Sunday, May 4, 2025

 ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇంత అద్భుతమైన, సంస్కారవంతమైన పోస్టు చూడలేదు నేను.. ఇది వ్రాసినవారు ఆర్టిస్ట్ అన్వర్ గారు.. కోతకోసినట్టుండే ఆయన గీతలకు ఎంత అభిమానినో, ఆయన రాతలకీమధ్య ఇంకా పెద్ద అభిమానినయ్యాను.. మీరు వీలు చేసుకుని మరీ ఆయన ప్రొఫైల్లోకి వెళ్ళి చదవండి.. అన్ని పోస్టుల్లో అక్షరాలు, నవ్వుతోన్న తడికన్నులతో స్వాగతిస్తాయి.. 
ఇది కాపీ చేసి ఇంకో పోస్టుగా ఎందుకు పెడుతున్నానంటే, షేర్ చేస్తే మీలో ఎక్కువమంది చదవరని తెల్సు కాబట్టి..
ఇక అన్వర్ గారి పోస్ట్ చదవండి..
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

రైలుబండి ఒక స్టేషన్ లో ఆగింది తల్లిఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్న  చిన్నపిల్లాడిని లేపుతూ, ఇతర కుటుంబసభ్యులని కూడా హెచ్చరించేవాడట  ఆ ఇంటిపెద్ద. "అరేయ్ బాబు, అమ్మా పాపా లేవండి, లేచి బయటికి చూడండి. ఊరు వచ్చింది ఊరికి సలాం చేయండి. దణ్ణం పెట్టుకోండి" అని.   రైలు ఆగిన ఆ  చిన్న స్టేషను పేరు ఖట్ ఖట్ కలాన్ . ఆ చిన్న పిల్లవాడి ఊరు రాహోన్- పంజాబు లోనిది. ఈ కుటుంబం ప్రయాణం చేసినప్పుడల్లా ఖట్ ఖట్ కలాన్ రాగానే తండ్రిగారి హెచ్చరికతో అందరూ ఆ  ఊరివైపు, ఆ స్టేషన్ వైపు  చూసి సలాం చెయ్యడం పరిపాటి. పిల్లవాడు కొంచెం పెద్దవాడయ్యాడు. ప్రశ్నలు పుట్టేంత బుర్ర, వాటిని అడిగేంత నాలుక మొలిచింది. "ఎందుకని నాన్న మనం ఈ  ఊరికి సలాం చెయ్యాలి?"  "ఎందుకంటే నాయనా ఇది  షహీద్ భగత్ సింగ్ గారు పుట్టిన ఊరు, ఆయన దేశం కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కారు. దేశం కోసం ఒక మనిషి ఏం చెయ్యాలో, ఏమి చెయ్యగలడో   చూపించిన మనిషిని కన్న ఊరు ఇది. ఆయన ఇప్పుడు లేరు, మీరెవరూ ఆయనని చూడలేదు, చూడలేరు.  కానీ ఆయన పుట్టిన ఊరు మాత్రం ఉంటుంది. ఆయనే కాదు చాలా చాలా గొప్ప వాళ్ళు, మన ఊహకి కూడా అందని వారు పుట్టిన ఊళ్ళు, ప్రాంతాలు ఉంటాయి. వాటిని తప్పక  నమస్కరించుకోవాలి మనం" అంటూ  ఆ ప్రయాణంలో స్వాతంత్ర సమరయోధుల కథలు చెప్పేవాడు నాయన గారు.  

ఆ చిన్నపిల్లవాడు పెద్దవాడయ్యి భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు అయ్యారు. ఆయన గొప్ప, అతి గొప్ప, మహా గర్వించదగిన అనేవంటి మాటలు చెప్పుకోదగిన మనిషి  ఏమీ అవకపోయి ఉండినప్పటికి, ఆయన  మనకు ఎప్పటికీ  తెలియకపోయినప్పటికి కూడా  గొప్ప సంస్కారిగా, ఒక అచ్చమైన మనిషిగా అయి ఉండేవారు. ఆ పిల్లవాడి పేరు మహమ్మద్ జహూర్ ఖయ్యాం హష్మి. చిన్న ముక్కలో చెప్పాలంటే  "ఖయ్యాం."

ఎంతో కాలంగా నాకు ఖయ్యాం గురించి రాసుకోవాలని కోరిక. ఆయన సంగీతం గురించి కాదు. వారి సంస్కారం గురించి.  రామ్ రామ్, సలామ్ అలైకుమ్, నమస్కారం, వందనాలు ఇవన్నీ చిన్నమాటలు కాదు, హిమాలయాల కన్నా ఎత్తయిన  అహపు కొండలు. వాటిని దాటి  సలాం అనడానికి చాలా మందికి నోరు పలకదు , చేతులు ముకిళితం అవ్వవు. నాకు ఖయ్యాం అంటే తెలీని ఒక ఇరవైల ప్రాయంలో  బాగ్ లింగంపల్లి వైపు వెళ్ళవలసి వచ్చినపుడు ఆదిగో ఆ సందులో , ఆ పొడగాటిచెట్ల పచ్చనరంగు వెనుక చిత్రకారులు చంద్ర గారి ఇల్లు ఉందని తెలుసు. అప్పుడు ఆయనతో నాకు పరిచయం లేదు, ఆ సమయంలో నాకు  ఖయ్యాంగారి నాయనగారి పాఠం కూడా తెలియదు. బస్సు కిటికీలోనుండి ఆ చెట్లవెనుకకి చాలా ఇష్టంగా, గౌరవంగా చూసేవాడ్ని, దండం పెట్టుకోవాలని తెలీదు.  చాలా ఏళ్ళ క్రితం నేను హైదరాబాదు పుస్తక ప్రదర్శనలకు వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో నాదగ్గర పుస్తకాలు కొనేంత డబ్బులు ఉండేవి కావు, అయినా ఆ ప్రదర్శనలకు  చిన్న నాకొడుకును వెంట తీసుకుని తప్పక వెళ్ళేవాడిని.  అక్కడ నాకు చాలా గొప్పవాళ్ళు కనిపించేవారు. నేను వారికి తెలియదు. నాకు వారి రచనలు, వారి వ్యక్తిత్వాలు తెలుసు.  నేను మా అబ్బాయి చేయి పట్టుకుని గబగబా వారివద్దకు  పరిగెత్తుకువెళ్ళి మా పిల్లవాడితో వారి కాళ్ళకు దండం పెట్టించేవాడిని. మళ్ళీ మళ్ళీ అదృష్టాలు రెండు కాళ్ల రూపం ధరించి మన ముందు కదలాడవు. ఏదో ఒక రోజు నడక ఆగిపోతుంది కదా. 

ఖయ్యాం తండ్రివంటి ఒక తల్లి నాకుతెలుసు. చిత్రకారులు శ్రీ బాపుగారిని ఒకసారి లండన్ ఫిలిం ఫెస్టివల్ కి  అహ్వానించారుట. విమానం ఎక్కబోతూ ఆయన వారి అమ్మ సూర్యకాంతమ్మ గారి కాళ్లకు దండం పెట్టుకోబోతే ఆవిడ ఇక్కడ కాదు నాన్న, ముందు ఇక్కడ  అని  ముళ్ళపూడి రమణ గారి  శ్రీ పాదాలు చూపించారుట. సంస్కారం అంటే   సాఫల్యం అంటే  అవేవో  వేరే వెర్రి  ప్రపంచపు మాటలు ఇప్పుడు. ఖయ్యాం గారి తండ్రి గారి పాఠం విన్న తరువాత ఈ మధ్య  నేను విద్యానగర్ వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఆ మధ్యలో ఒక సందు కనపడింది. బండి అక్కడ ఆపి ఆ వీధికి నమస్కారం చేసుకున్నాను. ఆ వీధిలో తరుచుగా పతంజలిగారిని చూసేవాడిని నేను. చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఏదో ఒక ఊరికి  వెడుతున్నా.  నిద్రలో ఉన్నా, మెలకువ వచ్చింది. లేచి బయటికి తొంగి చూస్తే  ఊరిపేరు కశీంకోట . అబ్బా! ఇదేనా అని ఆశ్చర్యానందాలతో చూస్తూ ఉండిపోయాను కానీ కిటికిలోంచి ఒక రెండు చేతుల దండం పెట్టుకోవాలనంత సంస్కారం చాలలేదు అప్పటి నా బుద్దికి.  ఇప్పుడు ప్రతి రాత్రి కలలోనయినా ఒక బస్సు ఎక్కాలనుకుంటాను, ఆ బస్సు కశీంకోట లో నన్ను ఆపితే ఒక నమస్కారం చేసుకోవాలని నా కోరిక. కశీంకోట శ్రీమాన్ వడ్డాది పాపయ్య గారి ఊరు. ఇపుడు నన్ను వడ్డాది పాపయ్య అంటే ఎవరు అని  అడగొద్దు ప్లీజ్. తెలుగు వాళ్ళ మీద చిన్నచూపు ఎక్కువవుతుంది.

ఒక ఊరికి, ఒక వాడకు, ఒక రహదారికి  దండం పెట్టుకోవడం చాలా పెద్ద పెద్ద మాటలు. కనీసం  మనిషి మనిషికి  నమస్కారం కూడా కాదు , దేవుడికి నమస్కారం చేయాలన్నా మహా అపచారం ఇప్పుడు.  తెలుసా వాడు సాహిత్యం చదువుతాట్ట,  రాస్తాట్ట. అయినా సూడో ముండాకొడుకు దేవుడికి దండం పెట్టుకుంటాడు, నమాజు చేస్తాడు,  పైగా బొట్టు కూడా పెట్టుకుంటాడు , హవ్వ!   ఉదయమే ఉదయిస్తున్న సూర్య భగవానుడిని చూసి సంతోషంగా  ఆదిత్య హృదయం, పుణ్యం అని గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలంటే ఎవరు చూసి , ఏ కార్డ్ మనకి తగిలిస్తారో అని జడుపు. అలాని మరీ అర్థరాత్రి లేచి బయటికి వెళ్ళి  జయావహం జపేన్నిత్యం అక్ష్యయం పరమం శివం అని  సూర్యుడికి గుడ్ నైట్  చెప్పుకోలేముగా.

ఒకసారి రచయిత తల్లావజ్ఝల లలితాప్రసాద్ గారికి  ఫోన్చేసాను. వారి అమ్మాయి చాలా  చిన్న పిల్ల అప్పుడు.  తియ్యని పీలగొంతు వేసుకుని "నమస్కారమండి, నాన్నగారు బయటికి వెళ్ళారండి, మీరెవరో చెబితే ఆయన రాగానే మీరు ఫోన్ చేసారని  చెబుతానండి" ఒక చిన్న పిల్లని అంత మర్యాదగా వినడం అదే మొదటి సారి నాకు. నా హృదయం నిండిపోయింది. అప్పుడక్కడ ఖయ్యామ్ గారి తండ్రి గారున్న కాలం ఒకటుంటే. ఇప్పుడిక్కడ లలితా ప్రసాద్ గారి కూతురున్న కాలం కూడా ఒకటున్నది. నేర్చుకోవాలని ఒకటి ఉండటం అనేది అతి ముఖ్యం, నేర్చుకోవచ్చని తెలిసి ఉండటం కూడా అంతే  ముఖ్యం. మా అబ్బాయికి లలితాప్రసాద్ గారెవరో తెలియదు, వారి అమ్మాయి విజయలక్ష్మి  అసలు తెలీదు. మీరెప్పుడయినా వాడికి ఫోన్ చేసి మాట్లాడండి, వాడు తనకు తెలియని ఒక టీచరమ్మ  విజయలక్ష్మి దగ్గర వాడి నాన్న నేర్పించిన సంస్కారంతో మిమ్మల్ని పలకరిస్తాడు. ఆ మధ్య మనకున్న గొప్ప రచయిత్రుల్లో ఒకరు కె. వరలక్ష్మి గారిని కలవడానికి వెళ్లాము మేమిద్దరమూ తండ్రి కొడుకులము. ఆవిడ మోహన్ ని చూసి ఎంత ముచ్చట పడిపోయిందో ! చాలామంది పిల్లలని, వారి చదువుతో, వారి సంపాదనతో కొలవచూస్తారు. వారు సమాజంతో ఎట్లా ఉన్నారు, తెలిసినా, తెలీని మనిషిని కూడ ఎట్లా గౌరవిస్తున్నారు  , ఒక చిన్న తరగతి మనుషుల పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది, ఒక ఆడపిల్లరూపం పట్ల వాళ్ళ చూపులు ఏమంటున్నాయి అనేవి అక్కరలేని విషయాలు. మా పిల్లవాడికి గొప్ప చదువు, మేధావి తెలివితేటలు, ఒక హోదా, మంచిరూప విశేషాలు ఏమీలేవు. కాని వాడిని చూసి  నేను గర్వపడ్డానికి అవేమి నాకు ముఖ్య కారణాలు కావు.   

నా వంటి తరం  తల్లిదండ్రుల కన్నా నా తండ్రి తరం  వాళ్ళది, వారి తండ్రి తరం వాళ్ళది గొప్ప సంస్కారం అనిపిస్తుంది నాకు.  తెలిసి ఉన్న మనిషిని ఎట్లాగూ ఒక నమస్కారంతోనో, సలాం తోనో పలకరించడం మామూలే  కానీ, ఇంటికి వచ్చిన వారు మనకు తెలియకపోయినా ముందుగా ఒక సలాం చెప్పి, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళూ ఇచ్చిన పిదప పొడి తువ్వాలుతో అక్కడ నిలబెట్టేవారు మా ఇంటి పెద్దలు మాకు.  ఇప్పుడు మనం ఎవరి ఇంటికి అయినా వెళ్ళాం అనుకోండి , పోనీ మన ఇంటికే ఎవరైనా వచ్చారు అనుకోండి .  పెద్దలు ఎవరైనా వచ్చినవారిని  పరిచయం చేయ చూస్తే  పిల్లలు తలెగరేస్తారు. ఏమిరా మీ ఇంట్లో మీకు పని పాటేం లేదా? మా ఇంటికి తగలడ్డారు అని వారు అంటున్నట్లు  మనకు తెలిసి పోతుంది . అప్పుడే సెల్లు మోగుతుంది "మౌనమే నీ భాష ఓ మూగ మనసా " అనే రింగ్  టోన్ తో. ఏడవలేక నవ్వుతూ అక్కడే కూర్చుంటాము కాసేపు.  అనకూడదు కానీ చాలా మటుకు సంస్కారలేమి అనేది చాలా పెద్ద, గొప్ప, ప్రముఖ వాళ్ల పిల్లల రూపాల్లో  పుట్టి పరిఢవిల్లుతుంది. పుస్తకాలు రాసేసి అచ్చుకు ఇచ్చేసి ఉపన్యాసాలు దంచేసి  ప్రెస్ క్లబ్బుకు వెళ్ళి అక్కడ నిద్రపోకుండా అప్పుడప్పుడూ తాను వ్రాసిన నీతి  కథలు తమ  ఇంట్లో పిల్లలతో కూడా చదివిస్తే మంచిది అనిపిస్తుంది. లేకపోతే  ప్రయాణాల్లో ఎప్పుడయినా వారి ఊరిమీదుగా బస్సో, రైలో పోతూ ఉంటే  కిటికీ వేసి, ముక్కుకు రుమాలు కట్టుకోవాలి . అప్పుడు పక్క సీటువాడు అడుగుతాడు "ఏమిటి విషయం?" అని. దానికి  ఫలానా నాయకుడు, ఫలానా రచయిత, ఫలానా ప్రముఖుడు  ఈ ఊరివాడే అండి అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఊరు తలదించుకుంటుంది.

....... అన్వర్ ✍️
https://www.facebook.com/share/19AwPKsSnY/

No comments:

Post a Comment