*_నాడీజంఘుని క్షమాగుణం_*
_(మహాభారతం, శాంతిపర్వము లోని కథ)_
🙏🙏🙏🙏🙏🙏🙏
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*పూర్వం ఒకానొక గ్రామములో బ్రాహ్మణాధముడొకడు ఉండేవాడు. అతడు తన స్వధర్మమును వీడి, వేదశాస్త్రాధ్యయనములు మఱచి చివరికి ఒక బోయదానిని వివాహమాడి మాంస భక్షకుడై నిత్యము హింసాజీవితాన్ని గడపసాగినాడు.*
*ఇంద్రియసుఖములే ఉత్తమమనుకొనేవారు విషయవాంఛలతో లోకోపకరమైన ధర్మమును విడనాడి మహాదురితాలను సైతం చేయుటకు వెనుకాడరు కదా!*
*అతడొకమాఱు ధనాపేక్షతో కొందఱు వ్యాపారులతో కలసి వాణిజ్యార్థము దేశాంతరం వెళ్ళాడు. మార్గమధ్యములో ఒక భీకర కాంతారము(అడవి)ను వారు దాటుచున్నప్పుడు... మదపుటేనుగు ఒకటి వారిని తరిమింది. ప్రాణభీతితో వారంతా తలకొకవైపుకు పరుగులెట్టారు.*
*ధర్మభ్రష్టుడైన ఆ బ్రాహ్మణుడూ అలా తన మిత్రులనుండి దూరమై గహనాటవిలో దారిదప్పి, తీవ్రమైన క్షుత్పిపాసలతో(ఆకలిదప్పులతో) సొమ్మసిల్లి ఒక పెద్ద మఱ్ఱిచెట్టు వద్ద కూలబడ్డాడు.*
*ఆ వృక్షము నాడీజంఘుడనే ధర్మవర్తనుడైన బకరాజు నివాసము. నాడీజంఘునికి “రాజధర్ముడు” అనే సార్థక బిరుదు కూడా ఉన్నది. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీజంఘుని మిత్రుడు.*
*ఆకలిదప్పులతో వచ్చిన భ్రష్టవిప్రుని చూసి నాడీజంఘుడు జాలిపడి అతిథిభావముతో అతని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తి పఱచినాడు. తన పెద్ద రెక్కలను విసనకఱ్ఱ వలె వీచి సేదతీర్చాడు.*
*అప్పటికే రాత్రి అవడముతో నాడీజంఘుడు అధముడైన ఆ విప్రునితో ఇలా అన్నాడు... _“మహానుభావా! మీరు నాకు మిత్రులైనారు. మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము. ఇక్కడికి మూడుయోజనాల దూరములో మధువ్రజమనే రాజ్యమున్నది. దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు. అతడు రాక్షసుడైననూ పరమశాంతుడు ధార్మికుడు. అతని వద్దకు మీరు వెళితే తప్పక మిమ్ము సత్కరించగలడు. ఱేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు. ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి.”_*
*అతిథిసేవా నిరతుడైన నాడీజంఘుడు అలా వాక్సుధలను చిలికించి, ఆ బ్రాహ్మణుని వన్యమృగాలనుండి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణనిచ్చాడు. ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువ్రజమునకు బయలుదేరినాడు. నాడీజంఘుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవముగా తీసుకువెళ్ళారు మధువ్రజ రాజసేవకులు.*
*ఒకవ్యక్తి ఆచరించే ధర్మాధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టముగా ప్రతిబింబిస్తాయి.*
*ధర్మాత్ముడు.. పైగా రాజు అవడంతో ఆ బ్రాహణుడు కులభ్రష్టుడు, నీచుడు.. అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు. కానీ, నాడీజంఘుని మిత్రుడు అయినందున అతనిని సగౌరవముగా సత్కరించి.. ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు. మోయలేనన్ని ధనరాసులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీజంఘుని నివాసము చేరాడు ఆ పతిత బ్రాహ్మణుడు. నాడీజంఘుడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యమిచ్చి సేదతీర్చాడు. అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమఱచి నిదుర పోయాడు. తరువాత నాడీజంఘుడూ నిద్రపోయాడు.. అర్థరాత్రి దాటాక, ఆ భ్రష్ట విప్రుడు మేలుకున్నాడు. బలిష్టమైన నాడీజంఘుని దేహాన్ని బ్రాహ్మణుడు చూచి ఇలా అనుకొన్నాడు... _“ఱేపటి నుంచి నేను ఇల్లు చేరేలోపల మళ్ళీ నాకు ఆహారము దొరుకుతుందో లేదో... పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది. దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది. దీన్ని చంపి మాంసము తీసుకు వెళతాను”_ అనుకున్నాడు.*
*దయయే స్వభావముగా కలిగి దయాళువు అయినవాడే అసలైన విప్రుడు. అట్లా కాకుండా నిరంతరము కౄరకర్మములు చేయుట వలన ఆ పతిత బ్రాహ్మణుని బుద్ధి వక్రమైనది. అన్నం పెట్టి ఆదరించి, క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీజంఘునిలో ఆ పతితబ్రాహ్మణునికి భగవంతుడు కనబడలేదు.*
*ఒక రుచికరమైన భోజనం కనబడింది! వెంటనే ఒక దుడ్డుకఱ్ఱ తీసుకొని నాడీజంఘుని తలపై బలంగా కొట్టాడు. ఆ శిరోఘాతానికి అసువులు బాశాడు నాడీజంఘుడు! చర్మం వొలిచి, మాంసాన్ని దోరగా కాల్చి మూటకట్టుకొని ప్రణాయమయ్యాడు ఆ దురితుడు.*
*మనకు ప్రియులైన వారు ఎంత దూరములో ఉన్నా, వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది. తన ప్రియమిత్రునికి ఏదో కీడుసంభవించిందని సందేహించి విరూపాక్షుడు తన సైనికులను విషయము కనుక్కొని రమ్మని పంపించాడు.*
*వారు జరిగిన దారుణము తెలుసుకొని విరూపాక్షునికి నివేదించారు. అతని ఆజ్ఞపై ఆ పతిత విప్రుని బంధించి తెచ్చారు. కృతఘ్నుడు, మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుని చూచి విరూపాక్షుడు... _“భటులారా! కృతఘ్నతకు మించిన మహాపాపములేదు. వీడిని ఖండఖండాలుగా నరికి తినివేయండి. రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము తినవచ్చు”_ అని ఆజ్ఞాపించాడు.*
*_“క్షమించండి మహారాజా! ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసనకూడా మేము చూడలేము”_ అనిచెప్పి భటులు అతడి మాంసాన్ని కుక్కలకు వేశారు. కుక్కలు కూడా ఆ కృతఘ్నుని మాంసమును ముట్టలేదు!*
*నాడీజంఘుని శరీరభాగాలను ఒకచోటచేర్చి దహనసంస్కారాలు, యథావిధి కర్మకాండ చేశాడు విరూపాక్షుడు. విధాత తన ప్రియమిత్రుని మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజంఘుని బ్రతికించమని ఆజ్ఞాపించాడు. గోక్షీరములోని అమృతశక్తి ప్రభావముతో నాడీజంఘుడు పునరుజ్జీవితుడైనాడు. బ్రతికిన మిత్రుని చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకొని జరిగినదంతా వివరించాడు విరూపాక్షుడు.*
*తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మణుడు సంహరించబడ్డాడని తెలుసుకొని బాధపడ్డాడు నాడీజంఘుడు! వెంటనే బ్రహ్మదేవుని పతితబ్రాహ్మణుని బ్రతికించమని ప్రాధేయపడ్డాడు.*
*విరించి(బ్రహ్మ) రాజధర్ముని క్షమాగుణాన్ని చూచి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్టవిప్రుని బ్రతికించినాడు. విరూపాక్షుడిచ్చిన ధనమును మరల అతనికి ఇప్పించి సగౌరవముగా బ్రాహ్మణుని ఇంటికి పంపించాడు నాడీజంఘుడు!*
*ఇది చూసి నాడీజంఘుని మెచ్చుకొని బ్రహ్మదేవుడిలా అన్నాడు.. _“నాడీజంఘుని ఔదార్యముతో ఇప్పుడు బ్రతికిపోయినా ఈ అధమునికి నిష్కృతిలేదు. జన్మజన్మాల వరకూ ఈ మహాపాపము వాడిని క్షోభింపజేస్తుంది. చేసిన కర్మ చెడని పదార్థము. ఫలితమనుభవింపక తప్పదు. ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చిత్తము ఉన్నదేమో కానీ...., కృతఘ్నతకు, మిత్రద్రోహానికి మాత్రం లేదు. మహాత్మా! రాజధర్మా! ప్రియమిత్రా! నాడీజంఘా! నీ క్షమా గుణం అద్వితీయము. దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు. శుభంభూయాత్!”_*
°°°°°°°°°°°
*ప్రియమైన పాఠకులారా! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:*
*1)మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి, పాపభీతి లేనివాడు తనకుతానే కాక సమాజానికి కూడా హానికరము. స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి.*
*2)నాడీజంఘుని (రాజధర్ముని) అతిథిసేవ, మిత్రవాత్సల్యం, క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. మనం ధర్మవర్తనులమైతే... బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము అని నాడీజంఘుడు మనకు చూపినాడు.*
=================
*_{మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి సమర్పిస్తూ...: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
No comments:
Post a Comment