Tuesday, September 30, 2025

 *సేతు రహస్యం - 10*
🌊

రచన : గంగ శ్రీనివాస్


*గోదావరి తీరం- రామాయణ సారం*


మరుసటి రోజు కేట్ శ్రీధర్ రాజేష్ లు ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ చూశారు. శ్రీధర్ కేట్ లకు ఏకాంతాన్ని కల్పించాడు రాజేష్, అంతకు ముందు తాజ్ మహల్ ను వారిద్దరు విడిగా చూసారు. అయినా ఇద్దరూ కలసి ఆ ప్రేమ చిహ్నం ముందు నిలుచుంటే కలిగే భావం వేరు. మనస్సు లోపలి పొరల్లో దాచుకొని ఉన్న ప్రేమ కూడా వరదలా పొంగి కళ్ళ నుండి వెల్లువగా కురుస్తోంది, వెన్నెల జల్లులా.. ఆ మధురానుభూతుల్ని పదిలపరచుకుంటూ చేతిలో చేయి వేసుకుని తిరిగారు వారిద్దరూ.

ఆ రాత్రి ఫ్లైట్ లో హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. రాజేష్ తన బాబాయ్ ఇంటికి వెళ్ళి వచ్చాడు. తరువాత రోజు రాజమండ్రి ప్రయాణమయ్యారు. దారి పొడవునా కేట్ తన సందేహాలు అడుగుతూనే ఉంది. రాజేష్ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. శ్రీధర్ కి కూడా చాలావరకు అన్ని కొత్త విషయాలే. రాజేష్ కి ఇండియా గురించి నాలెడ్జి బాగా ఉందే అని ఆశ్చర్యపడ్డాడు శ్రీధర్.

రాజమండ్రి చేరాక హోటల్లో రూమ్ తీసుకొందామన్న శ్రీధర్ ని వారించి తన తాతగారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు రాజేష్.

పరంధామయ్యగారి ఇల్లు విశాలంగా ఉంది. ఇంటి చుట్టూ ఉన్న పూల తోట ఇంటి అందాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది. వాళ్ళు పెంచుకుంటున్న గిన్ని కోళ్ళు కేట్ కి భలే వింతగా తోచాయి.

ఆప్యాయంగా పలకరిస్తూ వారిని ఆహ్వానించారు పరంధామయ్య గారు, వారి భార్య, కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్ళు అందరూ కలివిడిగా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే ఒంటరిగా ఎవరి ఫ్లాట్లలో వాళ్ళు ఉండే తమ కల్చర్ కి భారతీయ సంస్కృతికి భేదమేదో మెల్లగా అవగతమవుతున్నట్లు తోచింది కేట్ కి.

రాజేష్ తాతగారింట్లో విందు కేట్ కి కొత్తగా ఉంది. ఇండియన్ ఫుడ్ అలవాటే ఆమెకి. అయినా సౌత్ ఇండియాలో అందునా గోదావరి జిల్లాల ప్రత్యేకమైన వంటలు ఆమె రుచి చూచి ఉండలేదు. కొంచెం కొంచెం అన్నీ రుచి చూసేసరికి ఆమెకు ఎక్కువ తిన్నట్లనిపించింది.

భోజనాల తర్వాత కేట్ పరంధామయ్య గారి మనవళ్ళతోను మనవరాళ్ళతోను తోటలో తిరుగుతూ అన్నీ పేరు పేరునా కనుక్కుంటూ ఎంజాయ్ చేసింది. ఆమెను చూసి పరందామయ్యగారు ముచ్చటపడి “మన దేశంలో పుట్టాల్సిన పిల్ల" అన్నారు.

“ఎక్కడపుడితే ఏం మనింట్లోనే ఉంచేసు కుందాం” అంది, పరంధామయ్యగారి భార్య సీరియస్ గా.

రాజేష్ నవ్వి "ఏంటి అమ్మమ్మా కేట్ నీకు అంత నచ్చిందా” అన్నాడు.

“ఏరా నీకు నచ్చలేదా?” అంది ఆవిడ.

"కేట్ ఎవరికి నచ్చదు? కాని కేట్ శ్రీధర్ ని ఇష్టపడుతుంది” అన్నాడు రాజేష్.

శ్రీధర్ మేడ పైన గదిలో కిటికి దగ్గర కూర్చుని కేట్ నే చూస్తున్నాడు. పిల్లలతో ఎలాంటి అరమరికలు లేకుండా కలసిపో గలగటం ఒక కళే సుమా అనిపించింది అతనికి. రెండు రోజుల క్రితం తోడేళ్ళ లాంటి మీడియాను ఫేస్ చేసింది ఈమేనా అనిపించింది. ఒక వైపు ప్రొఫెషనల్ రిసెర్చ్ చేస్తూ సునిశితమైన ప్రజ్ఞ, మరోవైపు పిల్లలతో కలసిపోగల అమాయకత్వం అతన్ని అబ్బురపరిచాయి.

"నిజమట్రా” అంది పరంధామయ్యగారి భార్య.

"వారిద్దరికంటే మీరే మాట్లాడుకుంటుంటే పొరబడ్డాను" అంది నొచ్చుకుంటూ.

"తాతయ్యా, భట్టుమూర్తిగారు ఎప్పుడు వస్తారు? మేము చాలా ఆసక్తిగా ఆయన కోసం ఎదురుచూస్తున్నాము” అన్నాడు రాజేష్.

“సాయంత్రం వస్తారు. నేనే వెళ్ళి వెంటపెట్టు కొని వస్తాను సరేనా” అన్నారు పరంధామయ్యగారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సాయంత్రం వేళల్లో ప్రకృతి అందాలను మేడ పై నుంచి చూస్తూ ఆనందిస్తోంది కేట్. దగ్గర్లోనే గోదావరి నది గంభీరంగా సాగిపోతుంది. దాని పైన కట్టిన అందమైన బ్రిడ్జి గోదావరి నడుముకు ధరించిన వడ్డాణంలా భాసిల్లుతోంది. గోదావరి వంక తదేకంగా చూస్తూ, ఏదో అవ్యక్తానందానికి గురయింది ఆమె మనసు.

శ్రీధర్, రాజేష్ లు రామాయణంలో ఎటువంటి సందేహాలు తీర్చుకోవాలో చర్చించుకుంటున్నారు. శ్రీధర్ కి రామాయణం గురించి చాలా స్కెచీగా తెలుసు. రాజేష్ కి కొంత ఎక్కువ నాలెడ్జి ఉంది రామాయణం పైన. వాళ్ళ ఇంట్లో రామాయణం రెగ్యులర్ గా చదువు తుంటుంది రాజేష్ తల్లి.
📖

పరంధామయ్యగారు భట్టుమూర్తిని వెంట బెట్టుకుని వచ్చారు. అందరూ వచ్చి చావడిలో కూర్చున్నారు. భట్టుమూర్తిగారికి కాఫీ ఫలహారాలు ఇచ్చింది పరంధామయ్య గారి భార్య. తర్వాత పరంధామయ్య గారు రాజేష్ ను అతని మిత్రులను భట్టుమూర్తి గారికి పరిచయం చేసారు. శ్రీధర్ కేట్ ల కోసం భట్టు మూర్తిగారు సంగ్రహంగా రామకథను, సుందర కాండను వివరించారు.

ఆయన చెప్తున్న దానిని రాజేష్ కేట్ కి అర్థమయ్యేలా ట్రాన్స్ లేట్ చేసాడు. అద్భుతమైన రామకథను ఏకాగ్ర చిత్తంతో వింది కేట్.

తర్వాత యుద్ధకాండ నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు సంగ్రహంగా వినిపించారు భట్టుమూర్తి. శ్రీధర్ తన సందేహాల చిట్టాతో సిద్దమయ్యాడు. మధ్య మధ్యలో కాఫీలు, స్నాక్స్ అందుతూనే ఉన్నాయి.

భట్టుమూర్తిగారు సందేహాలుంటే అడగమని చెప్పారు. అది విని శ్రీధర్ అన్నాడు.

“రామాయణం ఇంత బాగుంటుందని నాకింతవరకు తెలియదు. మాకు చాలా చక్కగా రామకథను వినిపించారు. అయితే రామసేతువు గురించి ఏమైనా వివరంగా చెప్పగలరా"?

భట్టుమూర్తిగారు శ్రీధర్ వైపు చిరునవ్వుతో చూశారు. "పరంధామయ్య గారు, మీరంతా రామసేతువు నిజమా కాదా అని సత్యాన్వేషణ చేస్తూ భారతదేశానికి వచ్చారని చెప్పారు నాయనా! మీరు చేపట్టినది దైవకార్యము, మీరంతా నిమిత్త మాత్రులు. పవనసుతుడైన ఆ రామదూత తన స్వామి కార్యాన్ని మీ చేత నిర్వహింప చేస్తున్నాడు. మీరెంతో ధన్యజీవులు. ఇకపోతే ఈ బృహత్కార్యంలో పాలు పంచుకోగలగడం నా అదృష్టం”

"ఇక మీరు అడిగిన ప్రశ్న గురించి వివరించాలంటే రామసేతువు నిర్మాణానికి ముందు జరిగిన విషయాలు, తర్వాత రామసేతువు నిర్మాణంలో జరిగిన కొన్ని విశేషాలు మీకు వివరంగా చెప్పాలి" అని భట్టుమూర్తి శ్రీరామచంద్రుడు సముద్రుణ్ణి ప్రార్థించటము, తర్వాత సముద్రుడు ఉదాసీనతను పాటించడంతో అలిగి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టడం, అప్పుడు సాగరుడు మానవ రూపంలో శ్రీరాముణ్ణి శరణువేడటం, మార్గాంతరం తెలియజేసి సహకరించటం, బ్రహ్మాస్త్రాన్ని వేరే చోట పడేలా శ్రీరాముడు ప్రయోగించడం వివరంగా చెప్పారు.

తర్వాత శ్రీరాముడు విశ్వకర్మ కుమారుడైన నలుడి సహాయంతో సేతు బంధనం గావించడం, ఆ సేతువు నిర్మంచడం కోసం వారు వాడిన పదార్థాలు, శరవేగంతో ఐదు రోజులలోనే నూరు యోజనాలు నిర్మించబడటం అంతా వివరంగా చెప్పారు.

"యోజనమంటే ఎంత దూరం?" అని అడిగాడు శ్రీధర్.

"యోజనమంటే దగ్గర దగ్గర 8 మైళ్ళ నుంచి 10 మైళ్ళ వరకు ఉండవచ్చని పండితులు అంటారు." అన్నారు భట్టుమూర్తి. నూరు యోజనాల పొడవు పదియోజనాల వెడల్పుతో విశాలంగా నిర్మిచబడింది రామసేతువు. అంటే ఈనాటి లెక్కలలో నూరు యోజనాలంటే 1280 నుంచి 1600 కి.మీ. పొడవు. 128 నుంచి 160 కి. మీ వెడల్పు ఉంటుంది.

మరి ఈనాడు శ్రీలంకకు భారతదేశానికి మధ్య ఉన్న సేతువు 40 నుంచి 50 కి.మీ దూరం లోనే ఉంది. మరి ఇది ఎలా పొసుగుతుంది. ఆదిలోనే హంసపాదులా లెక్క మొదట్లో పీఠముడి పడినట్లయ్యి నిస్సత్తువ ఆవరించింది రాజేష్ కి.

“శ్రీ రామసేతువు నిర్మాణం తర్వాత జరిగిన కాలం ఏమీ స్వల్పమైనది కాదు. ఖండాల రూపురేఖలే మారిపోయేంత యుగాలు గడచిపోయాయి. త్రేతాయుగం నాటి రామ సేతువు ఇంకా అలాగే అదే స్వరూపంలో ఉంటుందని అనుకోలేము. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల కాలం జరిగిపోయింది. అదీకాక కాంటినెంటల్ డ్రిప్ట్ అని ఖండాలు నీటి పై తేలుతున్న రీతి ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నా యని శాస్త్రవేత్తల పరిశోధనల వలన తెలుస్తోంది. అంతేకాక కొన్ని భూ భాగాలు నీట మునిగిపోవటం కొన్ని భాగాలు నీటి పైకి కనబడటం వంటివి కూడా జరిగి ఉండవచ్చు. అనేక రకాల ప్రకృతి ఉత్పాతాల వలన ఇలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.”
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా ఉండవచ్చు కాని ఎవిడెన్స్ ఒక్కటి చాలు. రామసేతువు నిజమా కాదా అన్నది తెలుసుకోవడమే శ్రీధర్ ఉద్దేశం. అంతేకాని ప్రత్యేకంగా వివరాలను మసి పూసి మారేడుకాయ చేయాలనే సంకల్పం అతనికి లేకపోవటం వలన రామసేతువు కొలతల విషయం నిర్వికారంగా విన్నాడు.

"రామసేతువు నిర్మాణం ఎలా జరిగింది ? ఎటువంటి పదార్థాలు వాడారు ? ఇంకా రామాయణంలో రామసేతు నిర్మాణం గురించి నిక్షిప్తమైన రహస్యాలు ఏమైనా తెలియజేయండి " అని అడిగాడు.

శ్రీధర్ ప్రశ్నను విని కొంచెంసేపు మౌనంగా ఉండిపోయారు భట్టుమూర్తిగారు. తర్వాత ఇలా అన్నారు.

"రామసేతువు నిర్మాణం 5 రోజుల పాటు జరిగింది. మొదటి రోజు 14 రెండవ రోజు 20 మూడవ రోజు 21 యోజనాల నిర్మాణం జరిగింది. నాల్గవ రోజు 22 ఐదవ రోజు 23 యోజనాలు నిర్మాణంతో ముగిసింది. మహా సత్వం గల ఆ కపి వీరులు ఐదు రోజుల్లో సేతువు నిర్మాణం పూర్తి చేశారు. "

"సేతువు నిర్మాణం విశ్వకర్మ కుమారుడైన నలుడి ద్వారా జరిగింది. విశ్వకర్మ అనేక విధాల నిర్మాణాలకు ఆద్యుడు. అలాగే నలుడు కూడా యంత్ర, వాస్తు తదితర శాస్త్రాలలో పరిపూర్ణ ప్రజ్ఞ కలవాడు.”

"సాగరుడు సేతు నిర్మాణం గావించమని శ్రీరామునికి సలహా ఇచ్చిన తర్వాత ఆ కార్యం నెరవేర్చగల సమర్థుడు ఎవరు అనే ఆలోచన వచ్చింది. అప్పుడు నలుడి గురించి శ్రీరామునికి సాగరుడు చెబుతాడు”

శ్రీరాముడు సేతు నిర్మాణం బాధ్యతను నలుడుకి అప్పగించిన తర్వాత నలుడు తను వారథిని సమర్థవంతంగా నిర్మిస్తానని హామీ ఇస్తాడు.

"సేతువుని వర్ణిస్తూ వాల్మీకి కవి అది ఆకాశంలో కనిపించే పాలపుంతలా ప్రకాశిస్తుంది అంటాడు".

"రామసేతువు గురించి మరొకసారి రామాయణంలో ప్రస్తావించేప్పుడు స్త్రీ తల దువ్వుకున్నప్పుడు మధ్యలో ఏర్పడిన పాపిడలా ఉందని వర్ణిస్తాడు. అంటే హిందూ మహాసముద్రాన్ని రెండు భాగాలు గా విభజించినట్లుగా కనిపించినట్లు భావించవచ్చు..ఇంకో విషయం కూడా మీకు ఆసక్తి కలిగించవచ్చు.”

"శ్రీరాముడు సాగరుని పై కోపించి తీవ్రమైన బాణాలను ప్రయోగిస్తాడు. సాగర జలాలు అల్లకల్లోలమైపోతాయి. సముద్రగర్భంలో ఉన్న అనేక జీవరాశి ప్రళయకాలంలో ఆందోళన చెందినట్లు భయపడతాయి.
తర్వాత శ్రీరాముడు సముద్రజలాలన్నింటి ని శోషింపచేస్తానని బ్రహ్మాస్త్రాన్ని వింటికి సంధిస్తాడు. అప్పుడు భూమిపై చీకట్లు కమ్ముకుంటాయి. దేవతలు, సిద్ధ, చారణులు తల్లడిల్లిపోతారు.”

"సాగరుడు చేతులు జోడించి మానవ రూపంలో జలాల మధ్య అస్తమిస్తున్న సూర్యునిలా ప్రత్యక్షమవుతాడు. 'రామా, నీవు నిర్ణయించిన ధర్మాలను ఆచరించట మే నా కర్తవ్యం. వానర సేన నన్ను దాటడానికి ఒక వారధి నిర్మించు. అది నిలిచి ఉండేలా నేను సహకరిస్తాను అంటాడు".

"రామబాణాన్ని ఎక్కుపెట్టాక దించే ప్రసక్తి లేకపోవటం చేత ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడ విడువాలో తెలుపమంటాడు రాముడు. తనకు ఉత్తరంగా ద్రుమకుల్య అనే చోట అభిరులు అనే దుర్మార్గులు తన జలాలను తాగుతున్నారు. వాళ్ళు మొత్తం నాశనమయ్యేలా అక్కడ పడేటట్టు విడవమని సాగరుడు కోరతాడు. రాముడు అలానే చేస్తాడు".

"బ్రహ్మాస్త్రం పెద్ద శబ్దంతో భూమిని తాకిన చోట పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. దానిని ప్రణం అంటారు. అక్కడ ఏర్పడిన గొయ్యి లో భూమి అట్టడుగు పొరల నుంచి జలం ఊరింది. అంతేగాక అక్కడ మొత్తం ఎడారిగా మారిపోయింది. ఆ ప్రాంతాన్ని 'మీరు' అంటారు. ఇది రాజస్థాన్ లో ఉందని చెబుతారు."

"రాముడు ఆ ప్రాంతానికి వరమిస్తాడు. అది చాలా పవిత్రమయినదిగా ఉంటుందని చెప్తాడు. అదే విధంగా అది అన్ని కాలాలలో ను ప్రసిద్ధి చెందుతుంది".

"సేతువుని కూడా రాముడు చాలా పవిత్రమైన స్థలంగా అన్ని కాలాలలో నిలిచి ఉంటుందని ఆశీర్వదిస్తాడు. దానిని "నలసేతువు", "సేతు బంధనం అని వ్యవహరిస్తారని తెలియజేస్తాడు. అలాగే ఇప్పటికీ దానిని అందరూ సేతువుగానే వ్యవహరిస్తున్నారు" అన్నారు భట్టుమూర్తిగారు.
🌊
*సశేషం*  ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment