. *40వ సర్గ 2 వ భాగం*
*꧁❀❀━❀🚩🌏🚩❀━❀❀꧂*
*“దేవుడితో సమానమైన రాముడు అడవులకు వెళుతూంటే కౌసల్యాదేవి గుండెలు పగిలిపోలేదా? ఆ గుండెను ఇనుముతో చేశారేమో! మా గుండెలు పగిలిపోతున్నాయి” అని కొందరు బిగ్గరగా ఏడ్చారు. “ధర్మపత్ని అంటే సీతలా ఉండాలి. సూర్యుని కాంతి మేరుపర్వతాన్ని విడువనట్లుగా, సీతాదేవి రాముణ్ణి విడవకుండా అడవులకు పోతోంది. ఆమె ధర్మపరాయణురాలు” అని మరికొందరన్నారు. దశరథుడు కూడా భార్యతో కలసి రాముణ్ణి చూసేందుకు బయటకు వచ్చాడు. స్త్రీలందరూ ఒక్క పెట్టున ఏడవటం మొదలుపెట్టారు. బలమైన మగ ఏనుగును ఇనుప గొలుసులతో కట్టి బంధించినప్పుడు ఏడుస్తున్న ఆడ ఏనుగుల ఆక్రందనంలా వినపడింది.*
*దశరథుడు సహజంగా తేజోవంతుడైనా, ఆ క్షణంలో గ్రహణం పట్టిన చంద్రుడిమల్లె కాంతివిహీనంగా కనపడ్డాడు. జనులంతా రథాన్ని అడ్డగించడంవల్ల, రాముడు సుమంత్రుణ్ణి రథాన్ని త్వరగా తోలమని తొందరపెట్టాడు. అదే* *సమయంలో రథాన్ని నిలుపమని పౌరులు సుమంత్రుణ్ణి అడ్డగించారు. ఆ తొక్కిసలాటలో రేగిన దుమ్ము అంతా పౌరుల కన్నీళ్ళతో అణిగిపోయింది. జనమంతా కన్నీళ్ళు కారుస్తూ దుఃఖంతో హాహాకారాలు చేశారు. చేపల కదలిక చేత పద్మాల నుండి నీరు కారినట్లు ఆ స్త్రీల కళ్ళనుండి కన్నీరు స్రవించింది. ఆబాలగోపాలం దుఃఖీస్తున్నారు; అందరి దుఃఖం రాముని కోసమే. ఆ దృశ్యం చూసిన దశరథుడు మొదలు నరికిన వృక్షంలా పడిపోయాడు. జనమంతా రాముడికోసం విలపించగా స్త్రీలు కొందరు కౌసల్యకై విలపించారు.*
*రాముడు ప్రయాణమై వెళుతూ ఒకసారి వెనక్కు తిరిగి చూశాడు. దూరాన్నుండి దుఃఖంతో కృంగిపోతున్న తల్లిదండ్రులు మసక మసకగా కనిపించారు. ఎన్నడూ నడవటమే అలవాటులేని దశరథుడు, ఆయన స్త్రీలు రథం వైపు పరుగెత్తడం చూసిన రాముడు సారథిని రథాన్ని త్వరగా నడపమని ఆదేశించాడు. వెనుకనుండి దశరథుడు రథాన్ని ఆపమని అరవడం మొదలుపెట్టాడు. సుమంత్రుడు ఇరకాటంలో పడ్డాడు. ఒక ప్రక్క రాముడు త్వరగా పొమ్మంటాడు. మరో ప్రక్క దశరథుడు రథాన్ని ఆపమంటాడు. అప్పుడు సుమంత్రుడి మనస్సు రెండు చక్రాలమధ్య పడి నలిగినట్లయింది. ఒకవేళ మహారాజు రథం ఎందుకు ఆపలేదని నిన్ను నిలదీసినా కూడా, నాకు వినపడలేదని చెప్పుకోవచ్చునని రాముడు సుమంత్రునితో చెప్పి రథాన్ని ముందుకే నడిపించాడు.*
*సుమంత్రుడు మాత్రం రాముడు చెప్పినట్లె రథాన్ని వేగంగా నడిపాడు. జనం రాముడికి ప్రదక్షిణ నమస్మారాలుచేసి వెనక్కు తిరిగారు; కాని వాళ్ళ మనస్సు మాత్రం రాముడితో ముందుకే పోతోంది. మంత్రులంతా దశరథుని వద్దకుపోయి “మహారాజా! ఎవరిని మనం సాగనంపాలని అనుకుంటామో, వాళ్ళతో కూడా చాలాదూరం వెళ్ళకూడదు” అన్నారు. దశరథుడి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ముఖం, శరీరం వాడిపోయాయి. రాముడు పోయిన వైపే దీనంగా చూస్తూ నిలబడ్డాడు.*
*┈┉┅━❀꧁హరే రామ్꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁💎🍁 🙏🕉️🙏 🍁💎🍁
No comments:
Post a Comment