Friday, March 27, 2026

 విదురనీతి

మహాభారతంలో ముఖ్యంగా చెప్పుకోతగిన వ్యక్తి విదురుడు. గొప్ప జ్ఞాని. నీతి కోవిదుడు. సామర్థ్యం ఉన్నా పదవుల కోసం ఆశపడలేదు. ధృతరాష్ట్రుడికి సోదరుడిగా, మంత్రిగా తగు సలహాలిస్తూ నీతిమార్గంలో ముందుకెళ్లాడు.

దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకునాలను గమనించి ధృతరాష్ట్రుడితో 'మహారాజా! ఇతడు కులాంతకుడవుతాడు. ఎక్కడైనా వదిలి పెట్టి రండి' అని నిర్మొహమాటంగా చెప్పాడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు విదురుడి మాట వినలేదు. కౌరవులు పెరిగి పెద్దవారయ్యాక మహా క్రూరంగా తయారయ్యారు. భీముడికి విషం పెట్టి చంపేయాలన్న వారి దురాలోచనను ధృతరాష్ట్రుడు వారించలేదు. లక్క ఇంటికి నిప్పంటించాలన్న పన్నాగం విదురుడికి తెలిసింది కాబట్టి పాండవులను ఆ విపత్తు నుంచి తప్పించగలిగాడు. జూదం వద్దని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానించవద్దని బతిమలాడాడు. ధృతరాష్ట్రుడు ఏదీ వినలేదు. యుధిష్టిరుణ్ని రాజును చేసి ద్రౌపదికి క్షమాపణ చెప్పుకొని యుద్ధం జరక్కుండా చూసుకోమన్నాడు. పుత్ర వ్యామోహం, రాజ్యకాంక్ష అడొచ్చి మొహమాటం లేకుండా విదురుడి మాటను తిరస్కరించేశాడు ధృతరాష్ట్రుడు.
ధృతరాష్ట్రుడి మనసెరిగిన విదురుడు 'రాజా! మితిమీరిన స్వార్థం మనిషిని అగాధంలో పడేస్తుంది. ఎరకోసం ఆశపడి మింగే ప్రయత్నం చేసిన చేప ఆ గాలానికి తగులుకొని విలవిల్లాడుతుంది. అయోగ్యుడైన రాజు పాపకృత్యాలతో రాజ్యాన్ని సర్వనాశనం చేయగలడు. ఇది గుర్తుంచుకొంటే నీకే మంచిది' అని చెప్పాడు. ఎప్పటిలాగే ఆ మాటల్నీ పెడచెవిన పెట్టాడు ధృతరాష్ట్రుడు. చివరికి యుద్ధం జరిగింది. నూరుగురు కొడుకులూ మట్టిలో కలిసిపోయారు. ధృతరాష్ట్రుడు ఏకాకిగా మిగిలిపోయాడు. కొన్నాళ్ల తరవాత విదురుడు మళ్లీ సోదరుడి దగ్గరికి వెళ్లాడు. 'అన్నా! ఇంతకాలం నేను చెప్పిన సలహాల్లో ఏదీ నువ్వు పాటించలేదు. ఇది మాత్రం పాటించక తప్పదన్నాడు. 'ఏమిటది? ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగాడు. 'నువ్వు వెంటనే హస్తిన వదిలిపెట్టి అడవులకు వెళ్లిపోవాలి' అని చెప్పగానే ధృతరాష్ట్రుడి గుండె జారిపోయినంత పనైంది. 'అన్నా! కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. నువ్వు చావుకు దగ్గరపడ్డావు. అది కబళించేశాక నిన్నిక తలచేవారెవ్వరూ ఉండరు. నీ కొడుకులందరినీ మట్టుపెట్టిన భీముడి చేతి ముద్ద తింటున్నావు. కనుక నీ అంతట నువ్వే వీటన్నింటినుంచీ బయటపడాలి. మృత్యువు కబళించే సమయంలో ఆశలు, చింతలు వదిలేసి శాంతంగా దేహం వదిలిపెట్టడానికి సిద్ధపడేవాడే ధైర్యవంతుడు. ధర్మం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. సుఖదుఃఖాలే మారుతుంటాయి' అన్నాడు. విదురుడి మాటల్లో నిజం ఇప్పటికి అర్థమైంది. ధృతరాష్ట్రుడికి. గాంధారితో కలిసి అడవులకు వెళ్లిపోయాడు.

లోకంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి. మనిషి రూపాన్ని నాశనం చేసేది ముసలితనం. ప్రాణాన్ని నాశనం చేసేది మరణం. ధర్మాన్ని నాశనం చేసేది ఈర్ష్య. బంధాలను నాశనం చేసేది క్రోధం. అంతఃశత్రువులైన అరిషడ్వర్గాల్ని తరిమికొట్టమని మహాజ్ఞాని విదురుడు చెప్పిందంతా అక్షరసత్యం.
యం.సి.శివశంకరశాస్త్రి

No comments:

Post a Comment