5️⃣1️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*రెండవ అధ్యాయము*
*సాంఖ్యయోగము.*
*70. ఆపూర్యమాణమచలప్రతిష్ మ్ సముద్రమాప: ప్రవిశంతి యద్వత్l*
*తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే సశాన్తి మాప్నోతి న కామకామీll*
ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎల్లప్పుడూ వర్షం కురుస్తూనే ఉంటుంది. భూమి మీద పడ్డ నీరు అంతా అన్ని దిక్కులనుండి వచ్చి నదులలోకి చేరుతుంటుంది. ఆ నదులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కాని సముద్రం ఎప్పటికీ పొంగి పొరలిపోదు. నిశ్చలంగా ఉంటుంది. అలాగే స్థితప్రజ్ఞుడి చుట్టు ప్రాపంచికవిషయాలు, విషయభోగాలు ఎన్ని ఉన్నా, అవన్నీ అతడిని వివిధ ప్రలోభాలకు గురి చేస్తున్నా అతడు మాత్రం సముద్రము మాదిరి నిశ్చలంగా ఉంటాడు. ఈ ప్రాపంచిక విషయాలు అతనిలో ఎటువంటి వికారములను కలిగించవు. అటువంటి స్థితప్రజ్ఞుడు పరమ శాంతిని పొందుతాడు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో తేలియాడేవాడు చిన్న నది వంటి వాడు. ఏ మాత్రం ఎక్కువ నీరు వచ్చి చేరినా ఆ నది పొంగిపొరలుతుంది. గట్లు తెంచుకొని ప్రవహిస్తుంది. అలాగే సాధారణ మానవునిలో ఈ ప్రాపంచిక విషయాలు అలజడిని క్షోభను కలిగిస్తాయి. అతని శాంతిని హరించివేస్తాయి.
ఈ శ్లోకంలో శాంతిని ఎవరు పొందుతారు, ఎవరు పొందరు అనే విషయాన్ని చిన్న ఉదాహరణతో వివరించాడు పరమాత్మ. జ్ఞానిని సముద్రముతో పోల్చారు. ఎండాకాలంలో నదులలో నుండి జలం రాదు. పైగా సూర్యరశ్మికి సముద్రము నీరు ఆవిరయి పైకిపోతుంది. మేఘాల రూపంలో ఉంటుంది. వర్షాకాలంలో వర్షం రూపంలో భూమి మీద పడుతుంది. ఆ వర్షం నీరంతా నదులలోకి, నదులలో నుండి సముద్రములోకి వచ్చి చేరుతుంది. అటు ఎండా కాలంలో కానీ, ఇటు వానాకాలంలో కానీ, సముద్రము నిశ్చలంగా ఉంటుంది. పొంగదు. కుంగదు. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాని అయిన వాడు ఇంద్రియములు, మనసు, బయట విషయములను నిరంతరము గ్రహిస్తున్నా, ఎటువంటి వికారములకు లోనుకాడు. అతనిలో విషయముల పట్ల ఆసక్తి ఉండదు. నిర్వికారంగా ఉంటాడు.
సముద్రంలో ఎప్పుడూ నీరు ఉంటుంది. సముద్రం ఎండి పోవడం అంటూ జరగదు. నదీనాం సాగరో గచ్ఛతి అని అంటారు. అంటే నది ఎక్కడ పుట్టినా సముద్రం వైపుకు ప్రవహించి తుదకు సముద్రంలో కలుస్తుంది. మనకు వర్షాకాలము నాలుగునెలలు. అవే కాకుండా అకాల వర్షాలు, తుఫానులు వస్తాయి. అప్పుడు నదులకు విపరీతంగా వరదలు వస్తాయి. ఎక్కువగా నీరు సముద్రంలోకి చేరుతుంది. కాని సముద్రం నిశ్చలంగా ఉంటుంది. నదులు ఎండి పోతాయి కానీ సముద్రం ఎండి పోదు. సముద్రం దేని మీదా ఆధారపడదు. నదుల నుండి నీరు వస్తేనే నీరు లేకపోతే లేదు అనే పరిస్థితి ఉండదు. ఎల్లప్పుడు నీటితో కలకలలాడుతూ ఉంటుంది. ఇది కేవలం ఉదాహరణమాత్రమే. అలాగే స్థితప్రజ్ఞుడు సముద్రము మాదిరి నిశ్చలంగా ఉంటాడు. వృద్ధిక్షయములు ఉండవు. అటువంటివాడు ప్రాపంచిక విషయములలో సంచరిస్తున్నా, వాటిని అనుభవిస్తున్నా, వాటి మీద ఆసక్తి ఉండదు. జ్ఞాని మనసు మాత్రం నిశ్చలంగా ఉంటుంది. మనసు కలత చెందదు. వాసనలు అంటవు. కోరికలు ఉండవు. అది కావాలి ఇది వద్దు అని ప్రాపంచిక విషయముల వెంట పరుగెత్తడు. ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటాడు.
ఇంతకూ జ్ఞానికి మనస్సు ఉంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ వస్తుంది. మనస్సు లేకపోతే ఇంద్రియములకు సూచనలు ఎవరుఇస్తారు. ప్రపంచంలో వ్యవహరించాలి అంటే మనసు ఉండి తీరాలి. కాబట్టి జ్ఞానికి మనస్సు ఉండి తీరుతుంది. కాని జ్ఞాని దానిని తన అదుపులో ఉంచుకుంటాడు. మనసును ఎక్కువగా బరువులతో నింపడు. అనవసరమైన ఆలోచనలతో నింపడు. చాలా తేలికగా ఉంచుకుంటాడు. ఏది అవసరమో దానినే ఆలోచిస్తాడు. తరువాత ఆ ఆలోచలను మనసులో నుండి తుడిచేస్తాడు. మనసును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటాడు. జ్ఞాని మనసు అత్యంత తేలికగా దూది పింజ మాదిరి ఉంటుంది. కాబట్టి ఉన్నట్టు లేనట్టు ఉంటుంది. కాబట్టి జ్ఞానికి ఎక్కువగా ఫీలింగ్స్ ఉండవు. సుఖదుఃఖములను అతడు పట్టించుకోడు. అన్ని భోగములు కోరికలు అతనిలో ప్రవేశించగానే అతనిలో లీనమై పోతాయి. శాంతంగా ఉంటాయి. ఎటువంటి అలజడి ఉండదు. ఎలాగైతే సముద్రంలో కలవగానే నదుల అస్తిత్వం పోతుందో, యోగిలో చేరగానే కోరికల అస్తిత్వం కూడా పోతుంది. అటువంటి స్థితిలో యోగి పరమ శాంతిని పొందుతాడు. ఎల్లప్పుడూ ఇంద్రియ విషయముల మీద, రాగద్వేషముల మీద ఆధారపడే వాడికి, కోరికలతో సతమతమయ్యే వాడికి ఎప్పుడూ శాంతి ఉండదు.
(సశేషం)
*🌹యోగక్షేమం వహామ్యహం🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P133
No comments:
Post a Comment