" ఈ రచన నా స్వంతరచన " - తులసీభాను
💛మనసు కథలు💛
💜💛 ఆత్మీయ హాసం 💛💜
నందిని అన్నీ సర్దుకుని, దిగులుగా కూర్చుని ఉంది..
శరత్ నందిని ని అడిగాడు.." దిగులెందుకమ్మా, రేవతి గారు నీకు లోటు రానీయరు..అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా అమర్చే ఉంటారు " అని..
" అది కాదు నాన్నా, నువ్వు లేకుండా నాకు బాగోదు.. " అని గారాలు పోతూ బుంగమూతి పెట్టి తండ్రి భుజం మీద తల పెట్టుకుని... " నువ్వూ నాతో పాటూ వచ్చేయి నాన్నా " అని అడిగింది..
" పెద్దదానివి అయ్యావు ధైర్యంగా ఉండాలి " అని సర్దిచెబుతున్నాడు, నందినితో, శరత్ చిన్నపిల్లని లాలించినట్టు..
టాక్సీ, టాక్సీ తో పాటూ రేవతిగారు, వచ్చారు..
" నందినీ పద పదా " అంటూ వచ్చారు.." నాన్నా వెళ్ళొస్తా మరి.. "అని ఏడుపుగొంతుతో చెబుతూ తండ్రిని హత్తుకుంది నందిని..
కూతురి తలమీద ఆప్యాయంగా ముద్దుపెట్టి..
" స్కూలు పనుల్లో బిజీ అయితే, నా మీద దిగులు తగ్గుతుందిలేమ్మా.. " అని సలహాగా చెప్పాడు...
జమునాపురం లో ప్రభుత్వ పాఠశాల లో పోస్టింగ్ పడింది నందినికి..స్వతహాగా పల్లెలంటే చాలా ఇష్టం..కానీ పాములుంటాయనీ, స్టయిలు స్టయిలు బట్టలేసుకుంటే అందరూ నవ్వుతారని, ఇలాంటి కొన్ని కారణాల వల్ల, కొంచెం ఇష్టం లేదు నందినికి, పల్లెల్లో ఉండాలంటే..
రేవతి, తన అక్క ఇంటి దగ్గర టాక్సీ ఆపించి ఇంట్లోకి తీసుకెళ్ళింది నందినిని..పెద్ద పెంకుటిల్లు ..నందినికి పెద్ద గది ఒకటి ఇచ్చారు..చుట్టూ నాలుగు కిటికీలు, రెండు తలుపులు, చల్లని గాలి హాయిగా వీస్తోంది .కిటికీ పక్కన నిమ్మచెట్టు ఉంది..ఆ సుగంధాన్ని గాలి మోసుకొస్తుంటే, నందినికి తాజాగా అనిపిస్తోంది..ఆ ప్రదేశంలో ఏదో ఒక శాంతిని పొందింది నందిని..అప్పటివరకూ ఏదో మూల చిరాకుగా అనిపించినా ఆ క్షణంలో బావుంది అనిపించి నవ్వు విరిసింది నందిని మొహంలో..
స్కూలుకి మొదటిరోజు..పిల్లలు ఒకరొకరుగా వస్తున్నారు..పది అయినా బెల్లు కొట్టలేదు ఎవ్వరూ..
పిల్లలు , కొందరు బట్టలు సరిగా వేసుకోక, చింపిరిజుట్టుతో వస్తున్నారు..ఏదో స్కూలుకి వచ్చామంటే వచ్చామనే తప్ప పిల్లలు మబ్బుగా నీరసంగా ఉన్నారు..
' ఒక ఆవిడ ఒక బాబుని చెయ్యిపట్టుకుని తీసుకొస్తోంది..బాబు చక్కగా ఉన్నాడు..కుదురైన బట్టలు, దువ్విన జుట్టు ..అప్పటివరకూ తాను తగిలించుకున్న బ్యాగు బాబుకి అందించి బుగ్గన ముద్దు పెట్టి నవ్వింది ఆవిడ.. ' ' కమ్మనైన నవ్వు , ఆత్మీయమైన నవ్వు , బహుశా ఎవ్వరైనా, ఎంత అందంగా నవ్వినా, ఆవిడ నవ్వులోని నిర్మలత్వం, ఎవ్వరికీ ఉండదేమో... ప్రేమకు నవ్వు అనే రూపం ఇస్తే ఆమె నవ్వు..ప్రేమతో నిండిన నవ్వు.. '
" అమ్మా పోయిరా.. " అన్నాడు బాబు ఆమెతో..
ఆమెనే చూస్తున్న నందిని చేతితో ఆమెని దగ్గరకు రమ్మని సైగ చేసింది..ఆవిడ దగ్గరకు రాగానే అప్రయత్నంగా లేచి నుంచుంది నందిని..
" బాబు పేరు .. " అడిగింది నందిని..
" కన్నయ్య , " చెప్పింది ఆవిడ మళ్ళీ అదే ప్రేమామృత నవ్వుతో..
" మీ పేరు " అనుకోకుండా అడిగేసింది నందిని..
" దేవకి, " చెప్పింది ఆవిడ.." మీరు రోజూ వస్తారా " అడిగింది నందిని దేవకిని..
" అవునమ్మా బాబుని నేనే దించుతా రోజూ..మళ్ళీ మజ్జాన్నం బువ్వట్టుకొస్తా " అంది అదే నవ్వుమొహంతో.. " సరే " అంది నందిని..
భోజనాల వేళ కొందరు తల్లులు వారే స్కూలుకి వస్తే, కొందరు పిల్లలు బువ్వతిని వస్తామని ఇళ్ళకు వెళ్ళారు..నందిని అన్నంతింటూ తలపైకెత్తి చూసింది.. ' ఎదురుగా కన్నయ్యకి ముద్దలు తినిపిస్తూ మాట్లాడుతూ నవ్వుతోంది దేవకి.. '
ఎంత ప్రేమ ఆమె నవ్వులో, అనిపించకుండా ఉండదు నందినికి..ఆమె నవ్వు మాయచేస్తోంది నందినిని..నందిని మనసుని పట్టుకుని చక్కా పోయింది ఆవిడ తనింటికి వెళుతూ..
చిన్నప్పటినుండీ తల్లి లేదు, నందినికి..తండ్రి ప్రేమగా పెంచాడు..తల్లి లోటు తెలీనట్లే పెరిగింది నందిని..
ఆ ఊరి పిల్లలకు స్కూలు నియమాలు అర్ధమయ్యేలా చెప్పి శుభ్రత అవసరాన్ని, తెలియచెప్పి..అందరు పిల్లలనూ ఒకదారికి తేవటానికి ఆరునెలల పైనే పట్టింది నందినికి..
ఊరివాళ్ళు ఏమీ తెలీక మొండిగా వాదన చేసేవారు నందినితో..దేవకి ఒకటిరెండుసార్లు కల్పించుకుని అందరికీ నచ్చచెప్పటంలో నందినికి సాయపడేది..దేవకి నవ్వు చూస్తే నందినికి కోపం, చిరాకు, అలసట, తగ్గిపోయేవి..ఎదుటివారు కూడా దేవకి మాటకి విలువ ఇచ్చేవారు..సాధారణంగా అందరిలోనూ కనపడనంత ఆప్యాయమైన ప్రేమతో కూడిన మాట, ముఖ్యంగా నవ్వు, దేవకి సొంతం..ఎదుటివారు ఆమెకి నిముషాల్లో వశమైపోతారు అన్నట్టు ఉండేది దేవకి ప్రవర్తన..
రోజూ దేవకి, కన్నయ్యతో చెప్పే మాటలు , అన్నం తినిపించే విధానం, జాగ్రత్తగా చెక్కిళ్ళు పొదివిపట్టుకుని కన్నయ్యని ముద్దుచేసే ఆమె చర్యలు నందిని మనసుకి ఓ మాతృమూర్తి రూపాన్ని సృష్టించి ఇవ్వసాగాయి..
ఆ రోజు స్కూలుకి ఇన్స్పెక్షన్ జరుగుతోంది..వచ్చిన ఆఫీసరు మంచివాడే..పిల్లలని, స్కూలుని గమనించి మంచిరిపోర్టే ఇచ్చాడు..నందినితో కలిపి అయిదుగురు టీచర్లు, చుట్టుపక్కల మూడు ఊర్ల నుండీ పిల్లలని ఇక్కడికే వచ్చేలా చేసారు..అన్ని స్కూళ్ళకీ కలిపి అయ్యే ఖర్చు కలిసివచ్చేలా చేసి ఇక్కడి స్కూలుని అభివృద్ధి చేసారు..నందిని తండ్రి , పెద్ద ప్రభుత్వ ఉద్యోగి..అందుకే ఏవన్నా అడ్డంకులు ఉన్నా..మంచిపని కోసమేగా అని అధికారులతో చర్చించి ఒప్పించేవాడు ఆయన..
ఒకప్పుడు పల్లెలంటే ఉండటానికి భయపడ్డ నందిని, ఇప్పుడు శెలవలకి కూడా సిటీకి వెళ్ళదు.. ' కారణం కేవలం దేవకిని విడిచివెళ్ళటం ఇష్టం లేక.. '
అలాంటి పరిస్థితిలో, ఆ రోజు దేవకి వచ్చి నందినికి చెప్పింది..
" మేము బొంబయి పోతున్నాం..మా ఆయనకి అక్కడ పెద్దపని దొరికింది " అని చెప్పింది..
' షాక్ తగిలినట్టు అయ్యింది నందినికి.. '
" ఏమిటీ " అని గట్టిగానే అడిగింది..
" మేము బొంబయి పోతున్నాం తల్లీ " అంది అదే మనోహరమైన నవ్వుతో..ఏకకాలంలో ఉపశమనం, బాధ రెండూ అనిపించాయి నందినికి..
" అలా ఎలా దేవకమ్మా..కన్నయ్యకి చదువు బాగా వంటపడుతోంది ఇప్పుడే, వద్దమ్మా ఇక్కడే ఉండిపోండి " అంది నందిని..బయటికి మామూలుగా మాట్లాడుతున్నా లోపల దిగులుగా అయిపోతోంది నందినికి..
" ఎట్టాగవుతదమ్మా అతను సంపాదిస్తే కానీ గడవని బతుకులు మావి..నాకా ఆరోగ్యం సరిగా ఉండదు, ఇంటిపని తప్ప బయట కూలిపనికి పోలేను..అందుకే " అని చెబుతోంది దేవకి..
నందినికి ఉన్నట్టుండి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి..దేవకి రెండుచేతుల్లో తలను దాచేసుకుని " వెళ్ళొద్దమ్మా " అని ఏడుస్తోంది నందిని...
పిల్లలు బిత్తరపోయి కొందరూ, వింతగా కొందరూ, చూస్తున్నారు..దేవకి తానూ ఏడుస్తోంది నందిని ఏడుపుచూసి, దేవకి అంతే సున్నితం మనిషి ఎవరు బాధపడినా తట్టుకోలేదు, అందుకే ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టేలా ఒక్క మాట అనదు, పైగా ప్రేమగా నవ్వుతుంది పలకరింపుగా..
" అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా, నా జీతంతో నేను చూసుకుంటా మిమ్మల్ని..నాకు నీలో అమ్మ కనిపిస్తుంది, నువ్వు నాకు అమ్మలాగా అనిపిస్తావు..నీ వళ్ళో తలపెట్టి పడుకుని, హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది..నువ్వు కన్నయ్యకి తినిపిస్తావే, అలా నాకూ తినిపిస్తే బావుండు, అనిపిస్తుంది..ఎంత పనిఒత్తిడి అనిపించినా, ఏదైనా దిగులు అనిపించినా, నీ నవ్వు చూస్తే నాకు మనసుకి ఎంతో ఆనందం అనిపిస్తుంది..నాకు అమ్మవు అవుతావా... " అని చిన్నపిల్లలా దీనంగా అడుగుతోంది నందిని, దేవకిని..
దేవకి అది విని, తానూ ఏడుస్తూ కూడా, తనదైన మంత్రంలాంటి మనోహరమైన నవ్వు కూడా నవ్వింది..ఏడుపు, నవ్వు, కలగలిసిన అందమైన రూపంలో దేవకి అమ్మరూపానికి అసలైన అర్ధంలా ఉంది..
" నాకు అర్ధమయ్యీ అవనట్టు ఉంది తల్లీ.. " అంది దేవకి, నందినితో..
" పిల్లలూ ఇవాళ స్కూలు తొందరగా అయిపోయింది..ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి " అని పిల్లలని పంపేసింది నందిని..
" నువ్వు నన్ను నీ పాపగా చేసుకో..కన్నయ్య నీకు కొడుకైతే, నేను నీ కూతురుని.. " అంది గారాబంగా నందిని దేవకితో..
" అమ్మో ఇంత పెద్ద కూతురే.. " అంది దేవకి నవ్వేస్తూ..
" నేను మా అమ్మని అంటే నిన్ను, తమ్ముడిని, కన్నయ్య నాన్నని, మా నాన్నని, అందరినీ బాగా చూసుకుంటాను..నువ్వు నవ్వుతూ, నా వైపు చూస్తూ, అమ్మలా నా పక్కన ఉంటే చాలు నాకు ఇంకేమీ వద్దు " అంది నందిని స్పష్టంగా..
దేవకికి అర్ధం అయ్యింది..
చల్లగా, ఆత్మీయంగా, అందంగా, స్వచ్ఛంగా నవ్వుతూ కన్నయ్యని, నందినిని, చెరోవైపు దగ్గరకు హత్తుకుంది దేవకమ్మ ...
తులసీ భాను.
10 : 12 : 2019
మంగళవారం.
No comments:
Post a Comment