Friday, May 2, 2025

 *ఆత్మ.....*

ఆత్మ అంటే ఏమిటి...? అనే ప్రశ్నకు 3.. శరీరాలకు వ్యతిరేకమైనదని, 5 కోశాలకు అతీతమైనదని, 3 అవస్థలకు సాక్షి అనీ తెలియజేశారు. ఇవన్నీ ఆత్మకన్న వేరైనవని.. ఆత్మకాదని కూడా తెలుసుకున్నాం. అయితే "*మరి ఆత్మ అంటే ఏమిటి..?"*

అవి కాదు సరే. మరి ఏది ఆత్మ..? అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ చెబుతున్నారు...

ఆత్మ సచ్చిదానంద స్వరూపమని.. సత్ అంటే ౩ కాలాలలో ఉండేదని, చిత్ అంటే పరమజ్ఞాన స్వరూపమని, ఆనందం అంటే శాశ్వత సుఖ స్వరూపమని, ఇలా సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను తానుగా తెలుసుకోవాలి.. అంటున్నారు...

౧) సత్...

ఆత్మ 3 కాలాలలో ఉండేది. ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోవటం అనేది లేదు. అసలు ఆత్మకు ఆది అంతం లేవు. పుట్టుక చావు లేవు. అది నిత్యం, సత్యం. అయితే దేహాదులు నశించేవి. 

౨) చిత్...

ఆత్మ పరమజ్ఞాన స్వరూపం. సాధారణంగా మనకు ఒక రకమైన జ్ఞానం ఉన్నదంటే చాలా రకాల జ్ఞానాలు లేవు అని అర్థం. ఒక డాక్టరుకు వైద్యం చేయటం వచ్చు. కాని కోర్టులో వాదించలేడు, తన చొక్కా తాను కుట్టుకోలేడు; అలాగే లాయరు వైద్యం చెయ్యలేడు; కుండలు తయారుచెయ్యలేడు. ఇలా ఒక జ్ఞానం ఉంటే మరికొన్ని జ్ఞానాలు లేనట్లే. ఇది ప్రాపంచిక జ్ఞానలక్షణం. అన్ని జ్ఞానాలను అందరికీ ఇచ్చి తాను అవధులు లేని జ్ఞానస్వరూపం ఆత్మ. ఆత్మకు ఈ జ్ఞానం ఉన్నది, ఇదిలేదు అనటానికి వీలులేదు. కనుక పరమజ్ఞాన స్వరూపం.. చిత్.

౩) ఆనందం...

ఆత్మ ఆనందస్వరూపం. ప్రపంచంలో ఉన్న వస్తువుల ద్వారా, విషయాల ద్వారా, భోగాల ద్వారా వచ్చే ఆనందం విషయానందం అంటారు. ఇది శాశ్వతమైనది కాదు. తాత్కాలిక ఆనందమే. ఎందుకంటే వస్తువులు తాత్కాలికం కనుక వాటి ద్వారా వచ్చే ఆనందం కూడా తాత్కాలికమే. కాని ఆత్మ పరమానంద స్వరూపం. ఆత్మ ద్వారా - ఆత్మతో ఐక్యమై ఆత్మగా ఉండటం ద్వారా వచ్చే ఆనందం శాశ్వతం. ఎందుకంటే ఆత్మ నిత్యం. దానివల్ల వచ్చే ఆనందం నిత్యానందం...

 ఓం నమః శివాయ

No comments:

Post a Comment