Friday, May 30, 2025

 *ధైర్యే సాహసే.....* 

*కోరుకున్న విధంగా జీవించే అవకాశం మనిషికి ఎంతైనా ఉంది. అతడు పరిమితులు లేకుండా సాగిపోయేందుకు కారణం- లోపలి శక్తి. దాన్ని వినియోగించాలన్నా, దుర్వినియోగపరచాలన్నా అంతా అతడి చేతుల్లోనే ఉంది.*

*ఈ ప్రకృతిలో అనేక జీవరాశులున్నాయి. మనిషితో పాటు అవీ జీవనం సాగిస్తున్నాయి. జనన మరణాలూ తప్పవు. మనిషి సృష్టిలో భాగమే అయినా- స్వభావంలో మార్పులు తెచ్చుకుంటూ, ఎన్నో జీవరాశుల్ని అధిగమించే అదృష్టం అతడికి సంక్రమించింది.*

*వివేకంతో కోరుకున్న విధంగా పరిణతి సాధించవచ్చు. చిత్రకళలో కుంచె ద్వారా, ఒక్కొక్క రంగుతో మంద ఒక్కో భావం ప్రదర్శిస్తారు. ఒక్కో పదంతో భావాల్ని అల్లుతుంటారు. ఒక్కో ఇటుకను పేర్చి అందమైన భవంతికి ఆకారం కల్పిస్తారు. అలా సాగుతుండాలి జీవితం! అది పారని ఏరులా ఉండిపోకూడదు. అవరోధాల్ని దాటుకుంటూ కొత్త పరిధుల్లోకి ఉత్సాహంతో ప్రవేశిస్తుండాలి.*
*అదే ప్రగతిశీలమైన మార్పు.*

*ఎంపిక చేసుకోవడానికి జీవితంలో రెండు మార్గాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఏది అనుసరించాలన్నది మనిషి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కొత్త మార్గంలోకి ప్రవేశించినప్పుడు, అనంతమైన అవకాశాలుంటాయి. ఒక సంశయమూ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటుంది. అభివృద్ధిని కాంక్షించేవారు సంశయాన్ని పట్టించుకోకుండా ధైర్యంతో సాగిపోతారు. విజయాల్ని సొంతం చేసుకుంటారు.*

*నిశ్చితి, అనిశ్చితి- ఈ రెండింటి మధ్య, మనిషి జీవితం ఒత్తిళ్లకు లోనవుతుంటుంది. భద్రత-అభద్రత, వ్యవస్థ- అవ్యవస్థల మధ్య ఊగిసలాడుతుంటుంది. సృష్టిలో ప్రతి చోటా ఒక క్రమం కనిపిస్తుంది. మనిషి అది తెలుసుకుని వ్యవహరించగలగాలి. స్పష్టత, ధైర్యం, భద్రత, నమ్మకం... వీటిని అతడు సహజంగా ఇష్టపడతాడు. ఈ క్రమం వెనక గందరగోళం నెలకొంటే, మానవుడు అభద్రతా భావానికి గురవుతాడు.*

*తెలియని శక్తి మనిషిలో నిక్షిప్తమై ఉంటుంది. అనంతమైన అవకాశాలు నివురు గప్పిన నిప్పులా ఉంటాయి. తెగింపు లేకపోతే అవకాశం ఎంత గొప్పదో తెలుసుకోవడం ఆతడికి సాధ్యపడదు. ప్రపంచంలో సాహసించనివారు ఎంతగానో నష్టపోయారు. వివేకంతో తెగించినవారు విజయాలు సాధించారు. జీవితమంటేనే అభద్రతతో కూడుకున్నది. అది చీకటి వెలుగుల సమ్మిళితం. ఎత్తుపల్లాలు, కష్ట సుఖాలు... అన్నీ తప్పవు.*

*న్యూటన్, ఐన్స్టీన్ చదువులో వెనకబడి ఉండేవారు. స్టీవెన్ స్పీల్బర్గ్ దివ్యాంగుల తరగతిలో నేర్చుకున్నాడు. థామస్ ఎడిసన్ చదువు విషయంలో చిన్నప్పుడు బడిలో చీవాట్లు తిన్న వ్యక్తే. జోర్డన్ పాఠశాలలో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ జట్టు నుంచి అతణ్ని తొలగించారు. విన్స్టన్ చర్చిల్ ఆరో తరగతిలో పరీక్ష తప్పాడు.*

*గొప్పవారి జీవితాలు చదివినప్పుడు మనిషిలో ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. జీవితానికి ఒక ధ్యేయం అవసరమనే సందేశం అందుతుంది.*

*ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, అన్వేషణలు చోటుచేసుకున్నాయి. ఎందరో దైర్యంతో తెలియని దారిలో ముందుకు వెళ్ళి తెలివితేటల ద్వారా విజయాలు సాధించినవారే. ఇంతకు పూర్వం అలా ఎవరూ చేసి ఉండకపోయినా, ఆలోచించి ఉండకపోయినా-కొత్తగా ప్రయత్నించాలి. సాహసం కనబరచాలి. జీవితంలో మరుక్షణం ఎలా ఉంటుందో చెప్పలేం. మరణం అనేది సత్యం. ఏ మార్గాన్ని ఇష్టంగా ఎంచుకుంటాడో, అందులో మనిషి సరికొత్త ప్రమాణాల్ని నెలకొల్పాలి.*

*సాధారణమైన వ్యక్తికి, అసాధారణమనిపించుకున్న వారికి ఒకటే తేడా- జిజ్ఞాసతో ముందుకు వెళ్ళడం!*

*కలలు కంటూ, వాటిని నిజం చేయాలని తహతహలాడుతూ ప్రయత్నాలు సాగించేవారికి- ఊహించని విధంగా విజయం లభిస్తుంది!*

*┈┉━❀꧁ధైర్యే సాహసే ꧂❀━┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🌼🍁 🙏🕉️🙏 🍁🌼🍁

No comments:

Post a Comment