*చెట్టుమీద పిట్ట పాట (విదేశీ జానపద హాస్యకథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032213
**************************
ఒక ఊరిలో ఒక చిన్న ఇంటిలో ఒక ముసలి దంపతులు నివసిస్తా ఉండేవాళ్ళు. వాళ్లకు పెళ్లయి నలభై ఏళ్లయినా పిల్లలు మాత్రం కలగలేదు. వాళ్లకు పకక్షులు అంటే ప్రాణం. జొన్న కంకులు, సద్ద కంకులు తెచ్చి ఇంటి చుట్టూ చూరుకు వేలాడదీసేవాళ్ళు. నీళ్ల తొట్లు, చెట్లకు చిన్న చిన్న గూళ్ళు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడినుంచో పకక్షులు వచ్చేవి. గూళ్ళలో చేరి గుడ్లు పెట్టి, పిల్లలు పొదిగి, ఎగిరిపోయేవి. వాళ్లను చూసి అవి అస్సలు భయపడేవి కాదు. ఆ ఇంటిని పుట్టినిల్లులా భావించేవి. ఆ దంపతులు తాము తిన్నా తినకపోయినా వాటికి మాత్రం ఏ లోటు రాకుండా సొంత పిల్లల్లా చూసుకునేవాళ్ళు. ఎప్పుడూ పకక్షుల కూతలతో, పిట్టల పాటలతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది.
ముసలాయన రోజూ పక్కనే వున్న అడవికి పోయి కట్టెలు కొట్టుకొని వచ్చేవాడు. ముసలామె వాటిని తీసుకొని పోయి ఊర్లో అమ్ముకొని వచ్చేది. వచ్చిన దాంట్లో కొంచెం తిని మిగిలినదంతా ఆ పకక్షులకు, వాటి పిల్లలకే పెట్టేవాళ్ళు.
ఒకరోజు ముసలాయన అడవిలో కట్టెలు కొట్టుకుంటూ వుంటే ఒక కమ్మని పక్షి కూత చెవులకు ఇంపుగా వినపడింది. అంత అందమైన పిట్టను, అంత మధురమైన పాటను అతను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. ఆ పిట్ట తీయగా పాట పాడుతా వుంటే చెట్టును కొట్టడం ఆపేసి అలాగే తదేకంగా సంబరంగా వింటూ ఉండిపోయాడు.
కాసేపటి తరువాత పిట్ట పాడటం ఆపేసి కొంత దూరం ఎగిరిపోయి ఇంకో చెట్టు మీద కూర్చుని మరలా పాట పాడడం మొదలుపెట్టింది. ముసలాయనకు ఆ పాట మరలా మరలా వినాలనిపించింది. దాంతో ఆ పాట వస్తా వున్న వైపు అడుగులేశాడు. పిట్ట ఆలికిడికి మరి కొంచెం దూరం పోయింది. ముసలాయన కూడా అలాగే దాని వెంట ముందుకు పోయాడు.
అట్లా పిట్ట చెట్టుమీద నుంచి చెట్టు మీదకు ఎగురుతా దట్టమైన అడవి మధ్యలోకి పోయింది. ముసలాయన కూడా పట్టు వదలకుండా దాని వెంబడే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా చానా దూరం పోయాడు. చివరికి ఆ పిట్ట ఒక చిన్న నీటి చెలిమె పక్కనున్న చెట్టు మీద కూర్చొని పాట పాడుతా కనబడింది. ముసలాయన చప్పుడు చేయకుండా ఆ చెట్టు కిందకి చేరి అలాగే దానినే చూస్తా ఆ కమ్మని పాట వింటా మైమరిచిపోయాడు. కాసేపటికి ఆ పిట్ట ఎక్కడికో కనపడకుండా ఎగిరిపోయింది.
ఆ ముసలాయన అడవిలోకి చానా దూరం నడిచి వచ్చాడు కదా... దాంతో బాగా దాహం కాసాగింది. ఆ చెట్టు కింద నీటి చెలిమ దగ్గరికి వచ్చాడు. ఆ నీళ్లు చాలా స్వచ్ఛంగా, తేటగా, అడుగున వున్న గులకరాళ్లు కూడా స్పష్టంగా కనపడేలా ఉన్నాయి. నీళ్ల నుంచి కమ్మని మధురమైన వాసన వస్తా ఉంది. మోకాళ్ళ మీద కూర్చొని నీళ్లు దోసిలి నిండా తీసుకొని తనివితీరా తాగాడు. చల్లగా, తియ్యగా, మధురంగా ఉన్నాయవి. వాటిని తాగిన కాసేపటికి ఆ ముసలాయనకు ఏదో మత్తు మనసంతా ఆవరించింది. అంతే... అలాగే ఆ నీటి చెలమ పక్కనే చెట్టు కింద పడుకొని మత్తుగా నిద్రపోయాడు.
చాలాసేపటి తరువాత మెలకువ వచ్చింది.
చూస్తే ఇంకేముంది... అడవిని చీకట్లు చుట్టుముట్టుకుంటున్నాయి. గబగబా పైకి లేచాడు. ఇంటికి వేగంగా బయలుదేరాడు. ఇంతకుముందులా నెమ్మదిగా అడుగులో అడుగు కాకుండా కాళ్లు చెంగుచెంగున పరుగులెత్తుతున్నాయి. శరీరంలో ఏదో కొత్త శక్తి పాదరసంలా ప్రవహిస్తా వుంది. మనసంతా చానా ఉల్లాసంగా, హుషారుగా ఉంది. తాను కట్టెలు కొట్టే చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. కొట్టిన కట్టెలన్నీ చకచకా మొపుగా కట్టి, ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇంతకుముందు ఆ బరువుకు నెమ్మదిగా నడవలేక నడుస్తూ అతి కష్టం మీద ముందుకు సాగేవాడు. ఇప్పుడట్లా కాదు ఆ కట్టెలమోపు ఏమాత్రం బరువుగా అనిపించడం లేదు. కులాసాగా ఈలపాట వేస్తూ చక చకా దూసుకుపోసాగాడు.
ఎప్పుడూ సాయంకాలానికంతా చీకటి పడకముందే ఇంటికి వచ్చే మొగుడు ఇంకా రాకపోయేసరికి ఇంటి దగ్గర ముసలామె కంగారు పడసాగింది. మాటిమాటికి బయటకు పోయి మొగుడు వచ్చే దారి వంకే చూడసాగింది. కనుచూపుమేరలో ఎటువంటి జాడలేదు. ఆమెకు భయం పట్టుకుంది. మనసు ఏదో కీడు శంకించసాగింది. పక్కింటాయన దగ్గరికి పోయింది. వాడు చానా దుర్మార్గుడు. జాలీదయా అస్సలు లేనోడు. ఎవరెట్లా పోతే నాకేం, నేను సుఖంగా వుంటే చాలు అనుకునే రకం.
ముసలామె వాని ఇంటి తలుపు కొట్టి ''నాయనా... రోజూ పొద్దుగుంకేసరికి వచ్చే ముసలోడు, కళ్ళు కనపడనంత కటిక చీకటి అలుముకుంటున్నా ఇంకా రాలేదు. నాకు చానా భయంగా ఉంది. కొంచెం తోడు వస్తావా. అడవిలోకి పోయి చూసొద్దాం'' అంది. దానికి వాడు పకపకా నవ్వుతూ ''ఒసేయ్ ముసలిదానా... ఇప్పటికంతా అడవిలో ఏ పులో, సింహమో నీ ముసలోన్ని అప్పడం లెక్క కరకర నమిలి మింగేసి వుంటుంది. పో పోయి తలుపులేసుకొని పడుకో. లేకపోతే నీవు కూడా చావడం ఖాయం'' అంటూ మొహం మీదనే ధడేలుమని తలుపులు మూసేశాడు.
పాపం... ముసలామెకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గబగబా ఇంటిలోకి వచ్చి ఒక దీపం అంటించి దాన్ని పట్టుకొని అడవిలోకి పోవడానికి సిద్ధమైంది. తలుపు దగ్గరికి వచ్చేసరికి దూరంగా నెత్తిన కట్టెల మోపుతో పరుగు పరుగున వస్తావున్న ముసిలోడు కనిపించాడు. హమ్మయ్య అనుకుంది. మనసు ప్రశాంతంగా తయారయింది. పెదాలపై చిరునవ్వులు పూశాయి.
ఆమె ఇంటికి వచ్చిన మొగుడిని చూసి ఆశ్చర్యపోయింది. నోట మాట రాలేదు. మొహంలోకి మొహం పెట్టి చూస్తా ''నువ్వు... నువ్వు...'' అంది కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని.
''ఏందే... ఏదో దయ్యాన్నో, భూతాన్నో చూసినట్లు అట్లా చూస్తా వున్నావ్. ఏమైంది'' అన్నాడు ముసలాయన.
ఆమె అలాగే ఆశ్చర్యంగా పట్టి పట్టి ఒళ్ళంతా చూస్తూ ''నీ ఒంటిమీద ఒక్క ముడత కూడా లేదు. నువ్వు పడుచువాడి లెక్క మారిపోయావు. మన పెళ్లయినప్పుడు ఎట్లా వున్నావో అచ్చం అట్లాగే వున్నావు తెలుసా'' అంది.
ముసలోడు ఆశ్చర్యపోయాడు. మొహం మీద చేతులు పెట్టి చూసుకున్నాడు. ''నిజమే... ఒక్క ముడతా తగల్లేదు. కాళ్లు చేతులు చూసుకున్నాడు.
చానా బలంగా ఉన్నాయి.
పరుగెత్తుకెళ్ళి నీళ్లలో మొహం చూసుకున్నాడు.
వెంట్రుకలన్నీ నల్లగా నిగనిగలాడుతా ఉన్నాయి.
''ఓహో... ఇందుకే అన్న మాట. కట్టెలమోపు అస్సలు బరువు లేదు. అడుగులు దారిలో తడబడలేదు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు అవలీలగా హుషారుగా దాటుకుంటూ వచ్చేశాను'' అనుకున్నాడు.
పెళ్ళాన్ని కూర్చోబెట్టుకొని జరిగిందంతా పూసగుచ్చినట్టుగా వివరించాడు. ''అయితే ఆ నీళ్లు తాగడం వల్లే ఇలా మారిపోయావన్నమాట అంది'' సంబరంగా.
''అవును'' అన్నాడు ముసిలోడు చిరునవ్వుతో.
అంతలో ఆమె మొహం బాధతో వాడిపోయిన పూవులా ముడుచుకుపోయింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మౌనంగా మారు మాట్లాడకుండా ఒక మూలకు పోయి గమ్మున కూర్చుంది. ''ఏందే... ఇంతసేపు గంగా ప్రవాహంలా గలగలా మాట్లాడుతూ, ఒక్కసారిగా బెల్లం కొట్టిన రాయి లెక్క గమ్మున అలా అయిపోయావు. ఏంది సంగతి'' అన్నాడు.
''నువ్వు పడుచువానివి అయిపోయావు సరే. మరి నేను... ఎవరైనా చూస్తే పడుచు మొగుడు, ముసలి పెళ్ళాం అంటూ పడీ పడీ నవ్వుతారు. ఇంక మనం కలసి ఎలా ఉండగలం. నేను కూడా నీ మాదిరి అయిపోతే బాగుండేది కదా...'' అంది.
ముసలోడు చిరునవ్వుతో మారు మాట్లాడకుండా ముసలామెని ఎత్తి భుజాల మీద వేసుకున్నాడు. కబుర్లు చెబుతా అడవి దారి పట్టాడు. అర్ధరాత్రికల్లా నీటి చలమ దగ్గరికి చేరుకున్నాడు. ఆమె దేవునికి వేలవేల మొక్కులు మొక్కుకుంటా భక్తిగా రెండు దోసిళ్ళ నిండా నీళ్లు తీసుకొని తాగింది. అంతే... కాసేపటికి మబ్బొచ్చి అక్కడే మొగునివల్లో పడి అట్లాగే నిద్రపోయింది. మెలకువ వచ్చేసరికి ఇంకేముంది... చక్కదనాల చుక్కగా మారిపోయింది. ఒకరిని చూసి మరొకరు కిలకిలకిల నవ్వుకుంటా, పాత సంగతులు గుర్తు చేసుకుంటా, ఆడతా పాడుతా హుషారుగా పొద్దునకంతా ఇంటికి చేరుకున్నారు .
వాళ్లను చూసి పక్కింటోడు ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందో చెప్పమని వెంటపడ్డాడు. వాళ్లు చానా అమాయకులు, మంచివాళ్లు కదా... దాంతో జరిగిందంతా చెప్పి ఆ నీటి చలమ దగ్గరికి ఎట్లా పోవాల్నో దారి చెప్పారు. అంతే... వాడు తాను కూడా వాళ్ళలాగే యువకునిగా మారిపోవాలని ఉత్సాహంగా అడవి వైపు అతివేగంగా దూసుకుపోయాడు. అట్లా పోయినోడు ఆరోజు రాత్రి ఎంత చీకటి పడినా మరలా తిరిగి రాలేదు.
తర్వాతరోజు పొద్దున ఆ మొగుడు పెళ్ళాలు ''నిన్న పొద్దుననగా పోయాడు. ఇంతవరకూ రాలేదు. పాపం ఏమైందో ఏమో... ఒకసారి చూసి వద్దాం పద'' అని బయలుదేరారు. చకచకా నడుస్తూ సూర్యుడు నడి నెత్తికి వచ్చేసరికి ఆ చెలిమ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ వాళ్లకు ఎక్కడా ఎవరూ కనపడలేదు. వెతికీ వెతికీ అలసిపోయి తిరిగి పోవడానికి వెనక్కు తిరిగారు.
అంతలో... ఒక పసిపిల్లవాని ఏడుపు కమ్మగా చెవులను సోకింది. ఈ అడవిలో ఎవరబ్బా... అని చుట్టూ చూస్తే ఒక పొద దగ్గర ఆకులు కొంచం కదులుతా కనపడ్డాయి. పోయి చూస్తే ఇంకేముంది... ఆరు నెలల చిన్నపిల్లోడు చిరునవ్వులు నవ్వుతా కనపడ్డాడు.
ఆ పిల్లోన్ని చూసి ముసలామె చానా ఆశ్చర్యపోయింది. చుట్టుపక్కల ఎంత వెదికినా ఎవరూ కనపడడ లేదు. ''పాపం ఈ పిల్లోడు ఏ కన్నతల్లి బిడ్డనో'' అంది. అంతలో ముసలోడు పకపకా నవ్వుతూ ''ఒసేయ్... వీడు ఎవడో కాదు. మన పక్కింటోడే'' అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది.
''చూడు... ఆ పిల్లోని కింద వున్న బట్టలు సరిగా చూడు. నిన్న పొద్దున మన పక్కింటోడు ఏ బట్టలు వేసుకుని బయలుదేరాడో అవే ఉన్నాయి కదా... వీడు అత్యాశ కొద్దీ నవ యువకుడు కావాలని చానా నీళ్లు మరలా మరలా తాగేసినట్టున్నాడు. అందుకే ఇలా పసి పిల్లోడు అయిపోయాడు'' అన్నాడు.
ఆమె ఆ పిల్లోన్ని పైకి ఎత్తుకుంది. అమాయకంగా చిరునవ్వులు నవ్వుతా వున్నాడు. ''ఏమండీ... మనకు ఎట్లాగూ పిల్లలు లేరు కదా... వీన్ని పెంచుకుందామా. చూడు ఎట్లా వున్నాడో అమాయకంగా... చిన్న చందమామలా'' అంది.
ముసలోడు కాసేపు ఆలోచించి ''సరే... వీన్ని ఈసారి ఎవరు ఎట్లా పోతే నాకేం అనుకునే చెడ్డవానిలా కాకుండా... మనలాగే పదిమందికి సాయపడే మంచివానిలా పెంచుదాం. ఏం సరేనా'' అన్నాడు.
ముసలామె అలాగేనంటూ అంగీకార సూచకంగా తల ఊపుతూ బిడ్డను హృదయానికి హత్తుకుంది.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment