*📖 మన ఇతిహాసాలు 📓*
*కురుక్షేత్ర మహా సంగ్రామం3️⃣*
*శ్రీకృష్ణ రాయబారం*
శాంతి ప్రయత్నాల్లో ప్రధానమైనది, నిర్ణయాత్మకమైనదీ కృష్ణ రాయబారం. సంజయుడు రాయబారిగా వచ్చినపుడు శ్రీకృష్ణుడు తానే స్వయంగా హస్తినాపురానికి వచ్చి శాంతి ప్రయత్నం చేస్తానని అతడికి చెప్పి పంపించాడు. ఆ ప్రకారమే హస్తినాపురం వెళ్ళి, అక్కడ తన ప్రియ భక్తుడు, ధృతరాష్ట్రుని మంత్రీ అయిన విదురుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తన ఆహ్వానాన్ని మన్నించి రాజభవనానికి విందుకు రాలేదని ధుర్యోధనుడు అవమానంగా భావించాడు. ఎలాగైనా సరే శాంతి ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని, శ్రీకృష్ణుని నిర్భంధించాలనీ అతడు పథకం వేశాడు.
కురుసభలో శ్రీకృష్ణుడు చెప్పిన శాంతివచనాలు వేటినీ దుర్యోధనుడు చెవిన పెట్టలేదు. పాండవులు చెప్పమన్నట్లే కనీసం ఐదు ఊళ్ళైనా ఇవ్వమని చెప్పాడు. ఐదు ఊళ్ళు కాదుగదా, సూదిమొన మోపినంత భూమిని కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు తేల్చి చెప్పాడు. పైగా శ్రీకృష్ణుని బంధించమని సైనికులను ఆజ్ఞాపించాడు. అతని అజ్ఞానానికి శ్రీకృష్ణుడు నవ్వుకుని ఆ సైనికులందరికీ కంటిచూపు లేకుండా చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ స్వరూపాన్ని సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాత్రమే చూడగలిగారు. చివరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ధర్మం నిలబెట్టడానికి యుద్ధం అనివార్యమని తెలుపడానికి ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు పయనమయ్యాడు.
*యుద్ధ సన్నాహాలు*
శ్రీకృష్ణుడి దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది. అంతేకాక శ్రీకృష్ణుడే స్వయంగా గొప్ప యోధుడు. కాబట్టి ఆయన సహాయం అర్థించడానికి ఇద్దరూ ద్వారకా నగరానికి వెళ్ళారు. ఇది కృష్ణుని భక్తులకు చాలా ఆసక్తికరమైన ఘట్టం. ముందుగా దుర్యోధనుడు వస్తాడు. అప్పటికి కృష్ణుడు నిద్రపోతూంటాడు. స్వతహాగా గర్విష్టి అయిన ధుర్యోధనుడు కృష్ణుని తల దగ్గర ఉన్న ఆసనంపై కూర్చుని కృష్ణుడు నిద్ర నుంచి లేవడం కోసం ఎదురుచూస్తుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు. నిగర్వి,, కృష్ణుని పట్ల భయభక్తులు కలిగిన అర్జునుడు ఆయన పాదాల చెంత కూర్చుని ఎదురు చూస్తుంటాడు. కృష్ణునికి నిద్ర లేవగానే అర్జునుడు కనిపిస్తాడు. అప్పుడు ముందుగా అర్జునుని పలకరించి విషయమడుగుతాడు. నిరాయుధుడైన తాను ఒక పక్షం, తన సైన్యమంతా మరో పక్షంగా చేసి రెండింటిలో ఏది కావాలో తేల్చుకోమని ముందుగా అర్జునునికి అవకాశమిస్తాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఎక్కడ అశేష సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిన ధుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణే తన పక్షాన రమ్మని కోరడంతో ఊపిరి పీల్చుకుంటాడు. అర్జునుణ్ణి మూర్ఖుడిగా భావిస్తాడు. ఇద్దరూ సంతృప్తిగా తిరిగి వెళతారు. తరువాత శ్రీకృష్ణుని తన రథసారథిగా ఉండమని అర్జునుడు వేడుకుంటాడు. దీనివల్లే శ్రీకృష్ణునికి పార్థసారథి అనే పేరు వచ్చింది.
విరాట రాజ్యంలోని ఉపప్లావ్యములో పాండవులు యుద్ధసన్నాహాలు చేసి అన్ని ప్రాంతాల నుండి 7 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు. కౌరవులు 11 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు.
*పాండవుల పక్షం వహించిన రాజ్యాలు, వంశాలు :* ద్వారక, కాశి, కేకయ, మగధ, మత్స్య, ఛేది, పాండ్య, యదు మొదలుగాగల ప్రాచీన భారతదేశంలోని అనేకరాజ్యాలు పాండవుల పక్షం వహిస్తే,
*కౌరవుల పక్షం వహించిన రాజ్యాలు, వంశాలు :* ప్రాగ్‌జ్యోతిష రాజు, అంగ, కేకయ, సింధుదేశం, మాహిష్మతి, అవంతి, మద్ర, గాంధారము, బహ్లిక, కాంభోజ (యవన, సాక, తుషారులతో కలిపి) మరికొన్ని రాజ్యాలు.
*మిగతా భాగం రేపటి* *📖 మన ఇతిహాసాలు లో....📓*
No comments:
Post a Comment