🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కాలుని కథ:*
➖➖➖✍️
```
పూర్వ కల్పంలో ‘కాలుడు’ అనే ఒక మహాద్విజుడుండేవాడు. అతడు పుష్కర ద్వీపానికి వెళ్లి రెండు వందల సంవత్సరాలు రేయింబవళ్లు తపస్సు చేసాడు. ఆతని తలనుండి ఒక అగ్నిజ్వాల సూర్యజ్వాల లాగా ముల్లోకాలు వ్యాపించింది.
అపుడాతని వద్దకు బ్రహ్మాది దేవతలు వచ్చి 'నీకేం వరం కావాలో కోరుకొమ్మ' న్నారు.
'నాకు జపం చేయటం కంటె మరో దానియందు సుఖం లేద'న్నాడు.
ఏదైనా ఒక వరం కోరుకోవాలని దేవతలాతనిని నిర్బంధించగా అతడక్కడనుండి ఉత్తర హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయటం మొదలు పెట్టాడు.
ఆతని తేజస్సు లోకాలన్నిటా వ్యాపించింది. దీన్ని సహింపని ఇంద్రుడు ఆ విప్రుని తపోభంగం చేయటానికి అప్సరసలను పంపించాడు.
అతడు వారిని గడ్డి పరకల వలె చూచాడు.
ఇతడే ఉపాయాలకు లొంగడని తెలిసి ఆతని పైకి దేవతలు మృత్యు దేవతను పంపారు.
మృత్యువాతని దగ్గరకు వచ్చి 'మానవులు బహుకాలం జీవింపరని లోక మర్యాదను పాటించి శరీరాన్ని వదలమ'న్నాడు.
అప్పుడాతడు “నా ఆయుః పరిమాణము తీరిపోతే నీవే నన్ను తీసికొని పోవచ్చునుగదా-నాయంతట నేనే ప్రాణత్యాగం చేస్తే అది ఆత్మహత్య అవుతుంది-ఆ పాపానికి నేను ఒడిగట్ట”నన్నాడు.
ఆతనిని తీసుకొని వెళ్లటానికి మృత్యువునకు శక్తి చాలక తనదారిని తానే వెళ్లి పోయాడు.
కాలునే(యముని) జయించిన ఆ కాలుని ఇక ఇతడు భూమిపై ఉండకూడదని ఇంద్రుడు లేవనెత్తుకొని తీసుకొని వెళ్లి స్వర్గంలో పడేశాడు.
అక్కడ కూడా స్వర్గాధిదేవతలు ఆతనిని ఏదైనా వరం కోరుకొమ్మని మరల బలవంత పెట్టసాగారు.
ఆ సమయంలో ఇక్ష్వాకువు ఆమార్గంలో పోతున్నాడు. అతడు విషయమంతా తెలిసికొని “అయ్యా! నీవు దేవతలనుండి వరాన్ని తీసుకోకపోతే నావద్దనుండి గ్రహింపమ”న్నాడు.
దానికాజాపకుడు(జపంచేసేవాడు) నవ్వి “దేవతలనుండే వరాన్ని గ్రహింపని వానికి వరమివ్వటానికి నీవు సమర్థుడవా?” అని అడిగాడు.
అప్పుడిక్ష్వాకుడు 'నేను నీకు వరమివ్వటానికి సమర్థుడను కాను. నీవు సమర్థుడవు కాబట్టి నాకు వరమివ్వ'మని ఆ విప్రుని కోరాడు.
అపుడా జపి 'అయితే నేనే నీకు వరమిస్తాను. నీవేం కోరుకుంటావో కోరుకోమ'న్నాడు.
ఇక్ష్వాకుడపుడు 'నేను రాజును. రాజు బ్రాహ్మణులకు అడిగినదిస్తారు. రాజునైయుండి నేను బ్రాహ్మణుని వద్ద వరాన్ని పుచ్చుకోవటం భావ్యమేనా' అని ఆలోచిస్తున్న సమయంలో…
వాదులాడుకొంటూ వేరే ఇద్దరు బ్రాహ్మణులక్కడకు వచ్చారు.
అప్పుడిక్ష్వాకుడు ఆబ్రాహ్మణులను 'మీరెందుకు వివాదపడుతున్నా'రని అడుగగా… అందులో ఒకడు రాజుతో “ఇతడు నాకొక ఆవును దక్షిణతో కూడా దానం చేసాడు. నేనా ఆవునే ప్రతిదానమిస్తానంటే తీసుకోవటం లే”దని ఆక్షేపణ చేసాడు.
అపుడా విప్రులలో రెండవవాడు “నేనిదివరకెప్పుడు దానాన్ని పట్టి యెరుగను. నాకా కోరికే లేదు. ఇప్పుడితడు నన్ను దానాన్ని పట్టమని బలవంత పెడుతున్నాడు.” అని అన్నాడు.
అపుడు రాజు “ఆక్షేపణ చేసిన వాడు శుద్ధుడు కాడు. ఎందుకంటే దానం పట్టి మరల తాను తీసుకొన్న దానాన్ని తిరిగి దాతకే దానం చేయటమనేది ఎట్లా చెల్లుతుంది.” అని అన్నాడు.
అప్పుడు ఇంద్రుడిదే అదను అనుకొని ఇక్ష్వాకునితో రాజా! “నీకీ న్యాయం బాగా తెలిసి వచ్చింది కదా! నీవిప్పుడు బ్రాహ్మణుని వలన వరాన్ని అడిగి అతడిస్తానంటే ఎందుకు తీసుకోవు?” అని అడిగాడు.
దీనికి రాజు జవాబు చెప్పలేక ఆ జాపకునితో నీజపం లోని సగభాగాన్ని ఇవ్వమని అడిగాడు.
కాలుడట్లే తన జపఫలితంలో సగాన్నిరాజునకు దానం చేసాడు.
అప్పుడిక్ష్వాకుడు సర్వలోక గతిని పొందాడు.
జాపకుడును 'సశివ' మనే దేవలోకాన్ని పొందాడు.
ఈ విధంగా స్వర్గాదులందు విముఖులైన బుధులు సిద్ధినే కోరుకుంటారు.(“ఏవం స్వర్గాది విముఖై: సిద్ధిరేవార్థ్యతే బుధై:” 8-2-112) కథాసరిత్సాగరం –ఎనిదవదియైన సూర్యప్రభాలంబకం-రెండవతరంగం).
(ఈ కథ "తానోడి నన్నోడెనా-నన్నోడి తానోడెనా" అని ద్రౌపది వేసిన ప్రశ్న గుర్తుకు తెస్తున్నది కదా. ఒక కథ పూర్తియైన తరువాత ఆ కథాసారాంశాన్ని చెప్పే ఒక శ్లోకం సామాన్యంగా కథాసరిత్సాగరంలో కనిపిస్తుంది. అది 'ఇతి'-'ఏవం' (ఇట్లు-ఈ విధంగా) అని ఆరంభమవుతుంది.✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment