చేతి వ్రాత
"ఏవండీ… ఆ గూట్లో ఉన్న డైరీలు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. బయట పడేస్తాను. ప్రతిసారి దులుపుకోవడం కష్టంగా ఉంది," అంది సుధాకర్ భార్య రమ్య ఇల్లు దులిపుతూ.
"నేను వాటిని ప్రతి ఆదివారం చదువుకుంటున్నాను గా! ఎందుకు పడేయడం? నీకు అంత కష్టంగా ఉంటే నేను దుమ్ము దులుపుకుంటాను. నువ్వు అక్కడ వదిలేస్తేయ్," అన్నాడు కోపంగా సుధాకర్.
"ప్రతిసారి ఇదే మాట చెబుతున్నారు. ఒకసారి కూడా దులిపిన పాపాన పోలేదు," అంది రమ్య.
"సరేలే… అలా వదిలేస్తేయ్. తర్వాత చూద్దాం," అన్నాడు చిరాకుగా సుధాకర్. రమ్య ఏమీ అనకుండా విసురుగా వంటింట్లోకి వెళ్లిపోయింది.
ఏమిటో రమ్య అర్థం చేసుకోదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రాణప్రదంగా దాచుకున్న డైరీలను పడేస్తామని అంటుంది… ఏమిటి? దాని విలువ తనకేం తెలుసు! కొన్ని కోట్లు ఖర్చుపెట్టినా తీసుకురాలేము ఆ జ్ఞాపకాలను… అని సుధాకర్ అనుకుంటూ ఒకసారి గతంలోకి వెళ్లిపోయాడు.
రామయ్య–రవణమ్మల ఏకైక పుత్రుడు సుధాకర్. రామయ్య ఒక చిన్న రైతు. రవణమ్మ ఆ రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసై టీచర్‌గా పనిచేసేది. వాళ్లిద్దరి కాపురం పల్లెటూర్లో మూడు గదులున్న పాడుబడిన బంగాళా పెంకుల కొంప.
పుట్టిన సుధాకర్‌ను ఎంతో ప్రేమగా పెంచుతూ, చదువు కోసం కష్టపడుతూనే ఉండేవారు ఆ దంపతులు. ఊరిలో చదువు అయిపోగానే పక్క ఊరి కాలేజీలో హాస్టల్‌లో పెట్టి చదివించారు. చిన్నప్పటి నుంచే సుధాకర్ చాలా తెలివైనవాడు. చదువుతో పాటు ఆటలు, పాటలు అంటే ఇష్టం. ముఖ్యంగా తల్లిదండ్రులంటే ఎంతో అభిమానం.
సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి కన్నీళ్లు వచ్చేవి. "ఎప్పటికైనా అమ్మానాన్నలను కష్టం లేకుండా చూడాలి" అనేది అతని సంకల్పం.
ఆలా కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, భాగ్యనగరంలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. తర్వాత రమ్యను పెళ్లి చేసుకున్నాడు. తన బాధ్యత తీర్చుకున్న రామయ్య–రవణమ్మలు సంతోషపడిపోయారు.
ఎన్నిసార్లు ఇంటిని అమ్మేసి తల్లిదండ్రులను తన దగ్గరకు తీసుకురావాలనుకున్నా వారు సున్నితంగా తిరస్కరించేవారు. సుధాకర్ వారానికి ఒకసారి అయినా వెళ్లి చూసుకొచ్చేవాడు.
కొన్ని రోజులు గడవకముందే రామయ్య హార్ట్‌ఎటాక్‌తో చనిపోవడంతో రవణమ్మ ఒంటరిది అయింది. అయినప్పటికీ పాత ఇల్లు వదిలి రాలేదు. రామయ్య జ్ఞాపకాల్లోనే ఉండిపోయింది. కొంతకాలానికి రవణమ్మ కూడా కాలం చేసింది. వరుసగా వచ్చే ఇలాంటి దెబ్బలతో సుధాకర్ బెంబేలెత్తిపోయాడు.
పల్లె ఇల్లును అమ్మేస్తూ సామాను ఖాళీ చేస్తుంటే ఏ ఒక్కటి పని చేసేలా లేదు. విరిగిన కుర్చీలు, కోళ్లవిరిగిన మంచాలు, చిల్లు పడ్డ గిన్నెలు—అన్నీ పాత సామాన్లు. వాటిని వారిద్దరూ వాడికి ఇచ్చారు.
గదిలో మూలలో ఉన్న పాత ట్రంకు పెట్టి తీస్తుంటే… సంవత్సరాల వారీగా కట్టిన డైరీలు కనబడ్డాయి. "ఇవి ఎవరివి? నాన్నకు డైరీ రాసేంత చదువు లేదు… అయితే అమ్మవే!" అని అనుకున్నాడు.
డైరీ మొదటి పేజీ ఓపెన్ చేశాడు.
అక్షరాలు నల్ల ఇంకుతో గుండ్రంగా, ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. ప్రతి పేజీలో ‘సుధాకర్’ గురించి ఏదో ఒక మాట!
ఆ మొదటి పేజీలో ఇలా ఉంది:
"నా బిడ్డ సుధాకర్ తొలి అడుగులు ముందుపెట్టిన క్షణం నుంచీ, ప్రతి నవ్వు, ప్రతి కన్నీరు—ఈ పేజీల్లో పదిలంగా నిలిపి ఉంచాలని నేను నిశ్చయించుకున్నాను. ఒక తల్లి హృదయంలో దాగిన ప్రేమకే ప్రతిబింబం ఈ డైరీలు."
ఆ మాటలు చదివిన సుధాకర్ చేతుల్లోని డైరీలు వదిలేశాడు. కళ్లూ వర్షమయ్యాయి. ఊపిరి ఆగినట్టైంది.
అవి అమ్మ వ్రాత!
అక్షరాలు… వాసనలు… ప్రతి వాక్యం ఒక జ్ఞాపకం.
ప్రతి డైరీలో అమ్మానాన్నల ప్రేమ, ఆశలు, భయాలు, ఆశీర్వాదాల ముద్రలు. పల్లె పండుగలు, మొదటి స్కూల్ డే, జ్వరంతో ఒరిగిన రాత్రులు—అన్నీ అక్కడే!
ఒక్కో పేజీ తిప్పడం అంటే ఒక్కో యుగాన్ని తిరిగి చూడటమే.
"ఇవి పాత కాగితాలు కావు… ఇవి నా తల్లి గుండె చప్పుడు," అనుకున్నాడు.
"కొన్ని కోట్లు ఖర్చు చేసినా అమ్మ చేతిరాత సంపాదించలేం. వారి జ్ఞాపకం మాత్రమే మనతో ఉంటుంది."
పూర్వకాలంలో ఫోటోలు తక్కువగా ఉండేవి. అప్పుడు తల్లిదండ్రుల చేతి వ్రాత—అదే గొప్ప సంపద. మనసు బాగోలేనప్పుడు ఈ డైరీలు చదివితే మనిషి పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది.
ఆ ట్రంకు పెట్టితో పాటు అమ్మ జ్ఞాపకాల్ని అన్నింటినీ తీసుకొచ్చాడు సుధాకర్. ఇల్లును అమ్మేశాడు.
ఇక అతనికి మిగిలింది—ఈ డైరీలు… తల్లిదండ్రుల పెళ్లినాటి ఒక ఫోటో.
ప్రతి ఆదివారం వీటిని చదువుకునే అలవాటు పెట్టుకున్నాడు. గతమంతా గుర్తొచ్చి కన్నీళ్లు కారుస్తూ కూర్చొని ఉన్నాడు.
ఇంతలో రమ్య అటుగా వచ్చింది.
"నేను ఏదో మామూలుగానే చెప్పాను. ఆ డైరీల విలువ నాకు తెలుసు. తల్లిదండ్రుల జ్ఞాపకాలు పిల్లలకు ఎప్పటికీ అమూల్యమైనవే. ఇవాళ్టి నుంచి వాటిని మన దేవుడి గూట్లో పెడతాను. దేవుడితో పాటు వాటికీ ఒక పువ్వు పెట్టండి," అంది.
అవును—తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. వాళ్లు చనిపోయిన తర్వాత ఉపయోగించినవి దానంగా ఇచ్చినా… ఇలా డైరీలు, ఉత్తరాలు, ఫోటోలు—ఇవే నిజమైన జ్ఞాపకాలు.
ముఖ్యంగా చేతి వ్రాత…
అక్షరాలు చూస్తే మనిషినే చూసినట్టుంటుంది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
No comments:
Post a Comment