*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 55-1*
*స్వరసుధామయి ఎస్.జానకి*
*"నీ ఆశ అడియాశ చెయి జారే మణి పూస "* అంటూ తెలుగు చిత్ర రంగంలో గాయినిగా ప్రవేశించిన ఆగొంతు ప్రేక్షకులకి ఎన్నో ఆశలు కల్పించింది. తెలుగు సినిమా రంగానికి మణిపూస లభించింది. ఆమెది స్వర పేటిక కాదు, సర్వ పేటిక, ఆ గొంతులో ఇమడని రాగం లేదు. పలకని పాట లేదు. *'నీలి మేఘాలలో గాలి కెరటాలలో* పాటలోని హాయి, *పగలే వెన్నెల జగమే ఊయల* అని పాడుతుంటే ఆ కంఠం లోని చల్లటి వెన్నెల కాంతి *'నీ లీల పాడెద దేవా'*... అని శాస్త్రీయ రాగాలాపన చేస్తుంటే ఏవో దివ్య లోకాల్లో విహరింప జేయడం, *గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రనా ఎందు వలన?* అని పాడుతుంటే పసిపాప గొంతులోని ముగ్ధత్వం ఎస్. జానకి గాత్రానికే చెల్లింది.
గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో ఆయుర్వేద వైద్యుడు శిష్ట్లా శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు జానకి 1938 ఏప్రిల్ 23న జన్మించింది. నలుగురాడపిల్లల్లో నాలుగవది ఈమె. చిన్నప్పటినుంచీ పాటలంటే, అందునా లతామంగేష్కర్ పాటలంటే మంచి ఇష్టం. రాజమండ్రి లో ఉండగా నాదస్వర విద్వాంసుడు గాడవల్లి పైడిస్వామి దగ్గర గాత్ర సంగీతంలో శిక్షణ పొందారు. శాస్త్రీయ
సంగీతం కొద్దికాలం నేర్చుకున్నా సినిమా పాటల మీదే దృష్టి రాజమండ్రిలో కాలేజీ వార్షికోత్సవాల్లో తెలుగు, హిందీ పాటలు పాడేది. రాయలసీమ కరువు బాధితుల కోసం నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లోనూ, క్రాంతి కళా మండలి వారి నాట్య ప్రదర్శనలకు నేపధ్యగాయని గానూ పాటలు పాడేది. ఫన్ డాక్టర్గా ప్రఖ్యాతి వహించిన వైద్యుల చంద్రశేఖర్ గారి ప్రదర్శనల్లో ఆయన వేషం మార్చుకునే రెండు, మూడు నిమిషాల కాలవ్యవధిలో పాటలు పాడి ప్రేక్షకుల్ని అలరించేది. తర్వాత డా||చంద్రశేఖర్ జానకికి మామగారయ్యారు.
గాయనిగా జానకి ప్రస్థానం ఎ.వి.యమ్ స్టూడియోలో ప్రారంభమైంది. ఆమె అక్కడ మొదట స్టాఫ్ ఆర్టిస్టుగా చేరింది. ఇక్కడ ఒక విషయమేమిటంటే ఆమె ఎ.వి.యమ్ లో చేరినా, టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో *'విధియిన్ విళైయాట్టు* అనే తమిళ చిత్రంలో పాడిన *'పేదై ఎన్ ఆసై పాళేరదేవో*' పాట ఆమె పాడిన మొదటి పాట, ఆ చిత్రంలో ఆమె రెండు విషాద గీతాలు పాడారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు.
*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సశేషం)
No comments:
Post a Comment