Tuesday, September 30, 2025

 *శ్రీ శివ మహా పురాణం*
*388.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-ఏడవ అధ్యాయం* 

*కాల మహిమ* 

*మునులు ఇట్లు పలికిరి:* 

సర్వము కాలము వలన పుట్టి, కాలము వలననే నశించుచున్నది. కాలసంబంధము లేనిది ఏదైననూ ఎక్కడైననూ లేదు. కాలము యొక్క నోటిలోపల చిక్కుకున్న బ్రహ్మాండ మండలమంతయు సృష్టి మరియు ప్రలయము అనే రెండు అవధుల మధ్యలో చక్రము వలె నిరంతరముగా తిరుగుచున్నది. కాలము నిర్ధారించే భాగ్యాభాగ్యములను బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మరియు ఇతరులగు దేవతలు, రాక్షసులు కూడ ఆతిక్రమింప సమర్థులు కారు. మిక్కిలి భయంకరమగు కాలము తనను తాను భూతవర్తమానభవిష్యత్తులనే మూడు ఖండములుగా విభాగము చేసి జనులను ముదుసలులను చేయుచూ సర్వధికారములను చేజిక్కుంచుకున్న పాలకుని వలె యథేచ్ఛగా ప్రవర్తిల్లుచున్నది. ఈ కాలభగవానుడు ఎవరు? ఈ కాలము ఎవరి వశములో నున్నది? దీనికి వశము కానివారు ఎవరు? ఓ జ్ఞానీ!ఈ విషయమును చెప్పుము.

*వాయువు ఇట్లు పలికెను:* 

మహేశ్వరుని సర్వోత్కృష్టమగు తేజస్సు కళ, కాష్ఠ, నిమేషము మొదలైన కాలావయవములతో రాజిల్లునదియై కాలాత్మ అని పిలువబడుచున్నది. ఈశ్వరుని బలము అనదగిన కాలము సమస్తమైన చరాచరజగత్తు ఉల్లంఘించ శక్యము కాని ఈశ్వరుడు అధ్యాదేశము వంటిది. కాలమే జగత్తును నియంత్రించుచున్నది. ఆ పరమేశ్వరుని శక్తి యొక్క అంశములోని అంశము నిప్పులను గ్రక్కే ఇనుప ముక్క వలె ఆయననుండి బయటకు వచ్చి గొప్పది యగు కాలపురుషరూపముగా సంక్రమించినది. కావున, జగత్తు కాలమున అధీనమై యున్నది. కాలము జగత్తునకు వశములో లేదు. కాని, కాలము శివుని వశములో నున్నది. శివుడు కాలమునకు వశములో లేడు. ప్రతిఘటింప శక్యము కాని శివుని తేజస్సు కాలము నందు ప్రతిష్ఠితమై యున్నది. కావున కాలముయొక్క పరిధి చాల గొప్పది మరియు అతిక్రమించ శక్యము కానిది. ఏ మానవుడు తన బుద్ధియొక్క మహిమచే కాలమునతిక్రమించ గలడు? కాలముచే సంక్రమింప జేయబడిన కర్మఫలమును ఎవ్వరైననూ తప్పించుకొనలేరు. ఎవరైతే పరాక్రమించి భూమినంతనూ ఏకచ్ఛత్రాధిపత్యముగా పాలించెదరో, వారైననూ సముద్రములు చెలియలికట్టను వలె కాలమును అతిక్రమించలేరు. ఎవరైతే ఇంద్రియసమూహమును నిగ్రహించి సకలజగత్తును జయించెదరో, వారైననూ కలమును జయించలేరు. కాలమే వారిని జయించును. ఆయుర్వేదవిద్వాంసులగు వైద్యులు రసాయనములను తయారు చేసెదరు. కాని వారు మృత్యువును అతిక్రమించలేరు. కాలము ఎవ్వరికైననూ అతిక్రమింప శక్యము కానిది. సంపద, సౌందర్యము, శీలము, బలము, కులము అను వాటిని ఆధారముగా చేసుకొని మానవుడు ఒకటి తలపెట్టగా, కాలము బలాత్కారముగా మరియొక దానిని చేసిపెట్టును.

పరమేశ్వరుడు ప్రాణులకు ప్రియములు మరియు ప్రియములు కానివి అగు వస్తువులతో , లేదా వ్యక్తులతో అనుకోకుండగా సమాగమముగు కలిగించి, మరల వియోగమును కలిగించుచున్నాడు. ఏకాలములో ఒకడు దుఃఖించుచున్నాడో, అదే కాలములో మరియొకడు సుఖించుచున్నాడు. అహో! తెలియ శక్యము కాని స్వభావము గల కాలము ఎంత విచిత్రమైనదియో!  యువకుడు ముదుసలి యగుచున్నాడు. బలవంతుడు దుర్బలుడగుచున్నాడు. ధనవంతుడు దరిద్రుడగుచున్నాడు. ఓ బ్రాహ్మణులారా! కాలము యొక్క తీరుతెన్నులు చిత్రమైనవి. ఒక వ్యక్తి పుట్టిన వంశముయొక్క మహిమ గాని, శీలము, బలము నైపుణ్యము అనునవి గాని, ఒక కార్యమును సాధించుటకు చాలవు. కాలమును ఆపగలవారు లేరు. తమకు రక్షకులు ఉండి దాతలు అయినవారు, సంగీతము వాద్యములు మొదలగు వాటితో తులదూగువారు, అనాథులు, బిచ్చమెత్తుకుని బ్రతుకువారు, వీరందరియందు కాలము సమానమగు ప్రవృత్తిని చూపుచున్నది. శాస్త్రీయముగా తయారు కాబడిన ఎంత చక్కని మందులు అయిననూ, కాలము పరిపక్వము కానిదే పని చేయవు. కాని, కాలము కలిసి వచ్చినప్పుడు అవే మందులను వాడినచో వెంటనే ఆరోగ్యము సిద్ధించి సుఖము లభించును. మానవుడు కాలము రాకుండగా మరణించడు; పుట్టడు; మరియు, కాలము రానిదే, కొనియాడదగిన పుష్టిని పొందడు. కాలము రాకుండగా సుఖము గాని, దుఃఖము గాని సంప్రాప్తము కావు. సమస్తజగత్తులో కాలము పరిపక్వము కానిదే ఏ వస్తువు అయిననూ లభించదు. కాలమును బట్టి చలిగాలులు వీచును. కాలమును బట్టి మేఘములలోనికి నీరు వచ్చును. కాలము వచ్చినప్పుడు వేడి తగ్గును. కాలము వచ్చినప్పుడు సర్వము సఫలమగును. పుట్టుకలన్నింటికీ కాలమే కారణము. కాలము వచ్చినప్పుడు మాత్రమే ప్రతి సంవత్సరము పంటలు పండును. కాలము వచ్చినప్పుడు పంటలు చెడిపోవును. ఈ ప్రాణిసముదాయము తమ తమ ఆయుఃకాలములో చక్కగా జీవించును. కాలపురుషుని తత్త్వమును ఈ విధముగా యథార్థముగా ఎవడు తెలుసుకొనునో, ఆతడు ఈశ్వరుని కాలస్వరూపమునతిక్రమించి, కాలాతీతుడగు ఈశ్వరుని దర్శించును. ఎవనికి కాలము గాని, బంధము గాని, మోక్షము గాని లేవో, ఎవడు పురుషుడు గాని, ప్రకృతి గాని, జగత్తు గాని కాదో, అట్టి విచిత్రమగు స్వరూపము గలవాడు, మంగళకరుడు, సర్వాతీతుడు అగు పరమేశ్వరుని కొరకు నమస్కారము.

*శ్రీ శివమహాపురాణములోని వాయువీయసంహితయందు పూర్వభాగములో కాలమహిమను వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది.*

No comments:

Post a Comment