Tuesday, September 30, 2025

 *_“ఇసుక గడియారం”_* 
_[-యండమూరి వీరేంద్రనాథ్ గారి *బేతాళ ప్రశ్నలు* నుంచి తెలివిని పెంచుకునే కిటుకులతో కూడిన ఈ అంశం... మీకోసం..]_
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° 
*పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజుకి మౌనభంగం కావించటం కోసం ఈ విధంగా అన్నాడు. "రాజా! మనం చేసే పని యొక్క అంతరార్థం మనకి తెలిసి ఉండాలి. అనారోగ్యం వచ్చినప్పుడు కొందరు ఒకవైపు మందులు వాడుతూ, మరొకవైపు భగవత్ ప్రార్ధన చేస్తారు. మందులు కూడా భగవంతుని సృష్టే అని మనస్ఫూర్తిగా నమ్మరు. ప్రార్ధన కేవలం మానసిక స్వాంతన కోసం మాత్రమే అని, అది కోరిక తీర్చే స్వార్థం కాదనీ తెలుసుకోవటమే జ్ఞానం. అంతా తలరాత అని నమ్మేవారు ఉంగరం పెట్టుకోవటం కూడా తలరాతే అని ఆత్మవంచన చేసుకుంటూ, రత్నాలూ, పేర్లూ, ఇళ్ళూ మార్చటం ద్వారా భవిష్యత్తుని మార్చుకుందా మనుకుంటారు. మానవ ప్రయత్నం చేస్తే తప్ప జీవితంలో ఏ విధమైన ఉత్తీర్ణతా రాదని దేవుడే చెప్పిన ఒక కథ నీకు చెపుతాను. శ్రమ తెలియకుండా విను.*
¥ ¥ ¥ ¥ ¥ 
*కాంచీపురంలో పార్వతీదేవి గుడిలో ఒక యువకుడైన పూజారి ఉండేవాడు. గతంలో చెప్పినట్టే ఈ పూజారికి కూడా రాత్రికి రాత్రి మహాజ్ఞాని అయిపోవాలని కోరిక ఉండేది. రోజూ పూజచేసి తన కోరిక విన్నవించుకునేవాడు.*

*పూజారి పరిస్థితిని గమనించిన దేవతలు, అతడిని కనికరించమని పార్వతిని కోరారు. కానీ పార్వతి ఒప్పుకోలేదు. “తెలివి అన్నది ప్రార్థన వల్ల రావటం ప్రారంభిస్తే, ఇక తెలివికే విలువ ఉండదు. కాసింత పుట్టుక జ్ఞానాన్ని జంతువులకిచ్చినట్టే మనుషులకి కూడా కాస్త జన్మజ్ఞానాన్ని ఇవ్వటమే దేవుడి పని. జంతువులు జన్మజ్ఞానంతో సరిపెట్టుకుంటాయి? ప్రకృతి ఇచ్చిన జ్ఞానాన్ని పెంచుకోవటం మనిషి కర్తవ్యం. ఎలా పెంచుకోవాలా అన్నది అతడి కృషి మీద ఆధారపడి ఉంటుంది. అయినా మీరు చెప్పారు కాబట్టి కొత్తరకంగా అతడి తెలివిని పెంచే ఏర్పాటు చేస్తాను” అంది.*

*మరుసటిరోజు అతడు అర్చన చేస్తూ ఉండగా అశరీరవాణి ఈ విధంగా పలికింది. “నాయనా! నా కుమారులైన కుమారస్వామి, గణపతుల గుళ్లు ఈ పక్కనే ఉన్నాయి. వెళ్లి ఇద్దరికీ చెరో తొమ్మిది నిమిషాలపాటు అభిషేకం చేసిరా. లిప్త మాత్రం కూడా ఇటూ అటూ కాకూడదు సుమా! ఎవరిని కాస్త ఎక్కువ ప్రార్థించినా మిగతా వారికి కోసం వస్తుంది" అన్నది.* 

*పూజారి అయోమయంగా, "ఇది మానవమాత్రులకి సాధ్యం అయ్యేనా తల్లీ!" అన్నాడు.*

*అప్పుడు విగ్రహం పక్కనే గరాటు ఆకారంలో ఉన్న రెండు చిన్నపాత్రలు ప్రత్యక్షమయ్యాయి, వాటి లోపల ఇసుక ఉన్నది. అశరీరవాణి అన్నది "వాటిని తలక్రిందుగా తిప్పితే పైనుంచి ఇసుక కిందకి జారుతుంది. మొదటి దానికి 4 నిమిషాలు, రెండో దానికి 7 నిమిషాలు పడుతుంది. వెనక్కి తిప్పితే, తిరిగి ఇసుక వెనక్కి జారటానికి మళ్లీ అంతే కాలం పడుతుంది. ఈ యంత్రాలతో నా కుమారులను సరిగ్గా చెరి 9 నిమిషాలపాటు పూజించు" అన్నది.*

*మొదట చేతకాలేదు. పూజారి ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరికి సఫలీకృతుడయ్యాడు. దేవి అతడి పట్టుదలకి సంతోషించి "నాయినా! జ్ఞాన సముపార్జనకి కావలసిన కృషి, పట్టుదల నీలో ఉన్నదని అర్థమైంది" అంటూ అతనికి జ్ఞానం నేర్పి క్రమంగా ప్రతిభా వంతుడిని చేసింది.*

*కృషి చేసి, ఏకాగ్రత నిలిపి అతడు ప్రజ్ఞావంతుడయ్యాక ప్రత్యక్షమై "నీ అకుంఠిత దీక్షకు, పట్టుదలకు సంతుష్ఠురాలినయ్యాను, ఇంకొక్క పరీక్ష పెట్టి, నీవు మరింత కృషి చేసి పరిపూర్ణ జ్ఞానివయ్యేలా వరమిస్తాను" అన్నది.*

*పూజారి చేతులు జోడించి "అంతకన్నానా దేవీ..! నీ దయ వలన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలననే ధైర్యం వచ్చింది. అడుగు" అన్నాడు..*

*"కష్టమైన ప్రశ్న ఒకటి అడగనా? సులభమైనవి రెండు అడగనా?" అన్నది.*

*"నా అదృష్టం తేల్చటానికి కష్టమైనది ఒకటి చాలు తల్లీ!" అన్నాడు పూజారి.*

*_"చెట్టు ముందా? విత్తు ముందా?"_ అని ప్రశ్నించింది తల్లి.*

*పూజారి తడుముకోకుండా "విత్తే ముందు" అన్నాడు.*

*"ఎలా చెప్పగలవు అంత ధీమాగా” అని తిరిగి అడిగింది. దానికి అతడు చెప్పిన సమాధానంతో ఆమె పూర్తిగా సంతృప్తి చెంది అదృశ్యమైంది.*

*బేతాళుడు ఈ కథ చెప్పి "రాజా! పూజారి ఇద్దరు దేవుళ్లనీ ఒక్క నిమిషం అటూ ఇటూ కాకుండా పరికరాల సాయంతో ఎలా కొలిచాడు?* 

*'విత్తు ముందు' అన్న సమాధానాన్ని ఎలా సమర్థించుకున్నాడు?" అని ప్రశ్నించి, దీనికి సమాధానం తెలిసీ చెప్పకపోయావో, నీ తల వేయి వ్రక్కలవుతుంది అన్నాడు బేతాళుడు.*
.......................................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
 .
_[ఇవేనండీ ఆ సమాధానాలు....]_ 
*“నాలుగు నిమిషాలు, ఏడు నిమిషాల సమయాన్ని కొలిచే ఇసుక యంత్రాలతో తొమ్మిది నిమిషాలని ఎలా కొలుస్తావు?" అన్న ప్రశ్నకి విక్రమార్కుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “రెండు యంత్రాలనీ బోర్లా తిప్పాలి. 4 నిమిషాలు పూర్తి కాగానే చిన్నదాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలి. పెద్దదానిలో ఇసుక సరీగ్గా 7 నిమిషాల తరువాత పూర్తిగా క్రిందికి జారిపోతుంది. వెంటనే పెద్దదాన్ని బోర్లా తిప్పాలి. అప్పటికి చిన్నదానిలో ఇంకా 1 నిమిషం ఇసుక మిగిలి ఉంటుంది. అయోమయం లేకుండా ఇక్కడే కాస్త ఆలోచించాలి.*

*సరీగ్గా 8 నిముషాలు అయ్యేసరికి చిన్నది పూర్తిగా ఖాళీ అయిపోయి ఉంటుంది. పెద్దదానిలో నిముషం ఇసుక క్రిందికి జారివుంటుంది.*

*ఇప్పటికి 8 నిముషాలు అయ్యాయి. కాబట్టి మనకి కావల్సింది ఇంకా ఒక నిముషం.*

*పెద్దదానిలో 1 నిముషం ఇసుక క్రిందికి జారింది. దాన్ని తిరిగి వెనక్కి తిప్పితే చాలు. లెక్క తేలిపోయిందిగా. ఆ విధంగా 9 నిమిషాలపాటూ వినాయకుడిని, కుమారస్వామినీ అర్చన చేసి ఉంటాడు పూజారి.”*

*ఇక రెండో ప్రశ్న. “కఠినమైన ప్రశ్న ఒకటి వెయ్యనా? సులభమైన ప్రశ్నలు మూడు వెయ్యనా?” అన్న పార్వతిని కఠినమైనది ఒకటే వెయ్యమని పూజారి కోరాడు. "చెట్టు ముందా? విత్తు ముందా?” అన్న ప్రశ్నకి “విత్తు” అని పూజారి సమాధానం చెప్పాడు. “ఎలా చెప్పగలవు?” అని పార్వతి అడిగింది. రెండో సమాధానం చెప్పవలసిన బాధ్యత పూజారికి లేదు. ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం ఆమె కేవలం ఒకే ఒక ప్రశ్న అడగాలి. ఆ విషయమే ఆమెకి విన్నవించుకుని ఉంటాడు. దానికి సంతోషించిన పార్వతి అతడిని జ్ఞానిని చేసి ఉంటుంది" అన్నాడు విక్రమార్కుడు. బేతాళుడు తిరిగి శవంతో సహా చెట్టెక్కాడు.*
__________________________
*_మీకు తెలుసా?_*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*ప్రశ్న: కంటి పరీక్ష ఛార్టుల్లో E అన్న అక్షరాన్ని ఎందుకు ప్రారంభంలో ఉంచుతారు?*
_*జవాబు:* నూట యాభై సంవత్సరాల క్రితం కంటి పరీక్షలో మొదటి పెద్ద అక్షరంగా A వుండేది. త్వరలోనే అది E గా మారింది. మూడు నల్ల అడ్డగీతల మధ్య సమానమైన తెల్ల ఖాళీ స్థలం ఉండటం వల్ల ఆ అక్షరానికి ప్రథమ స్థానం ఇవ్వటం జరిగింది._
_____________________
*_{తెలివిని పెంచుకునే కిటుకేంటో తెలిసిందా..? లేదంటే మళ్ళీ మళ్ళీ తెలిసేదాకా చదవండి. జ్ఞానం ఊరకే రాదు: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*

No comments:

Post a Comment