలతోబాటు వీళ్లనుకూడా పెంచుకోండి, మీ పిల్లలకు నౌకరీ చేస్తూ బతుకుతారు," అని ప్రార్థించాడు. ధనపాలుడు ఆ పేదవాడికి కొంత డబ్బిచ్చి ఆ కవలపిల్లలను కూడా తానే పెంచాడు. వారికిద్దరికీ 'రాముడు' అనే పేరు పెట్టారు. ఒకడు పెద్దరాముడు, ఇంకొకడు చిన్నరాముడు.
ఈ కవలలు పుట్టిన కొద్ది మాసాలకు ధనపాలుడు వచ్చిన పని అయిపోయింది. ఆయన ఒక నౌకలో తన భార్యనూ, ఇద్దరు మాధవులనూ, ఇద్దరు రాములనూ ఎక్కించుకుని స్వర్ణద్వీపంనుంచి కాంచననగరానికి బయలుదేరాడు. కాని దురదృష్టవశాత్తూ సముద్ర మధ్యంలో తీవ్రమైన తుపాను చెలరేగింది. నౌక దారితప్పి పోయిపోయి ఒక పర్వతమయమైన తీరాన పగిలి ముక్కలయింది.
ఈ ప్రమాదంమూలాన ధనపాలుడూ, పెద్దమాధవుడూ, పెద్దరాముడూ ఒక జట్టుగానూ, ధనపాలుడి భార్యా, చిన్నమాధవుడూ, చిన్నరాముడూ ఒక జట్టుగానూ చీలిపోయారు. సముద్ర తీరాన గల కొందరు పల్లెకార్లు ధనపాలుడి భార్యనూ ఆమె వెంట ఉన్న పిల్లలనూ రక్షించి 'రుద్రపురం' అనే నగరానికి చేర్చారు. ధనపాలుడు ఒక తెప్ప సహాయంతో తన వెంటఉన్న పిల్లలిద్దరినీ కాపాడుకుంటూ మరొకచోట ఒడ్డు చేరుకొని ఎలాగో కాంచన నగరంలో వచ్చిపడ్డాడు.
పద్దెనిమిదేళ్లు గడిచాయి. ఈలోపల రుద్రపురం చేరిన చిన్నమాధవుడు అక్కడి రాజుగారి కొలువులో చేరి, యుద్ధాలలో బలపరాక్రమాలు ప్రదర్శించి మంచి కీర్తి సంపాదించుకున్నాడు. అతను 'మంజరి' అనే ఆమెను పెళ్లాడాడు. అతని నౌకరయిన చిన్నరాముడుకూడా 'గంగ' అనేదాన్ని పెళ్లాడి తన యజమాని ఇంటనే ఉంటున్నాడు. గంగ వంటపనీ, ఇంటిపనీ చూస్తూ మంజరికి సేవ చేస్తున్నది.
ధనపాలుడి వెంటఉన్న పెద్దమాధవుడు తనకొక తమ్ముడున్నాడనీ, చిన్నతనంలోనే సముద్రంమీద తుపాను వచ్చిన ఫలితంగా తనకు దూరమైనాడనీ తెలియగానే, తన నౌకరయిన పెద్దరాముణ్ణి వెంటబెట్టుకుని తమ్ముణ్ణి, తల్లినీ వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్లినవాడు మళ్లీ తిరిగి రాలేదు. అయిదేళ్లు గడిచాయి. ధనపాలుడికి పుత్ర వియోగబాధ పట్టుకున్నది. ఆయన తన వ్యాపారాన్నీ, ఇంటినీ, ఆస్తినీ వదిలేసి తన కొడుకును వెతుకుతూ తానుకూడా దేశాలమీద బయలుదేరాడు.
ఇల్లు వదిలిన రెండేళ్ళకు ధనపాలుడు రుద్రపురం చేరుకున్నాడు. ఆయన ఆ నగరంలో అడుగు పెట్టగానే రాజభటులు ఆయనను ప్రశ్నించి, కాంచన నగరవాసుడని తెలుసుకుని, రాజుగారి వద్దకు పట్టుకు వెళ్ళారు. ఎందుచేతనంటే కొద్దికాలంగా కాంచననగరానికి రుద్రపురానికి మధ్య స్పర్ధలు చెలరేగాయి. రుద్రపురంలో ఉండే కాంచన నగరవాసులందరినీ వెళ్ళగొట్టారు, కొందరిని ఖైదులోకూడా ఉంచారు.
ఈ సంగతులేవీ ధనపాలుడికి తెలియవు. తాను రెండేళ్ళుగా తన పెద్దకుమారుడికోసం వెతుకుతున్నాననీ, వాడు ఏడేళ్ళక్రితం తన తమ్ముడికోసం వెతుకుతూ బయలుదేరాడనీ ఆయన రాజుగారితో చెప్పాడు. "శాసనం ప్రకారం మిమ్మల్ని ఖైదు చెయ్యాలి. అయితే మీరు పెద్దమనిషిగా కనిపిస్తున్నారు గనక ఎక్కడైనా వెయ్యి వరహాలు తెచ్చి ధరావతుగా కట్టండి. అలా చేసినట్టయితే మీకు ఖైదు తప్పుతుంది,” అని రాజుగారు ధనపాలుడి వెంట ఒక భటుణ్ణి ఇచ్చి నగరంలోకి పంపించాడు.
ధనపాలుడు రుద్రపురం చేరిననాడే పెద్ద మాధవుడూ, పెద్దరాముడూ కూడా ఆ నగరం చేరారు. అయితే వాళ్లు తమది కాంచన నగరమని చెప్పుకోలేదు, అలా చెబితే ప్రమాదమని వారికి ముందుగానే తెలిసింది. కాంచననగరం నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషిని రాజభటులు పట్టుకుపోయారని విని పెద్దమాధవుడు చాలా జాలిపడ్డాడు. ఆ పెద్దమనిషి తన తండ్రేనని అతను ఊహించనుకూడా లేదు. అందుచేత అతను తన తండ్రిని కాపాడుకునే యత్నం ఏమీ చేయలేదు.
ఆ వూళ్ళోనే హెూదాతో బతుకుతూన్న చిన్నమాధవుడుకూడా తన తండ్రికి సులువుగా సహాయం చేసి ఉండును. కాని అతనికి తన తండ్రిని గురించిగాని, అన్నగురించిగాని, ఆఖరుకు తల్లిగురించిగాని తెలియనే తెలియదు. ఎందుచేతనంటే అతనినీ, అతని నౌకరయిన రాముణ్ణి, అతని తల్లినీ కాపాడిన పల్లెకార్లు ధనలోభంచేత పిల్లలను వేరుచేసి ఒక సామంతుకు అమ్మేశారు. ఆ సామంతువద్ద పెరిగి పెద్దవాడైన చిన్నమాధవుణ్ణి రాజుగారు ఒకనాడు చూసి ముచ్చటపడి తన సైన్యానికి ఒక నాయకుడుగా నియోగించాడు.
ఆ రోజే నగరానికి చేరుకున్న పెద్ద మాధవుడూ, పెద్దరాముడూ ఒక బస కుదుర్చుకుని, నగరం పర్యటించబోయారు. కొంతసేపు తిరిగాక పెద్దమాధవుడు తన నౌకరు చేతికి కొంత డబ్బిచ్చి, "దీన్ని మన బసలో ఇచ్చి వంట సిద్ధం చేయమని చెప్పు. నేను మరికొన్ని వీధులు చుట్టబెట్టి భోజనం వేళకు చేరుకుంటాను!" అన్నాడు.
పెద్దరాముడు వెళ్ళిన కొద్దిసేపటికే పెద్ద మాధవుడికి వాడు తిరిగి రావటం కనిపించింది. అయితే ఈ వచ్చినవాడు చిన్నరాముడు. సంగతి తెలియక పెద్ద మాధవుడు, "అప్పుడే వచ్చేశావేమిటిరా? నేనిచ్చిన డబ్బేంచేశావు?" అని అడిగాడు. ఇద్దరు రాములూ అచ్చు ఒకేలాగుండటం చేత అతనికి తేడా తెలియరాలేదు.
పెద్దమాధవుడు పడిన పొరపాటే చిన్నరాముడుకూడా పడ్డాడు. వాడు ఆ మాధవుణ్ణి చూసి తన యజమానే అనుకుని, "అమ్మగారు అన్నానికి రమ్మంటున్నారండి. వంటకాలన్నీ చల్లారిపోతున్నాయిట!" అన్నాడు.
"చాల్లే నీ వేళాకోళాలు! దానికి వేళాపాళా ఉండవద్దా? డబ్బేం చేశావు?” అన్నాడు పెద్దమాధవుడు.
"అయ్యొ బాబూ, అమ్మగారు మిమ్మల్ని నిలుచున్నపాళంగా తీసుకురమ్మంటున్నారు,” అన్నాడు చిన్నరాముడు.
"అమ్మగా రెవర్రా?” అన్నాడు పెద్దమాధవుడు అయోమయంగా.
"మీ భార్యాగారేనండీ!" అన్నాడు చిన్నరాముడు.
పెద్దమాధవుడి కింకా పెళ్లి అయినా కాలేదు. అతనికీ మాట విని కోపం వచ్చి, "ముందు డబ్బేమయిందో చెప్పు, వెధవా. వెర్రిమాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను,” అన్నాడు.
"మీరే పరాచకాలాడుతున్నారు నాతో. ముందు భోంచేసి ఆ తరువాత నన్ను తాపీగా తిట్టండి" అన్నాడు చిన్నరాముడు.
పెద్దమాధవుడు వాణ్ణి మెత్తగా తన్నాడు. చిన్నరాముడు ఇంటికి పారిపోయి మంజరితో, "అమ్మా, ఇంటికి రమ్మంటే అయ్యగారు నన్ను చచ్చేటట్టు కొట్టారు,” అని చెప్పాడు.
మంజరి అసలే చాలా అసూయగల మనిషి. తన అనుమానాలతోనూ, అసూయతోనూ తన భర్త అయిన చిన్న మాధవుణ్ణి అస్తమానం రాచి రంపాన పెడుతూండేది. మంజరికి మాలతి అని ఒక చెల్లెలున్నది. తన అక్క తన బావను సూటిపోటి మాటలనకుండా చెయ్యాలని మాలతి ఎన్నో ప్రయత్నాలు చేసేది. తన భర్తను నాలుగు మాటలూ అడిగే ఉద్దేశంతో ఆమె బయలుదేరింది.
ఈలోపల పెద్దమాధవుడు తన బసకు చేరుకుని అక్కడ తన నౌకరూ, డబ్బూ భద్రంగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు. అంతకుపూర్వం తనతో అర్థంలేని సంభాషణ చేసినందుకు రాముణ్ణి మళ్ళీ నాలుగు చివాట్లు పెట్టే ప్రయత్నంలో అతను ఉండగా, మంజరి అక్కడికి వచ్చి అతన్ని చూసి తన భర్తే అని పొరపడింది.
తనకేసి కొత్తగా చూస్తున్న పెద్దమాధవుడితో ఆమె, "ఎవరినో చూసినట్టు చూస్తారేమిటి? నేనప్పుడే అంత దూరమై పోయానా? పెళ్లి అయిన కొత్తలో ఎంత ప్రేమగా ఉండేవారు! ఆ ప్రేమంతా ఏమైపోయింది? నేనేం పాపం చేసుకున్నాను?” అన్నది.
"నాతోనేనా మాట్లాడుతున్నారు?" అని అడిగాడు పెద్దమాధవుడు. తాను ఆమెను ఎన్నడూ చూడలేదని, రుద్రపురానికి తాను వచ్చి రెండు గంటలే అయిందనీ అతను ఆమెతో అన్నాడు. కాని ఆమె అతని మాట ఒక్కటికూడా వినిపించుకోక, "ఈ బొల్లి కబుర్లన్నీ కట్టిపెట్టి నావెంట వచ్చేస్తారా, రారా?" అని గదమాయించి అడిగింది.
చేసేది లేక పెద్దమాధవుడు మంజరివెంట వెళ్లాడు. అక్కడ మంజరీ, మాలతీ అతని వెంట భోజనం చేశారు. మంజరి అతనితో భార్యలాగే మాట్లాడింది. మాలతి అతన్ని "బావా" అని సంబోధించింది. అతనికి తాను మేలుకుని ఉన్నది, కలగంటున్నది కూడా తెలియలేదు. పెద్దమాధవుడి వెంటవచ్చిన పెద్దరాముడికికూడా అలాటి అనుభవమే అయింది. ఎందుచేతనంటే గంగకూడా వాడిపట్ల భార్యలాగే ప్రవర్తించింది. గంగ చాలా గయ్యాళి భార్య.
అందరూ లోపల అన్నాలు తినే సమయంలో మంజరి అసలుభర్త అయిన చిన్నమాధవుడు తన నౌకరయిన చిన్న రాముడితోకూడా ఇంటికి తిరిగివచ్చి వీధి తలుపు తట్టాడు. ఎవరు వారని అడిగితే మాధవుడూ, రాముడూ అని జవాబు వచ్చింది. "వాళ్లిద్దరూ ఇంటో అన్నాలు తింటున్నారు. మీరెవరో గాని వెంటనే దయచెయ్యండి!" అని నౌకర్లు జవాబు చెప్పారు. తన భార్య ఎవరినో తన పంక్తిన పెట్టుకుని అన్నం తింటున్నదని విని మంజరి భర్తఆయిన చిన్న మాధవుడు మండిపడ్డాడు.
భోజనాలు కాగానే ఏదో వంక పెట్టి పెద్దమాధవుడూ, పెద్దరాముడూ బయటపడ్డారు. పెద్దమాధవుడికి మాలతి నచ్చింది గాని మంజరి కర్కశపు సంభాషణ కొంచెం కూడా నచ్చలేదు. పెద్దరాముడికికూడా గంగ గయ్యాళి వేషాలు చూస్తే చాలా అసహ్యం కలిగింది.
వారిద్దరూ కొద్ది దూరం వచ్చారో లేదో ఒక కంసాలి ఎదురుపడి, పెద్దమాధవుణ్ణి చూసి చిన్న మాధవుడనుకుని, "మాధవుడుగారూ, మీకోసమే వస్తున్నాను. మీరు తయారుచెయ్యమన్న గొలుసు ఇదుగో, తీసుకోండి," అంటూ అతని చేతిలో ఒక బంగారుగొలుసు పెట్టాడు.
పెద్ద మాధవుడు నివ్వెరపోయి, "ఏమిటిది? దీన్ని నాకెందుకిస్తున్నారు?” అని అడిగాడు.
కంసాలి నవ్వి, "అప్పుడే మరిచారా? మీరు నన్ను ఈ గొలుసు తయారుచెయ్యమని అడిగితిరిగా? తీసుకోండి, డబ్బు తరవాత ఇద్దురుగాని!" అంటూ అక్కణ్ణించి వెళ్లిపోయాడు.
పెద్దమాధవుడు పెద్దరాముడికేసి తిరిగి, "రామా, మనం ఈ పాపిష్టి ఊళ్లో ఒక్క క్షణంకూడా ఉండవద్దు. వెంటనే బసకు వెళ్లి నా సామానంతా రేవుకు తీసుకుపద. పడవ చేసుకుని వెళ్లిపోదాం!" అన్నాడు.
కంసాలి పెద్దమాధవుడికి నగ ఇచ్చిన కొద్దిసేపటికల్లా బాకీదార్లు వచ్చి అతనిని రాజభటులకు పట్టిఇచ్చారు. రక్షకభటులతో, "నాదగ్గిర నగ తీసుకుని దాని ఖరీదు ఎగవేయాలని చూస్తున్నందుకు ఈ పెద్దమనిషినికూడా నాతోపాటు పట్టుకోండి!" అన్నాడు.
అదే సమయానికి చిన్నమాధవుడు అటుగా వచ్చాడు. అతన్ని చూసి కంసాలి, "సమయానికి దేవుడల్లే వచ్చారు. ఇందాక నేను మీకిచ్చిన బంగారుగొలుసు తాలూకు పైకం ఇప్పిస్తిరా వీళ్ల బాకీ తీర్చి బయటపడతాను!" అన్నాడు.
చిన్నమాధవుడు నిర్ఘాంతపోయి, "నువు నాకు బంగారుగొలుసు ఎక్కడ ఇచ్చావు? శుద్ధ అబద్ధం!" అన్నాడు. ఎన్ని గుర్తులు చెప్పినా చిన్నమాధవుడు గొలుసు తీసుకున్నట్టు ఒప్పుకోకపోవటం చూసి కంసాలి రాజభటులు చిన్నమాధవుణ్ణి కూడా పట్టుకున్నారు. వారు కంసాలినీ, చిన్న మాధవుణ్ణి జైలుకు తీసుకుపోతూండగా పెద్దరాముడు వచ్చాడు.
సామానంతా రేవు చేరిందనీ, పడవ బయలుదేరటానికి సిద్ధంగా ఉందనీ తన యజమానితో చెప్పటానికే వాడు వచ్చాడు. అయితే చిన్నమాధవుడు వాణ్ణి చూసి తన నౌకరే అని భ్రమపడి, "ఒరే నువు మన ఇంటికి వెళ్లి, అమ్మగారి నడిగి అయిదువందల వరహాలూ పట్టుకురా,” అన్నాడు.
పెద్దరాముడు తన భర్తను రాజభటులు పట్టుకున్నారని చెప్పగానే మంజరి అయిదువందల వరహాలూ ఇచ్చేసింది. పెద్దరాముడు ఆ సొమ్ము తీసుకుని వస్తూండగా వాడి అసలు యజమాని అయిన పెద్దమాధవుడు కనిపించాడు. పెద్దమాధవుడికి అంతా కలలాగా ఉన్నది. వీధివెంట పోతుంటే అందరూ అతన్ని పలకరించేవారే. కొందరు తనకు డబ్బు బాకీ ఉన్నామని చెప్పారు. ఒక బట్టలకొట్టువాడు అతనిని పిలిచి, "తమ కోసమే ఈ పట్టుతానులు తెప్పించాను!" అని కొన్ని తానులు చూపించాడుకూడా!
ఇదంతా చూసి పెద్దమాధవుడు ఈ నగరంలో వారందరికీ మతులు పోయాయని నిశ్చయించుకున్నాడు. మిగిలినవాళ్లకు మతి పోవటం అటుంచి తన నౌకరయిన పెద్దరాముడికికూడా పూర్తిగా మతిపోయినట్టు కనిపించింది. ఎందుచేతనంటే వాడు తనను చూడగానే, "రాజభటులు వదిలేశారా, బాబూ? మరి బాకీ ఎలా రద్దయింది? అందుకోసం సొమ్ము తెస్తున్నానే!" అంటూ వరహాల సంచీ చూపించాడు.
పెద్దమాధవుడు ఈ మాటకు జవాబు చెప్పక ఆకాశంకేసి చూసి, "ఈశ్వరా, నాకుకూడా మతి పోకుండా కాపాడు!" అన్నాడు. ఆ మనిషి తన యజమాని కాదని పెద్దరాముడికి తెలియదు. మళ్లీ ఆ దిక్కుమాలిన ఇంటికి తనను యజమాని ఎందుకు పొమ్మంటున్నదీ వాడికి బోధపడలేదు. వాడు పైకి ఏమీ అనక, "యజమానులు ఏం చెయ్యమన్నా చెయ్యాలిసిందే, పాపిష్టి బతుకు!" అని గొణుక్కుంటూ తాము భోజనం చేసిన ఇంటికి బయలుదేరాడు.
తన భర్త ఎంతసేపటికీ తిరిగి రాకపోవటం చూసి మంజరి జైలువద్దకు వెళ్లింది. అక్కడ ఆమె డబ్బు చెల్లించి తన భర్తను విడిపించుకున్నది. చిన్నమాధవుడు ఆమెపై అనేక నిందలు వేశాడు. భోజనంవేళకు తనను లోపలికి రానివ్వలేదన్నాడు, రాజభటులనుంచి బయటపడటానికి డబ్బు వెంటనే పంపలేదన్నాడు. ఈ మాటలన్నీ వింటుంటే మంజరికి తన భర్త పిచ్చివాడయి పోయాడని అనుమానం కలిగింది. తమ నౌకరు రాముడుకూడా తన యజమాని చెప్పిన మాటలన్నీ నిజమన్నాడు. అందుచేత ఆమె వాళ్లిద్దరినీ పెడరెక్కలు విరిచి కట్టి ఇంటికి తీసుకుపోయి, ఇంటి వెనక భాగంలో ఉన్న చీకటికొట్టులో పెట్టించి వైద్యుడికోసం కబురు చేసింది.
మరి కొద్దిసేపటికల్లా నౌకర్లు కొందరు మంజరివద్దకు వచ్చి, "అమ్మా, అయ్యగారూ, రాముడూ తప్పించుకుపోయినట్టుంది. పక్క వీధిలో వాళ్లు ఎవరితోనో మాట్లాడుతున్నారు!” అని చెప్పారు.
ఈమాట వింటూనే మంజరి కొందరు నౌకర్లను సహాయం తీసుకుని పక్కవీధికి వెళ్లింది. అక్కడ పెద్దమాధవుడూ, పెద్దరాముడూ, కంసాలీ మాట్లాడుకుంటున్నారు. పెద్దమాధవుడి మెడలో కంసాలి ఇచ్చిన గొలుసున్నది.
"ఏం, బాబూ? గొలుసు తీసుకుని లేదంటివే! నాసొమ్ము అప్పుడే నాకు పారేస్తే మన కింత తిప్పలుండేవి కావుగా?” అంటున్నాడు కంసాలి.
"నిన్ను నేను గొలుసు అమ్మన్నానా? నీ అంతట నువే ఇచ్చి చక్కాపోయావు. నీతో నేను గొలుసు తీసుకోలేదన్నదెప్పుడూ? ఆ పోయినవాడివి ఇప్పుడేగా మళ్లీ కనిపిస్తున్నావూ?" అంటున్నాడు పెద్ద మాధవుడు కోపంగా.
"ఆయన తప్పించుకుని ఇక్కడికి వచ్చారు! పట్టి పెడరెక్కలు విరిచి ఇంటికి తీసుకు పదండి! ఆ రాముణ్ణి కూడా!" అంటూ మంజరి వారిని సమీపించింది. తమకేదో ప్రమాదం రాబోతుందని పెద్దమాధవుడూ, పెద్దరాముడూ ఆ సమీపంలోనే ఉన్న ఆశ్రమంలోకి పారిపోయారు. ఆ ఆశ్రమం ఒక యోగినిది. బయట కలకలం విని ఆ యోగిని వచ్చింది. తన భర్తకు మతిపోయిందనీ, అతను తననుంచి తప్పించుకుని ఆశ్రమంలోకి వచ్చాడనీ, అతన్ని తనపరం చెయ్యమని మంజరి యోగినితో చెప్పుకున్నది.
"నీ భర్త ఇంకెవరినన్నా ప్రేమించటం చేత మతిపోయిందా? లేక డబ్బు పోగొట్టుకున్నాడా? ఏం జరిగింది?” అని యోగిని మంజరిని అడిగింది.
"ఇంకెవతెనో ప్రేమించటంవల్లనే మతి పోయింది! నేను మొదటినుంచీ అనుమానిస్తూనే ఉన్నాను!" అన్నది మంజరి.
"తెలిసినదానివి భర్తను మందలించుకోలేకపోయావా?" అన్నది యోగిని.
"అయ్యో, మందలించకేం, తల్లీ? ఎప్పుడూ దెప్పుతూనే ఉంటాను. ఇంటో ఉన్నంతసేపూ నేను నోటికి తాళం వేసుకోను. అన్నం తినేటప్పుడుకూడా మందలిస్తూనే ఉంటాను! అంతా బూడిదలో పోసిన పన్నీరయింది," అన్నది మంజరి.
యోగిని ఆమె ఎలాటి భార్యో అర్థం చేసుకున్నది. ఆమె పెద్దమాధవుణ్ణి మంజరి పరం చెయ్య నిరాకరించింది. ఈ ఘర్షణ జరుగుతూండగా రాజభటుడి వెంట ధనపాలుడు అక్కడికి వచ్చాడు. ఆయనకు ఆ నగరంలో ఎరిగినవారూ, డబ్బిచ్చేవారూ కనిపించనే లేదు.
ఆయన ఆశ్రమంవద్దకు వచ్చేసరికి, చీకటికొట్టునుంచి తప్పించుకుని చిన్న మాధవుడూ, అతని నౌకరూకూడా వచ్చారు. చిన్న మాధవుణ్ణి చూడగానే ధనపాలుడు ఆపేక్షగా పలకరించి, "మీ తమ్ముణ్ణి వెతుకుతూ ఇక్కడికి చేరావా, నాయనా? ఈ రాజభటుడు నన్ను పట్టుకున్నాడు, వెయ్యి వరహాలు చెల్లించి నన్ను ముందు వీళ్లబారి నుంచి విడిపించు!" అన్నాడు.
"అయ్యా, తమరెవరో నేనెరగను!" అన్నాడు చిన్నమాధవుడు. అతను ఎన్నడూ తన తండ్రిని చూసి ఉండలేదాయె.
"నేను అంత మారిపోయానుట్రా, మాధవా?” అంటూ ధనపాలుడు గుర్తులు చెబుతున్న సమయంలో ఆశ్రమం లోపలినుంచి పెద్ద మాధవుడూ, పెద్దరాముడూ, యోగినీ అక్కడికి వచ్చారు.
తన భర్తలలాటివాళ్ళు ఇద్దరు ఒక్కసారి కనబడేసరికి మంజరి నివ్వెరపోయింది. ఆ తరవాత జరిగినదానికి కారణాలు సులువుగా బోధపడ్డాయి. యోగిని ధనపాలుడి భార్యేనని బయటపడింది. పసిపిల్లలుగా విడిపోయిన కవలలు ఇంత కాలానికి తిరిగి కలుసుకున్నారు.
పెద్దమాధవుడుకూడా రాజుగారివద్ద కొలువు సంపాదించి మాలతిని వరించి పెళ్ళి చేసుకున్నాడు. వారిద్దరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి మంజరి తన భర్తను సూటిపోటిమాటలనటం మానేసింది. ధనపాలుడు రుద్రపురంలోనే స్థిరపడి తన భార్యతోనూ, పిల్లలతోనూ, వారి నౌకర్లతోనూ సుఖంగా ఉన్నాడు.
No comments:
Post a Comment