Tuesday, September 30, 2025

****నిజమైన సుఖం* ➖➖➖✍️

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

           *నిజమైన సుఖం*
              ➖➖➖✍️
```
ప్రపంచంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఎవరూ కష్టాలు కావాలని కోరుకోరు. చాలామంది తాము అనుభవిస్తున్నది నిజమైన సుఖమని అదే ‘జీవితపరమావధి’ అని అపోహలో పడి జీవిస్తున్నారు. 
నిజానికి, శాంతిలేనిదే సుఖం లభించదు. లేనిపోని అనవసరపు ఆలోచనలు, విషయ లంపటాలపై ఆసక్తి... ఇత్యాదులను త్యజిస్తే శాంతి లభిస్తుంది.

దృశ్య పదార్థాలతో, విషయ భోగాలతో లభించే సుఖం నిజమైన సుఖం కానేరదని గీతాచార్యులు చెబుతున్నారు. అది ప్రతిబింబ సుఖం, క్షణిక సుఖం, దుఃఖమిశ్రిత సుఖం.

ఇది కాదు మనిషికి కావలసింది!అవిచ్ఛిన్న, పరిపూర్ణ నిరతిశయ సుఖం. అది కావాలంటే చిత్తంలో శాంతి ఏర్పడాలి!

నశ్యర, అంటే నాశనమయ్యే ప్రాపంచిక పదార్థాల గురించి చింతించినందువల్ల శాంతి లభించదు. శాశ్వతమైన ఆత్మ గురించి, దైవం గురించి చింతించడం వల్ల చిత్తంలో శాంతి నెలకొంటుంది.

మనోనైర్మల్య స్థితితోనే ఆత్మచింతన, వివేకం ఉదయిస్తాయి. చిత్తం విషయాలవైపు పరుగులు తీయక, దృశ్య వాసనలు లేనప్పుడే బుద్ధి నిర్మలంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉండి, మనస్సంయమనం కలిగితే బుద్ధి పరిశుద్ధమవుతుంది. మనసు నిర్మలంగా ఉంటే దుఃఖరాహిత్యం, ఆనంద ప్రాప్తి కలుగుతాయి.

పూర్వకాలంలో నగరానికి ద్వారాలుండేవి. ఆ నగరంలో రాజు ఉండేవాడు. ద్వారాలు సురక్షితంగా ఉన్నప్పుడే రాజు సుఖంగా ఉండగలడు.

గీతాచార్యులు మానవ శరీరాన్ని పురంతో పోల్చాడు. ఆ పురానికి తొమ్మిది ద్వారాలున్నాయి. 
అవి... 
కంటి ద్వారాలు 2, 
చెవి ద్వారాలు 2, 
ముక్కు ద్వారాలు 2, 
నోటి ద్వారం 1, 
మూత్రద్వారం 1, 
మల ద్వారం 1. 
స్పర్శ ద్వారం శరీరమంతటా వ్యాపించి ఉంటుంది.

ఆత్మలో నిలకడ కలగాలంటే శబ్దాది విషయాల నుంచి మనసు మరలాలి. బాహ్యవిషయాల పట్ల ఆసక్తిలేని మనసు అంతర్ముఖమై ఆత్మయందు స్థిరత్వం పొంది అక్షయ సుఖం పొందుతుంది.

అక్షయ సుఖమంటే ఎప్పటికీ నిలిచేది. అటువంటి సుఖం తన ఆత్మలోనే ఉందని గ్రహించక విషయాదులందు లభించే సుఖం కోసం మనిషి అర్రులుచాస్తాడు.

కాని ఇది అశాశ్వతమైనది. పైగా దుఃఖభూయిష్ఠమైనది. అది ప్రతిబింబ సుఖం. బింబభూతమైన సుఖం ఆత్మయందే నిక్షిప్తమై ఉంది. ఆత్మ సుఖమే వస్తువులయందు ప్రతిబింబించి విషయ సుఖంగా వ్యక్తమవుతుంది. ఆత్మ సుఖం అనుభవించాలంటే విషయ సుఖాన్ని త్యాగం చేయడం తప్పనిసరి!

విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖం నిజమైన సుఖంకాదు. పైకి కాస్త సుఖంగా తోచినా లోపల అపారదుఃఖం నిండిఉంటుంది.

అందుకే శ్రీకృష్ణుడు దీన్ని ‘దుఃఖయోని’ అన్నారు. విజ్ఞులు దాన్ని కోరుకోరు. విషయాలను అనుభవించేవాడు అందులో నిబిడీకృతమై ఉన్న దుఃఖాన్నీ అనుభవించడానికి సంసిద్ధమై ఉండాలి.

దృశ్య సౌఖ్యంలో రెండు దోషాలున్నాయి. పైకి సుఖంగా కనిపించినా లోపల దుఃఖం దాగిఉంటుంది. ఆద్యంతాలు అందువల్ల క్షణికాలై వర్తించడం, అంటే- దుఃఖ జనకత్వం, క్షణికత్వం అను రెండు ప్రబల దోషాలు విషయభోగాలతో ఉన్నాయి. కాని, ఆత్మసుఖం అలా కాదు. దీనితో దుఃఖం ఇసుమంతైనా ఉండదు. అతిచిన్న సుఖమది. శాశ్వతమైనది.

సుఖాన్ని కోరుకునేవారు ముందుగా తనలోఉన్న ముఖ్యమైన శత్రువులైన కామక్రోధాలను జయించాలి. అరిషడ్వర్గాల్లో కామక్రోధాలు ముఖ్యమైనవి.
అజ్ఞానాంధకారంతో కొట్టుమిట్టాడు తున్నవారు దీన్ని కొట్టిపారేసి ఎండమావిలో నీటికోసం వెదుకుతుంటారు.

దుఃఖంలోకి దించే పైకి కనిపించే   నిజమని నమ్మి వాటికొరకు పరితపించడం విచారకరం. ఆత్మసుఖాన్ని కోరేవారు తమ శక్తినంతటినీ అంతర్ముఖంగా మళ్లించి ధన్యులవుతారు!✍️```    

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment