Thursday, May 29, 2025

 *చిన్నమాటల్తో పరిష్కారం* 

*పదేళ్ళుగా చేస్తున్న వ్యాపారంతో బాగానే లాభాలు గడించిన ఒక ధనికుడికి వ్యాపారంలో అనుకోని సమస్య తలెత్తింది. దాంతో సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇంతలో ఆ ప్రాంతానికి ఓ జెన్ గురువు వచ్చారు. “ఆ గురువును కలిస్తే మీ మానసిక సమస్యకు పరిష్కారం లభిస్తుం"దని కొందరు మిత్రులు సలహా ఇచ్చారు. ధనవంతుడికి పెద్దగా నమ్మకం లేకున్నా, మిత్రులు చెప్పారు కదాని సరేనన్నారు. ఓ రోజున మిత్రులతో కలిసి ధనవంతుడు జెన్ గురువు వద్దకు వెళ్లారు.*

*ధనవంతుడు తన సమస్యలన్నింటినీ ఏకరువుపెట్టాడు. అవన్నీ విన్న గురువు ఒకటి రెండు మాటలు చెప్పారు. అవి విన్న ధనవంతుడు "అయ్యా, నా సమస్యలకు మీరు చెప్పే ఈ ఒకటి రెండు మాటలు ఏ మాత్రం సరిపోవు. మీ మాటలపై నమ్మకం లేదన్నందుకు నన్ను క్షమించండి" అని నిక్కచ్చిగా చెప్పాడు.*

*జెన్ గురువు ధనవంతుడిని చూసి "ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది" అని అడిగారు. “ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది" అన్నాడు ధనవంతుడు. "చీకటి పడింది కదా... మీరిప్పుడు ఎలా వెళ్తారు" అని అడిగారు గురువు. “నేను వెళ్ళేది కారులోనే కదండి... కనుక చీకటి పడితేనేం అది నాకో లెక్క కాద"న్నాడు ధనవంతుడు.*

*"నాకు తెలిసి ఏ వాహనంలోనైనా దీపాలు కొన్ని అడుగుల మేరకే కాంతి చూపుతాయని నాకు తెలుసు మరి ఆ వెలుగుతో ఏడెనిమిది కి.మీ.ల దూరం ఎలా ప్రయాణం చేయగలరు" అని అడిగారు గురువు.*

*"మనం కారు నడపడానికి కాస్తంత దూరం మేరకు వెలుగు చూపితే సరిపోతుంది కదా. వాహనం సాగేకొద్దీ ఆ వెలుగుకి డోకా ఉండదు. ఆ తక్కువ దూరపు వెలుగునే ఆధారంగా చేసుకుని గమ్యం చేరడం పెద్ద సమస్య ఏమీ కాదు కదండీ" అని అన్నాడు ధనవంతుడు.*

*అప్పుడు గురువు “అలాగైతే, నేను చెప్పే ఆలోచనలు, చేసిన సూచనలూ కూడా చిన్న చిన్నవే కావచ్చు. వాటిని తు.చ. పాటిస్తే ఏ సమస్యనైనా ఓ పథకం ప్రకారం అధిగమించవచ్చ”న్నారు.*

*┈┉┅━❀గురుభ్యోనమః❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🪔🍁 🙏🕉️🙏 🍁🪔🍁

No comments:

Post a Comment