Monday, May 5, 2025

 *అతడుంటే అన్నీ ఉన్నట్లే* 

*“తనవెంటన్ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్ దానివె* 
*న్కను బక్షీంద్రుడు, దాని వెన్కను ధనుః కౌమోదకీ శంఖ చ* 
*క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండునై వచ్చి రొ* 
*య్యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాలగోపాలమున్”* 

*ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్ర మోక్షంలోని పద్యమిది. దీని అర్థమే పోతన జీవన విధానం. గజేంద్రుడు మొసలిబారి నుంచి తనను కాపాడమని ఎవరిని ప్రార్థించాడు? భాగవత పద్యాల్లో చూస్తే.. 'ఈశ్వరా... ఈశ్వరా' అనే సంబోధనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఈశ్వరుడంటే శివుడు కాదు, విష్ణువూ కాదు. బ్రహ్మ అసలే కాదు. మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలకు అధిపతియైన పరమేశ్వరుడన్న మాట. మరి సర్వలోకాధిపతి, ఆత్మచైతన్య స్వరూపుడు అయిన భగవంతుణ్ని ప్రార్థిస్తే విష్ణువు చక్రాయుధుడై వచ్చి కాపాడటమేమిటి? అంటే మనం భగవంతుణ్ని ‘ఫలానా రూపంలో వచ్చి నన్ను కాపాడు' అంటే అలాగే వస్తాడు.*

*ఏ రూపమో ప్రత్యేకించి చెప్పకపోతే... స్థితికర్త, పాలన, పోషణ చూసే బాధ్యత కలవాడు విష్ణువు కాబట్టి ఆయన వస్తాడు. అందుకే గజేంద్రుడి ప్రార్థన విని సర్వేశ్వరుడు విష్ణురూపంలో వచ్చాడు. అది సరే! గజేంద్రుడు కేవలం భగవంతుణ్ని వచ్చి తన ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరాడు. కానీ, అడగక పోయినా ఆయన వెంట లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు, అతని వెనుక విల్లు, గద మొదలైన ఆయుధాలు, ఆపైన వైకుంఠానికి విష్ణు దర్శనానికి వచ్చిన నారదుడు... ఇలా ఒకరేమిటి వైకుంఠంలో ఉండే అందరూ ఎందుకు వచ్చారు? దీనర్థం... మనం భగవద్దర్శనం కోసం ప్రార్థిస్తే చాలు. ఆ దర్శనంతోనే సిరిసంపదలన్నీ వస్తాయి. దాసదాసీజనం సమకూరుతారు. వస్తువాహనాలు కొనగలిగే శక్తి సమకూరుతుంది. మన రక్షణ కోసం సర్వాయుధాలూ వస్తాయి. అత్యున్నత అధికారులందరూ మనచుట్టూ తిరుగుతారన్నమాట. ఈ రహస్యం తెలిసినవాడు కాబట్టే పోతన మహాకవి రాజుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరగడం మాని ఒక్క విష్ణువు చుట్టూ మాత్రమే మనసును ప్రదక్షిణం చేయిస్తూ భాగవతం రచించాడు. అందుకే ఆయనకు ఇహలోక జీవితమూ సుఖంగా ముగిసింది (శ్రీనాథునిలా కాకుండా). పరలోకంలో మోక్షమూ దక్కింది. ఈనాటి వారూ ఈ రహస్యాన్ని గ్రహించి భగవంతుని యందు నమ్మక ముంచి ఆత్మవిశ్వాసంతో తమ పని తాము చేస్తే దక్కవలసిన గౌరవాలు అవే దక్కుతాయి.*

*┈┉┅━❀꧁హరి ఓమ్꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌺🌷🌺 🙏🕉️🙏 🌺🌷🌺

No comments:

Post a Comment