*నాలుగు యజ్ఞాలు*
ప్రకృతి ప్రతి వ్యక్తికీ అపార శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది. ఆ అంతరంగ శక్తిని గుర్తించి, పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే వ్యక్తిగతంగా ఎదగడమే కాదు, సమాజానికీ ప్రయోజనకారులు కావచ్చు. జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు.
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనేక మార్గాలను సూచించాయి శాస్త్రాలు. అలాంటి వాటిలో అందరూ సులభంగా అనుసరించగలది- నాలుగు జ్ఞాన యజ్ఞాల మార్గం. జ్ఞానాన్ని అర్థించే విద్యార్థిగా, దాన్ని పంచే గురువుగా, విజ్ఞాన సృష్టికర్త పాత్రలో, జ్ఞానార్జనకు ఇతరులను ప్రోత్సహించే బాధ్యతలో... నాలుగు యజ్ఞాలు చేయవచ్చు మనిషి.
అందరి జీవితాలూ విద్యార్థులుగానే మొదలవుతాయి. డిగ్రీ పట్టా చేతికొస్తే చదువు అయిపోయినట్లు చాలామంది భావిస్తారు. కానీ నిజానికి విద్యార్థి దశకు ఆది తప్ప అంతం లేదు. జీవితాంతం నేర్చుకుంటూ ఉన్నవారే లౌకిక ప్రపంచంలోనూ ఆధ్యాత్మికంగానూ కూడా రాణించగలరు. జ్ఞానం ఎంత సంపాదిస్తే అంతగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిత్య విద్యార్థికి లోకం నిత్యనూతనంగా కన్పిస్తుంది. ఆసక్తి, ఉత్సాహం వారిని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతాయి. రెండో జ్ఞాన యజ్ఞం- గురువుగా మారడం. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మరొకరికి పంచినప్పుడు లభించే తృప్తి వేరు. దానికి ఉపాధ్యాయ వృత్తే చేపట్టనక్కరలేదు. భాష, కళ, విద్య, నైపుణ్యం... ఏదైనా సరే మనకి వచ్చింది అవకాశం ఉన్న ప్రతిచోటా ఇతరులకు నేర్పవచ్చు. బోధన- నేర్పేవారినీ, నేర్చుకునేవారినీ ఇద్దరినీ శక్తిమంతుల్ని చేస్తుంది. ‘స్వాధ్యాయ: ప్రవచనే చ... నేర్చుకో - బోధించు’ అని చెబుతాయి ఉపనిషత్తులు. బోధించడమంటే సమాజానికి సేవ చేయడమే. మూడో యజ్ఞం... మనమే జ్ఞానాన్ని సృష్టించే స్థాయికి ఎదగడం. జ్ఞాన సముపార్జనలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎందరో చెప్పిన పాఠాలు వింటాం, మరెన్నో నైపుణ్యాలు నేర్చుకుంటాం. వాటన్నిటి సారాన్నీ క్రోడీకరించి కొత్త పాఠాలను మనమూ తయారు చేయవచ్చు. అది ఏ రూపంలో చేయగలం అన్నది మన సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. రచన, దృశ్య, శ్రవణ... ఏ మాధ్యమాన్ని అయినా అనుసరించవచ్చు. వ్యక్తిగా ఇది మనల్ని మరొక మెట్టు పైకి ఎక్కిస్తుంది.
నాలుగో జ్ఞాన యజ్ఞం... సమీక్షకుడి పాత్ర పోషించడం. తోటివారు జ్ఞాన సృష్టికర్తలుగా ఎదగడానికి ప్రోత్సహించడం, వారి శిక్షణలో భాగస్వాములు కావడం. సమీక్షకుడిగా, సలహాదారుగా, మార్గదర్శకుడిగా... బాధ్యత నిర్వహించాల్సి వస్తే అది మహత్తరమైన అవకాశంగా భావించాలి. తద్వారా వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించడమే కాక సమాజాన్నీ ప్రభావితం చేయగలగడం ఈ దశ గొప్పదనం.
నేర్చుకోవడం, పంచుకోవడం, సృష్టించడం, ప్రోత్సహించడం- అనే ఈ నాలుగు జ్ఞాన యజ్ఞాలు నేటి ప్రపంచానికి చాలా అవసరమైనవి. అన్ని రంగాల్లోనూ అవధులు దాటిన స్వార్థమే కనిపిస్తున్న ఈ రోజుల్లో నేనూ, నా... అన్న పరిధులు దాటి ‘మన’ అన్న భావన పెంపొందడానికి అవే మూలస్తంభాలు అవుతాయి. సమాజంలో శాంతి సౌఖ్యాలు నెలకొల్పుతాయి.
~నరసింహరాజు కేశిపెద్ది
No comments:
Post a Comment