Tuesday, September 30, 2025

 *శ్రీ శివ మహా పురాణం*
*389.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-ఎనిమిదో అధ్యాయం* 

*యుగ సంఖ్యా వర్ణనము* 

*ఋషులు ఇట్లు పలికిరి:* 

ఈ కాలమునందు ఏ మానముచే ఆయర్దాయము పరిగణించబడుచున్నది? సంఖ్యారూపములో నుండే ఈ కాలమానములో చరమసంఖ్య ఏది?

*వాయువు ఇట్లు పలికెను:* 

ఆయుర్దాయములోని మొట్టమొదటి మానమునకు నిమేషము అని పేరు. సంఖ్యారూపమగు కాలమునకు శాంత్యతీతము అనే కాలాంశము అంతిమమానమని చెప్పెదరు.కనురెప్పపాటు కాలమునకు నిమేషము అని పేరు. పదిహేను నిమేషములు ఒక కాష్ఠ యగును. ముప్పది కాష్ఠలు ఒక కళ యగును. ముప్పది కళలు ఒక ముహూర్తము అగును. ముప్పది ముహూర్తములు ఒక రోజు (రాత్రి మరియు పగలు) అగును. ముప్పది రోజులు ఒక నెల. ఒక నెలలో రెండు పక్షములు గలవు. కృష్ణపక్షము మరియు శుక్లపక్షము కలిసి ఒక నెల అగును. అట్టి నెల పితృదేవతలకు ఒక రోజు అగును. ఆరు మాసములు ఒక అయనము. రెండు అయనములు ఒక సంవత్సరము. ఈ లోకములో మనుష్యమానముచే ఏ కాలము సంవత్సరమో, అదే కాలము దేవతలకు ఒక రోజు అని, అనగా ఉత్తరాయణము పగలు మరియు దక్షిణాయనము రాత్రి అని శాస్త్రము యొక్క నిశ్చయము. మనుష్యమానములో వలెనే, ముప్పది దివ్యదినములు ఒక దివ్యమాసము అగును. అదే విధముగా, పన్నెండుదివ్యమాసములు దేవతలకు ఒక సంవత్సరమగును. మనుష్యమానముచే మూడు వందల అరవై సంవత్సరముల కాలము దేవతలకు ఒక సంవత్సరమగును. యుగముల సంఖ్య దివ్యమానముచే మాత్రమే లెక్కించబడుచున్నది. భారతదేశములో నాలుగు యుగములు ఉండునని పండితులు చెప్పుచున్నారు.

కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు అనునవి మొత్తము నాలుగు యుగములు. నాలుగు వేల సంవత్సరములు కృతయుగము. నాలుగు వందల సంవత్సరములు రెండు యుగముల మధ్య సంధి. వంద సంవత్సరములు సంధ్యాంశము (సంధిలోని భాగము). వీటిలో క్రమముగా ఒకటి ఒకటి చొప్పున వేలలో తగ్గించినచో యుగములు, వందలలో తగ్గించినచో యుగసంధులు మరియు సంధ్యాంశములు అగును. ఈ విధముగా అధికాంశములతో కలిపి పన్నెండు వేల సంవత్సరముల ఉమా కాలము ఒక కల్పము అని పేరు. డెబ్బది ఒక్క చతుర్యుగములు ఒక మన్వంతరమగును. ఒక కల్పములో పదు నాలుగు మన్వంతరములు ఉండును. ఈ విధముగా ప్రజలతో కూడియున్న కల్పములు మరియు మన్వంతరములు వందల మరియు వేల సంఖ్యలో ఒక క్రమములో గడచి పోయినవి. వాటి సంఖ్య అపరిమితము. వాటిని సంపూర్ణముగా తెలియుట సాధ్యము కాదు. కావున వాటిని ఖచ్చితమగు క్రమములో విస్తారముగా వర్ణించుట శక్యము కానే కాదు. అవ్యక్తము (మాయాశక్తి) నుండి జన్మించిన బ్రహ్మకు కల్పము ఒక పగలు అగును. ఈ బ్రహ్మాండములో వేయి కల్పములు బ్రహ్మకు ఒక సంవత్సరమగును. ఇట్టి వేయి సంవత్సరములు బ్రహ్మకు ఒక యుగము అగును. ఇట్టి వేయి యుగములు పద్మమునుండి జన్మించిన బ్రహ్మకు ఒక సవనమగును. సర్వజగత్కారణమగు బ్రహ్మకు మూడువేల మూడు సవనములు పూర్ణమగు ఆయుర్దాయము అగును.

బ్రహ్మగారి ఒక రోజులో పదు నాలుగు, నెలలో నాలుగు వందల ఇరవై, సంవత్సరములో అయిదు వేల నలభై, మరియు పూర్ణాయుర్దాయములో అయిదు లక్షల నలభై వేల ఇంద్రుల ఆయుర్దాయము పూర్తి యగును. బ్రహ్మయొక్క ఆయుర్దాయము విష్ణువునకు ఒక రోజు, విష్ణువుయొక్క ఆయుర్దాయము రుద్రునకు ఒక రోజు. అదే విధముగా, రుద్రుని ఆయుర్దాయము సదాశివునకు ఒకరోజు, సదాశివుని ఆయుర్దాయము సాక్షాత్తుగా ఈశ్వరునకు ఒక రోజు.సదాశివుని ఆయుర్దాయములో అయిదు లక్షల నలభై వేల మంది రుద్రులు ఉందురు. ఈ కాలపురుషుడు సాక్షాత్తుగా శివునిచే ప్రేరితుడై జగత్తులో ప్రవర్తిల్లుచున్నాడు. ఓ బ్రాహ్మణులారా! ఈ లోకములో సృష్టికి సంబంధించి వర్ణించబడిన సర్వము కాలములో అంతర్భాగమగును. ఈ సృష్టి అనే కాలఖండము పరమేశ్వరునకు పగలు. పరమేశ్వరుని రాత్రి కూడ ఇదే కాలపరిమాణములో నుండునని తెలియుడు. పరమేశ్వరుని పగలు సృష్టి. ఆయన రాత్రియే ప్రళయమని మహర్షులు చెప్పుచున్నారు. కాని, పరమేశ్వరునకు యథార్థముగా పగలు, రాత్రి ఉండవని తెలియవలెను. ప్రాణుల హితమును గోరి పరమేశ్వరుడు ఈ ప్రళయమును చేయును. ప్రజలు, ప్రజాపతులు, త్రిమూర్తులు, దేవతలు, రాక్షసులు, ఇంద్రియములు, ఇంద్రియములకు గోచరమగు విషయములు, పంచ మహాభూతములు, వాటి సూక్ష్మకారణములగు పంచ తన్మాత్రలు, మహత్తత్త్వము (పంచభూతములకు కారణము), దేవతలు అను ఈ సర్వము చైతన్యస్వరూపుడగు పరమేశ్వరుని పగటి సమయములో ఉనికిని కలిగియున్నవి. పగలు పూర్తి కాగానే ఇవి అన్నీ ఆయనలో విలీనమగును. రాత్రి పూర్తి కాగానే మరల జగత్తు పుట్టును. ఆ ఈశ్వరుడు జగత్తుయొక్క రూపములో ప్రకటమై యున్నాడు. కర్మ, కాలము, అవిద్య మొదలగు రూపములలో ప్రకటమయ్యే ఆ పరమేశ్వరుని శక్తిని ఎవ్వరైననూ ఉల్లంఘించలేరు. ఈ సకలజగత్తు ఆయన ఆజ్ఞకు వశవర్తియై యున్నది. అట్టి పరబ్రహ్మస్వరూపుడగు శంకరునకు నమస్కారము.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో యుగసంఖ్యావర్ణనము అనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.*

No comments:

Post a Comment