Thursday, May 8, 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*

*కురుక్షేత్ర మహా సంగ్రామం4️⃣*


*పాండవ సైన్యం*

శాంతి ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠిరుడు తన సోదరులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరాడు. మొత్తం పాండవ సైన్యాన్ని ఏడు అక్షౌహిణులుగా విభజించాడు. ఒక్కొక్క అక్షౌహిణికి ద్రుపదుడు, విరాటుడు, ద్రుష్ట్యద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించాడు. అందరి సమ్మతితో దృష్ట్యద్యుమ్నుని సర్వసైన్యాధిపతిగా నియమించాడు. అదనంగా కేకయ, పాండ్య, చోళ, కేరళ, మగధ మొదలగు రాజ్యాల సైన్యాలు పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి.

*కౌరవ సైన్యం*

దుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యం వహించమని భీష్ముని అభ్యర్థిస్తాడు. భీష్ముడు తాను కృతనిశ్చయుడనై యుద్ధము చేస్తాననీ, కానీ తాను పాండవులకు హాని చేయటం గానీ తన గురువు పరశురాముని అవమానించిన కర్ణుని తన సైన్యంలోకి తీసుకోవటం జరగదనే షరతులతో ఆమోదిస్తాడు. పాండవులపై అనురాగంతో, భీష్మ-కర్ణ సమేతమై దుర్భేధ్యమైన ‍‍‍కౌరవ సైన్యంతో పాండవులు పోరలేరని భీష్ముడు ఇలా నిర్ణయించాడని ఒక భావన. ధుర్యోధనుడీ షరతులనంగీకరించి భీష్ముని సర్వసైన్యాధిపతిగా అభిషేకిస్తాడు. కౌరవసేన పదకొండు అక్షౌహిణులు. సేనలో ద్రోణుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమరిది జయద్రధుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతోను, కొందరు హస్తినాపురము మీద విశ్వాసంతోనూ కౌరవులకు సహాయ పడతారు.

*మధ్యస్థులు*

విదర్భ రాజు రుక్మి, అతని రాజ్యం, బలరాములు మాత్రమే ఈ యుద్ధంలో మధ్యస్థులుగా ఉన్నారు. 

*సైన్య విభాగాలు , అస్త్ర శస్త్రాలు (ఆయుధాలు)*

పాండవ సైన్యం మొత్తం 7 అక్షౌహిణులయితే కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు. 21,870 రథబలం, 21,870 గజబలం, 65,610 అశ్వబలం, మరియూ 109,350 కాల్బలం (పదాతిదళం) కలిపితే ఒక అక్షౌహిణి అవుతుంది. అక్షౌహిణిలో రథ, గజ, అశ్వ, పదాతి దళాలు 1:1:3:5 నిష్పత్తిలో వుంటాయి. ఈ విదంగా ఇరుసైన్యాలలోని బలాలనన్నీ కలిపితే ముప్పై లక్షల తొంభై నాలుగువేల మంది (3094000) అవుతారు. ఒక్కో అక్షౌహిణికీ ఒక్కో సైన్యాదిపతీ, సైన్యంమొత్తానికి సర్వసైన్యాద్యక్షుడు నాయకత్వం వహిస్తారు. భారతయుద్ధంలో 18 కి విశేష ప్రాధాన్యత ఉంది, సైన్యంలో ఏ విభాగాన్ని కూడినా వచ్చేసంఖ్య 18, ఇరు సైన్యాలను కలిపితే 18 అక్షౌహిణులు అవుతాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయి, యుధ్ధం కూడా 18 రోజులే జరిగింది. ఈ విదముగా 18 సంఖ్య భారతంలో విశిష్టతను సంతరించుకుంది.

కురుక్షేత్రయుద్ధంలో అనేక అయుధాలు వాడారు. భీష్మ, ధ్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు, భీమ, ధుర్యోధనులు గదను, ధర్మరాజు, శల్యుడు శూలాన్నీ వాడారు. ఇవికాక కత్తులు, బాకులు మొదలగు ఆయుధాలను కూడా ఉపయోగించారు.

భారతాన్ని చారిత్రక సత్యంగా గుర్తిస్తే, కురుక్షేత్రయుద్ధాన్ని చరిత్రలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంగా చెప్పవచ్చు. 18 రోజులలోనే ఇరుసైన్యాలలో దాదాపుగా అందరూ మరణిస్తారు. అభిమన్యుని వధకి ప్రతీకారంగా అర్జునుడొక్కడే ఒకే రోజులో ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని హతమార్చాడు. ఈవిదంగా యుద్ధం అసంఖ్యాక విధవలని, అంగవికలురని మిగిల్చి తద్వారా ఆర్థిక మాంధ్యానికి కారణమై కలియుగానికి దారితీసిందని చెప్పవచ్చు.

*మిగతా భాగం రేపటి* *📖 మన ఇతిహాసాలు లో‌‌‌‌....📓*

No comments:

Post a Comment