Tuesday, May 6, 2025

 శీర్షిక:   "వీర శైవం "

(ఇది నా స్వీయ రచన , ఏ ఇతర రచనకు అనువాదం కానీ, అనుసరణ కానీ కాదు ) 
రచన:భవాని కుమారి బెల్లంకొండ) 

       సంగమేశ్వర రావు వేప చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చుని, తనకు కుడివైపు ఎదురుగా కాక, రెండిళ్ళ అవతల వున్న  భవంతి వైపు చూస్తున్నాడు. క్రింద రెండు వాటాలు, పైన ఒకటే పెద్ద పోర్షన్  వేసిన   ఇల్లు అది.ఆ వీధికి ఎడమవైపు వెళితే పెద్ద పార్క్ వస్తుంది, కుడివైపు వెళితే పెద్ద రోడ్, అది మెయిన్ రోడ్డుకి కలుస్తుంది. 

రాజా రావు రోజూ ఉదయం, సాయంత్రం పార్క్ కి వెళుతుంటాడు. ఒక వారం రోజులుగా ఆయన సంగమేశ్వర రావు ని చూస్తున్నాడు. ఆయన ఉదయం పదింటికి, సాయంత్రం అయిదింటికి అక్కడ కూర్చుని, ఆ భవంతి వైపు , తదేకంగా చూస్తుండటం గమనించాడు. ఆయన ఆ ఇంటి వైపు ఎందుకు చూస్తున్నాడో రాజారావు  కి  అర్ధం కాలేదు, ఆయన తనకు తెలిసిన వాడు కాదు, అసలు పరిచయం వున్న వ్యక్తి కూడా   కాదు ఎందుకు ఆయన  ఉదయం, సాయంత్రం ఒక  గంట  కూర్చుని వెళ్ళి    పోతున్నాడో అర్ధం కాలేదు.

మనిషి చూస్తే నీటుగా వున్నాడు, అరవై ఏళ్ళపైనే  వయసు ఉండవచ్చు. రాజా రావు ఆయన ప్రక్కన కూర్చుని అడిగాడు," "మీరు నాలుగైదు రోజులనుండి ఇక్కడ కనబడుతున్నారు, ఉదయం, సాయంత్రం ఇక్కడ కూర్చుని, ఎవరికోసం ఎదురుచూస్తున్నారు? ఎవరినైనా కలవాలా? కుతూహలంగా అడిగాడు.

"అవునండి ,మా అల్లుడిని కలవా. . ఎదురుగా వున్న బిల్డింగ్     పై    పోర్షన్   మా అల్లుడిదే,  " అన్నాడాయన 

ఎవరు? ! ఉపేందర్  మీ అల్లుడా ?.  "అల్లుడంటే , మీ  మేనల్లుడా ? ఆశ్చర్యంగా అడిగాడాయన.

" కాదండి  , మా    ఇంట ల్లుడే ,   రజని   మా  అమ్మాయే "

మీ కూతురైతే ఇంటికి వెళ్ళొచ్చుగా, "ఆశ్చర్యంగా అడిగాడాయన. 

లేదు లెండి, అల్లుడు వంటరిగా కనిపిస్తాడేమోనని చూస్తున్నాను" అన్నాడాయన నెమ్మదిగా.

మీదీవూరేనా ?అడిగాడు రాజారావు. 

 " ఈ వూరే, ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరిగా, రిటైర్ అయ్యాక సొంత గూటికి చేరుకున్నాము, మా అబ్బాయి శరత్ మాతో కలిసే ఉంటాడు, ఇద్దరమ్మాయిలు చెరొక ప్లాట్ ఇచ్చి, కట్నమిచ్చి పెళ్లి చేసాను. ఇల్లు మాత్రం అబ్బాయికి అని చెప్పాను , మా అమ్మాయికి అదీ కోపం, ఇంటికి వెళితే  ఆ విషయమై గొడవేసుకుంటుంది. పెద్దమ్మాయి నెమ్మది, దీనికే నోరు జాస్తి" అన్నాడాయన. ,

అప్పుడు సాయంత్రం అయిదు అయ్యింది. రజని, ఉపేందర్ కారు  దిగి, ఇద్దరు పిల్లలతో,  పైకి వెళ్లారు
.
" ఇప్పుడు వెళ్ళండి, అల్లుడితో మాట్లాడాలంటున్నారుగా, అంటూ వెళ్ళిపోయాడు రాజారావు.
అస్సలు అరిచయం లేని వ్యక్తికి తన కుటుంబ విషయాలు చెప్పటం ఇష్టం లేక , సంగమేశ్వర రావు నెమ్మదిగా, పైకి వెళ్ళాడు. 
***
గుమ్మం దగ్గిర నించున్న తండ్రిని చూసి మొహం చిట్లించింది రజని. 

"ఏంటి నాన్నా, మళ్ళీ ఏమి రాయబారం మోసుకొచ్చావు?" వ్యంగ్యం గా అడిగింది.
ఉపేందర్ మొహం లో రంగులు మారుతున్నాయి. భార్య అంటే అతనికి చాలా భయం, ఏదైనా భేదాభిప్రాయం వస్తే, చస్తానని బెదిరిస్తూ ఉంటుంది.నిజంగా చస్తుందో లేదో తెలియదు కానీ, చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది ప్రతి చిన్న విషయానికీ. 
సంగమేశ్వర రావు కి వరుసకు అక్క ఉపేందర్ తల్లి. వాళ్లకి ఇద్దరు కూతుళ్ళ   పెళ్ళికి బాగా అప్పులయ్యాయి, ఉన్న మూడుగదుల ఇల్లు అప్పుల క్రింద పోయింది. కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం ఇల్లు అమ్మేశాడని, ఉపేందర్ కి ఏమీ మిగల్చ లేదు   కాబట్టి, వాళ్ళ భాద్యత తమకు లేదని రజని తెగేసి చెప్పింది.

కూతురి కోపం, మొండితనం తెలిసిన మనిషే సంగమేశ్వర రావు. రజని ని ఇష్టపడిన ఉపేందర్ కి పెళ్ళికి ముందు,    నెమ్మదిగానే కూతురి మొండితనం గురించి చెప్పి, బాగా ఆలోచించుకోమని చెప్పాడాయన. 'మీ నాన్న ఇలా అన్నాడని'ఏకంగా రజని తో నే చెప్పాడు ఉపేందర్. అంతే, రజని తండ్రితో  పెద్ద గొడవేసుకుంది. 

" నోట్లో నాలుక లేని వెధవ, వాడి మం చి కోసం నేను చెబితే , నాకే ఎసరు పెట్టాడే వీడు" అనుకుంటూ కూతురి. కోపానికి దాదాపు రెండేళ్లు బలై పోయాడు సంగమేశ్వర రావు. 

ఇప్పుడు ఆయన ధైర్యం చేసి కూతురి దగ్గరకొచ్చింది తన కోసం. కాదు. ఉపేందర్ తల్లీ, తండ్రి కోసం. అసలు అల్లుడిని ఎక్కడైనా ఒంటరిగా కలిసి , అతని తల్లి తండ్రుల దుస్థితి గురించి చెప్పి, నెల, నెలా కొంత డబ్బు ఇవ్వమని చెప్పటానికి వచ్చాడాయన. రజని కి, ఉపేందర్ కి ఒకటే ఆఫీస్ లో వుద్యోగం, సెక్షన్స్ వేరే. భర్త కదలికల మీద, కాంటాక్ట్స్ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది రజని. 

సంగమేశ్వర రావు కి రావటానికి ముందే, ఉపేందర్ తల్లి వాళ్ళ ఇంటికి చాలా సార్లు వచ్చింది. భర్త జోగారావు ర్టీసీలో పెయింటర్ వుద్యోగం చేసాడు. ఇల్లు మూడు గదులది  , ఉపేందర్ కంటే పెద్దవాళ్లయిన ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చలేక,, ఆ చిన్న ఇల్లు అమ్మేసి, విముక్తుడయ్యాడు జోగారావు. 
అప్పట్లో దానికేమంత ధర రాలేదు. ఇపుడు ఆ ఏరియా లో రేట్స్ పెరిగాయి, రిటైర్ అయ్యాక వచ్చిన ఆరు   లక్షలు బ్యాంకు లో వేసి, ఆ వడ్డీతో కాలం గడువుతున్నారు. జరుగుబాటుకు పెద్ద వెట్ గ్రైండర్ కొని , ఇడ్లీ, దోశ పిండి రుబ్బి, కూరగాయమార్కెట్లోసాయంత్రాలు అమ్మి,కొంతసంపాయించుకుంటున్నారు. కానీ వచ్చే పది, పన్నెండు వేలు  ఖర్చులకి సరిపోవటం లేదు. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, ఇతర ఖర్చులకి వచ్చే ఆదాయం ఏ మూలకి సరిపోవటం లేదు. అందుకే ఆవిడ చాలా సార్లు వచ్చి, కోడల్నీ, కొడుకునీ ప్రాధేయ పడేది. ఉపేందర్ ఎటూ మాట్లాడాడు, కూతుళ్ళకు సొంత ఆదాయమేమీ లేదు, తమకు పంపటానికి. అందుకే నెలకి ఒక్క ఐదువేలు ఇవ్వమని ప్రాధేయపడి, ఎన్నోసార్లు భంగ పడింది ఆవిడ.
.
"మీరు మీ కొడుక్కి ఏమి ఆస్తి ఇచ్చారని , నెల, నెలా డబ్బు అడుగుతున్నావు?" అంటూ కఠినంగా జవాబిచ్చి పంపించేసింది రజని.సంగమేశ్వరావుకి ఈ విషయాలన్నీ చెప్పి ఏడ్చేది సుబ్బలక్ష్మి. వాళ్ళపరిస్థితి  ఆయనకు చాలా భాద కలిగించింది. అందుకే ఇవ్వాళ ఆ విషయమై మాట్లాడటానికి రజని దగ్గరకు వచ్చేడు సంగమేశ్వర రావు..

తండ్రి కి కనీసం టీ కూడా ఆఫర్ చేయలేదు రజని.తాత దగ్గరకు వచ్చిన పిల్లలని బయటకు వెళ్లి ఆడుకోమని కసిరి పంపేసింది.  " "వాళ్ళు కొడుక్కి ఏమి ఇచ్చారని, మేము వాళ్లు సచ్చేవరకు పోషించాలి? ఆయన మమ్మల్ని కనీసం ఇల్లు అమ్ముతున్నానని చెప్పాడా? అమ్మాడు, అప్పులు తీర్చుకొని ,రిటైర్ అయ్యాక బ్యాంకు లో వేసుకున్నాడుగా! మేము ఈ ఇల్లు కొనేటప్పుడు ఆ ఆరు  లక్షలు మా కిస్తే రెండు రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పాను, ఇచ్చాడా? మమ్మల్ని నమ్మలేదు, అనుభవవించమను" అన్నది క్రోదంగా. 

" బ్యాంకు వడ్డీ ఎంత వస్తుందో నీకు తెలియదా ఉపేందర్? ఆలోచించు, కనీసం అయిదు వెలివ్వండి, మీ నాన్నకు ఐదువేలు పెన్షన్, ఆర్టీసీలో   పెయింటర్ పనిచేసిన మీ నాన్నకి ఎంత పెన్షన్ వస్తుందో నీకు తెలియదా? నా కంటే వాళ్లిద్దరూ వయసులో పెద్దవాళ్ళు , మీ  ఇద్దరివీ గవర్నమెంట్ ఉద్యోగాలు,  వాళ్ళను దయదల్చు ఉపేందర్" అర్ధింపుగా అన్నాడాయన.

రజని కోపమంతా తండ్రి మీద చూపించింది, " నేను మాట్లాడుతుంటే , ఆయనను డబ్బులు అడుగుతావేంటి? అయినా నువ్వు కూతురిగా నాకేమి న్యాయం చేసావు ? ఇల్లు మొత్తం కొడుక్కి రాసావుగా? అక్కకీ, నాకు వాటా ఇచ్చావా? అరవై వేలు పెన్షన్ వస్తుంది నీకు, ఇల్లు, నీ పెన్షన్ అంతా కొడుక్కిచ్చి, ఏ మొహం పెట్టుకుని , వాళ్లకు డబ్బులివ్వమని రాయబారానికి వచ్చావు?"అన్నది.

సంగమేశ్వర రావు కి కూతుర్ని చూస్తే సిగ్గనిపించింది, ఈమె ఎటువంటి స్త్రీ? వృద్ధులైన అత్త,మామల మీద ఏ మాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తోంది. మనసు మెలితిరిగింది. తమాయించుకుని అన్నాడు, మూడొందల గజాల ప్లాటు నీకు, అక్కకీ సమానంగా ఇచ్చాను.... 

శరత్ కి ఏమీ ఇవ్వవద్దా? నా పెన్షన్ నా ఖర్చులకి సరిపోతుంది, నీ కిచ్చిన స్థలం రేటు పదిరెట్లు పెరిగింది,, నా ఇల్లు నా కష్టార్జితం, కొడుకు మీద నేను ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు, నీకు రెండు సార్లు డెలివరీ కి ఖర్చులు, చేయాల్సినవన్నీ చేసాను, అక్కకీ అంతే,  నా కొడుకు నా ఇంట్లో ఉంటున్నాడు, నేను వాడింట్లో ఉండటం లేదు, ఆ సృహ నా కొడుక్కీ, కోడలికి వుంది, నీకే మానవత్వం లేకుండా పోయింది"  అన్నాడు తీవ్రంగా.

" నువ్వొచ్చి అడిగావని ఇచ్చేస్తామని అనుకున్నావా, నీకు అంత ప్రేమవుంటే నీ పెన్షన్ లో ఇచ్చుకో" అన్నది దురుసుగా.రజని.
 
సంగమేశ్వర రావు నవ్వి, "సరే, మీతో నెల, నెలా డబ్బు ఎలా ఇపించాలో నాకు తెలుసు " అన్నాడు వెళ్లిపోవటానికి లేస్తూ.

రజని కి కోయంతో ఒళ్ళు తెలియ లేదు, " నువ్వు ఏమి చేసినా చిల్లి గవ్వ కూడా ఇవ్వము, ఏ పెద్దమనుషులు నన్నేమీ ఒప్పించలేరు   , అలాంటి వెధవ ప్రయత్నాలు చేస్తే, ఇప్పటితో నీకు, మాకు సరి" అన్నది.
******
పదిహేను రోజుల తర్వాతా ఉపేందర్ కి ఫామిలీ కోర్ట్ కు హాజరవమని నోటీసు వచ్చింది.  దీని వెనుక తండ్రి ప్రోద్బలముందని రజని ఆవేశపడి, తండ్రి ని ఇంటికి వెళ్లి మరీ తిట్టింది.  బెదర లేదు సంగమేశ్వర రావు. రజని, ఉపేందర్ లాయర్ని కలిశారు.

కేసు (MWPSC Act, 2007 ) క్రింద నమోదయ్యింది. అంటే సీనియర్ సిటిజన్స్ ఐన తల్లి తండ్రుల సంరక్షణ , మరియు ఆరోగ్యపరమైన, ఆర్ధిక పరమైన ఇబ్బందులను సంబంధిత  కొడుకుల  బాధ్యతని తెలియచెప్పే చట్టమది. 

సెక్షన్ 125 (d )సీసీపీ అంటే (Code of Criminal Procedure)1973  భారతీయ చట్ట ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ ప్రతినెలా సరైన ఆదాయం లేని తల్లితండ్రులకి, నిర్దేశించిన అమౌంట్ ఇవ్వాలని ఆర్డర్ చేసే అధికారం ఉందనీ, కోర్ట్ ఆదేశాల్ని ధిక్కరిస్తే మూడునెలల జైలు శిక్ష ఉంటుందని, ఉపేందర్  ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, ఉద్యోగానికి ముంపు ఉండొచ్చని వివరించాడు లాయర్. 

కోర్ట్ కి 'కళ్ళు వుండవు' అన్నది నిజం కాదు. నిస్పా క్షికంగా   తీర్పు ఇవ్వడానికి నిర్దేశించబడిన విధానమది. జడ్జి గారు     
ఉపేందర్ తల్లితండ్రుల్ని అరిశీలనగా చూశారు. వాళ్ళు బలహీనంగా, ఉండటం గమనించారు. జడ్జిగారు. ఎవరి ఆదాయ వనరులులు ఎంతో పరిశీలించి, 1923  లో సుప్రీమ్ కోర్ట్ ఒక ఢిల్లీ కి చెందిన తండ్రీ ,కొడుకుల కేసు లో, 72  ఏళ్ళ తండ్రికి నెలకు పదివేలు ఇవ్వటానికి నిరాకరించి, జిల్లా కోర్ట్, తర్వాత హై కోర్ట్, ఆఖరికి సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రయించిన కొడుకుని తీవ్రంగా మందలించి, నెలకు పదివేలు తండ్రికి చెల్లించాలని, 2015  నుండి    ఇవ్వాల్సిన అరియర్స్ ని లెక్కగట్టి చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది.  ఆ తీర్పుని ఉటంకిస్తూ జడ్జిగారు ఉపేందర్ ని తీవ్రంగా మందలించి, అతన్ని కూడా నెలకు పదివేలు ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చారు.

బయటకు వచ్చాక , హై కోర్ట్ కి వెళదామన్న భార్యతో,  జీవితం లో మొట్టమొదటిసారి తీవ్రంగా స్పందిచాడతను.' చాల్లే ఊరుకో, వాళ్ళు ఐదువేలు ఇవ్వమని మా అమ్మ బ్రతిమిలాడినప్పుడు నువ్వు పడనీయలేదు, ఇప్ప్పుడు సచ్చినట్టు నెలకు పదివేలు ఇవ్వాల్సిందే. నోరు మూసుకుని ఇంటికి పద" అన్నాడు.
 
రక్త బంధం తెంచేసుకుంటానని కూతురు అరిచినప్పుడు సంగమేశ్వర రావు  నవ్వుకున్నాడు, నైతిక విలువులు లేని బంధం వున్నా ఒకటే,లేకపోయినా ఒకటే , ధర్మం పాటించని వాళ్ళు,ధర్మ పరిరక్షణకోసం జరిపే   శివతాండవాన్ని భరించాలిసిందే'
అనుకుని నవ్వుకున్నాడు.

No comments:

Post a Comment