Tuesday, September 30, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-160.
16d3;309e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣6️⃣0️⃣.```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                      *భగవద్గీత*
                    ➖➖➖✍️.```
       (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)*
—————————————
*14. వ శ్లోకము:*

*”ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః ।*
*మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ॥ 14 ॥*

“ధ్యానంలో కూర్చున్న వాడి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి భయము, భీతి, ఆందోళన ఉండకూడదు. మనసును బ్రహ్మయందు అంటే పరమాత్మయందు నిలపాలి. చరింపచేయాలి. అలా చేయాలంటే మనసును సంయమింపచేయాలి. నిలకడగా ఉంచాలి. పరమాత్మను తప్ప వేరే ఏ విషయాన్ని గురించి ఆలోచించకూడదు. ఈ ధ్యానం అంతా నాకు పరమ గతి కలగడం కోసమే చేస్తున్నాను అనే ధృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి.”
```
ప్రశాంతాత్మా అంటే మనసును, చిత్తమును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఆలోచనలు ఆందోళనలు ఉండకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. అంటే మనము ధ్యానంలో కూర్చోగానే ఇదివరకు చూచినవి, విన్నవి, తాకినవి, జరిగినవి విషయాలు అన్నీ గుర్తుకు వస్తాయి. ఎక్కడెక్కడో ఎప్పుడో జరిగిన విషయాలు అన్నీ అప్పుడే గుర్తుకొస్తాయి. వాటి వలన బాధ, భయము, సంతోషము కలుగుతాయి. అటువంటి గతకాలపు ఆలోచనలు మనసులోకి రాకుండా అరి కట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

‘విగతభీ’ అంటే భయం ఉండకూడదు. గతించిన విషయాలు గుర్తుకొస్తాయి అని పైన చెప్పుకున్నాము కదా. అలాగే రాబోయే విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి కూడా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల వల్ల భయం కూడా కలిగే అవకాశం ఉంది. అంతేకాదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో అన్న భయం ఉంటుంది. దేనికీ భయపడకూడదు. మనసులో గుబులు ఉండకూడదు. ఈ టైములో ఆ పని చేద్దామనుకున్నాను. కాని చేయలేకపోయాను. ఇక్కడ కూర్చున్నాను. అక్కడ నేను లేకపోతే ఏం జరుగుతుందో ఏమో అనే చింత విడిచిపెట్టాలి. బయట ఏం జరిగినా నిశ్చలంగా ఉండాలి. అన్నీ భగవంతునికి అర్పించి మనసును నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవాలి. ఇది కష్టమే అయినా అభ్యాసంతో సులభమే అవుతుంది.

తరువాతది బ్రహ్మచర్యము పాటించాలి. అంటే మనసు కామ వాంఛల వైపు వెళ్లకూడదు. 
స్త్రీ సంబంధమైన ఆలోచనలు రాకూడదు. స్త్రీలు ధ్యానంలో కూర్చుంటే పురుష సంబంధమైన ఆలోచనలు రాకూడదు. అటువంటి సంకల్పములు కూడా రాకూడదు. అసలు సాంసారిక సంబంధమైన ఆలోచనలే మనసులోకి రానీయకూడదు. ఇది అందరూ ఆచరించ వలసిన విషయము. బ్రహ్మ చర్యము అంటే కేవలం శరీరమే కాదు, మనసులో కూడా అటువంటి ఆలోచనలు రాకూడదు. మాటలు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు. అప్పుడే మనసు పరిశుద్ధంగా ఉంటుంది. ఇది బ్రహ్మచర్యమునకు మనం లౌకికంగా చెప్పుకునే అర్ధము.

బ్రహ్మ అంటే శబ్దబ్రహ్మ అని అంటారు. శబ్దము అంటే వేదములు, శాస్త్రములు. 

వేదములు, శాస్త్రములు బ్రహ్మస్వరూపాలు. అటువంటి వేదములను, శాస్త్రములను శ్రద్ధతో అధ్యయనం చేయడం కూడా బ్రహ్మచర్యమే. గురుకులంలో బ్రహ్మచారులు చేసే పని అదే కదా! దానినే బ్రహ్మచర్యము అంటారు. ధ్యానమునకు ముందు వేదాధ్యయనము, శాస్త్ర అధ్యయనము చేసి ఉండాలి అని భావము. అప్పుడు ఆత్మ వేరు శరీరము వేరు అనే జ్ఞానము కలుగుతుంది. గురువు నుండి వేదాంతవిషయాలు, శాస్త్రములకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కూడా బ్రహ్మచర్యమే అవుతుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మనసులో తాను శాస్త్రముల ద్వారాగానీ, గురువునుంచి కానీ ఆర్జించిన జ్ఞానము మాత్రమే గుర్తుకు రావాలి కానీ, ప్రాపంచిక విషయాలు గుర్తుకు రాకూడదు. తల్లి, తండ్రి, బంధువులు గుర్తుకు రాకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనసును కల్లోలపరిచే ఏ విషయమూ గుర్తుకు రాకూడదు. దానినే బ్రహ్మచారి వ్రతే స్థితః అని ఇక్కడ చెప్పారు.

తరువాత మనస్సంయమ్య అంటే మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఇప్పటి దాకా చేసిన పనులు అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, మనలో గతం గురించి, భవిష్యత్తు గురించి ఉన్న భయము ఆందోళనలను పక్కన పెట్టడం, తరువాత కామసంబంధమైన ఆలోచలను మనసులోకి రానీయకుండా కట్టడి చేయడం, తాను వేదములను, శాస్త్రములను, గురుముఖతా ఆర్జించిన జ్ఞానమును మననం చేసుకోవడం. ఇవన్నీ చేస్తే మనస్సు సంయమింపబడుతుంది. అంటే మన మనసు మన అదుపులో ఉంటుంది. అటు ఇటు పోదు. చంచలంగా ఉండదు. స్థిరంగా ఉంటుంది. అటువంటి మనసును ఆత్మయందు స్థిరంగా నిలపాలి.

తరువాత ఎవరిని చింతించాలి అంటే మచ్చిత్తో అంటే భగవంతుని చిత్తములో నిలుపుకోవాలి. మత్పరః అంటే భగవంతుడు తక్క నాకు మరొక దిక్కు లేదు అని నమ్మాలి. అప్పుడే యుక్తః అంటే ధ్యానములో యుక్తుడు అవుతాడు. నిమగ్నమౌతాడు.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

No comments:

Post a Comment