5️⃣2️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*రెండవ అధ్యాయము*
*సాంఖ్యయోగము.*
*71. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి ని:స్పృహ:l*
*నిర్మమో నిరహంకార: స శాన్తిమధిగచ్ఛతి||*
కోరికలను వదిలిపెట్టి, మమత, అహంకారము, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి వదిలిపెట్టి, తిరిగే వాడు నిరంతర శాంతిని పొందుతాడు.
శాంతిని సుఖాన్ని పొందాలంటే కింద చెప్పబడిన నాలుగు సూత్రములను పాటించాలి. 1. సమస్త కోరికలను, వాటి మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. 2. శబ్ద, స్పర్శ, రస, రూప,గంధాలను మనసులోకి రానీయకూడదు. 3. నేను, నాది అనే అహంకారము వదిలిపెట్టాలి. 4. నా వాళ్ళు నా ధనం, నా ఆస్తి అనే మమకారములు వదిలిపెట్టాలి. అంటే దీని అర్థం ఏ కోరికా లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. ఏ ఒక్క కోరిక ఉన్నా అది మనసును అల్లకల్లోలం చేస్తుంది. నేను ఆత్మస్వరూపుడను. నేను ఈ శరీరం కాదు అనే భావనతో ఉండాలి. ఈ శరీరమే తనది కానపుడు శరీర సంబంధమైన కోరికలకు ఎందుకు బానిస కావాలి అనే భావన కలిగి ఉండాలి. అటువంటి వాడిని ఏ సమస్య బాధించదు. నిశ్చలంగా ఉంటాడు.
స్థితప్రజ్ఞుడు ఎన్ని భోగముల మధ్య ఉన్నప్పటికినీ, ఆ భోగములు ప్రాపంచిక విషయములు విషయభోగములు ఆయనమీద ఎటువంటి ప్రభావమును చూపలేవు. పైగా ఆ విషయములన్నీ నదులు సముద్రములో కలిసినట్టు ఆయనలో లీనం అయిపోతాయి. తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఆయన మాత్రము నిశ్చలంగా ఉంటాడు. పరమ శాంతిని పొందుతాడు. కాని భోగముల మీద, ప్రాపంచిక విషయముల మీద విపరీతమైన ఆసక్తి కలవారు అటువంటి శాంతిని పొందలేరు. నిరంతరము అశాంతిలో సతమతమౌతుంటారు. దుఃఖములో మునిగితేలుతుంటారు. అని తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో కూడా అదే విషయాన్ని మరలా చెబుతున్నాడు. శాంతి పొందాలంటే కావాల్సిన అర్హతలను మరలా చెబుతున్నాడు. కోరికలను వదిలిపెట్టడం, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా ఉండటం, మమత, అహంకారము వదిలిపెట్టడం. అహంకారము అంటే ఈ దేహమే నేను అనే భావన. ఈ దేహముతో నేను సుఖాలు అనుభవిస్తాను. అనుభవించడానికి నాకు సుఖాలు కావాలి అనే భావన కలిగిఉండటం. ఆ భావనే అహంకారము. దానిని వదిలిపెట్టాలి. ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకపోవడం, ఇటువంటి గుణములు కలిగిన పురుషుడు పరమ శాంతిని పొందుతాడు అని మరలా ఘంటా పథంగా చెప్పాడు భగవానుడు.
మనం సాధారణంగా మోక్షం అనే పదాన్ని వింటూ ఉంటాము. మోక్షము అంటే వదిలివేయడం. అంతేకానీ మరణించిన తరువాత దేవదూతలు వచ్చి విమానంలో మనలను మోక్షానికి తీసుకుపోతారనీ, మోక్షం అంటే అది ఒక ప్రదేశము అనీ అనుకోకూడదు. మోక్షము అంటే మనం జీవించి ఉండగానే ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టి, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము సాధించి, రాగద్వేషములను వదిలిపెట్టి, ప్రశాంతంగా జీవించడం, ఇదే మోక్షము. మోక్షము అంటే ఒకరు ఇచ్చేది కాదు. తనకు తానుగా సంపాదించుకోతగ్గది. ఎవరైనా "నేను మీకు మోక్షము ఇస్తాను" అని అంటే అతనికి ఏమీ తెలియదు అని మనం అనుకోవాల్సివస్తుంది. కాబట్టి మోక్షం అంటే జీవించి ఉండగానే పరమ శాంతిని పొందడం అంటే జీవన్ముక్తిని పొందడం అని అర్థం. జీవించి ఉండగానే అన్నిటి నుండి విముక్తిని పొందడం. ఈ విముక్తినే పరమశాంతి అని అంటారు.
ఈ శ్లోకంలో య: అని వాడారు. య: అంటే ఎవరైతే అని అర్థం. అంటే స్థితప్రజ్ఞత కలగడానికి కుల, వర్ణ, మత, జాతి, ఆడ, మగ, ధనిక, పేద, వివక్షత లేదు. పై లక్షణములు ఉన్న వారు ఎవరైనా స్థితప్రజ్ఞులు కావచ్చు అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణుడు.
ఈ విధంగా ప్రతి మానవుడు ఎలా పరమ శాంతిని పొందుతాడో ఎలా మోక్షమును పొందుతాడో వివరించాడు భగవానుడు.
(సశేషం)
*🌹యోగక్షేమం వహామ్యహం🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P134
No comments:
Post a Comment