Sunday, March 1, 2020

>ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా

ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా వ్రాశారు.డా.పొన్నాడ కృష్ణసుబ్బారావు గారు.
శ్రీ సుబ్బారావుగారికి కృతజ్ఞతలతో .

"యజమానికి సంతోషం లేదు
అతిధికి ఆనందం లేదు"

రుచులవి జాతివి మారెను/
పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /.
కిచెనుల దూరెను మెల్లగ/
శుచియగు మన భావములను శూన్యము చేయన్

గుత్తి వంకాయ కూరా లేదు ,
గుమ్మడికాయ పులుసూ లేదు !
అరటికాయ వేపుడు లేదు ,
అదిరే కొబ్బరి చట్నీ లేదు !
కొత్తావకాయ ఊసే లేదు ,
కొత్తిమీర చారూలేదు !
కందా బచ్చలి మరిచారయ్యా !
గుమ్మడి వడియం విడిచారయ్యా !

పలావు వుందని వడ్డించారు !
ఉల్లీరైతా ఉందన్నారు !
రుచిపచి తెలీని 'కూరే' సారు !
మిక్సుడు పికిల్ కూరేసారు !
బూరీ గారీ నోదిలేసారు !
బూందీ లడ్డూ మార్చేశారు !

గులాబు జామూన్ ఉందన్నారు
లైనులో జనాలు ముందున్నారు !

అయిసు క్రీముకేసడిగేసాకా ,
అయిపోయుంటుందన్నారొకరు !
ప్లేటుని చేతిలో పట్టుకుని ,
ఓ చేతిని జేబులొ పెట్టుకుని ,
బఫే లైనులో నుంచుంటే ,
బఫూన్ లా భలేగా వుంది !

కుర్చీ బల్లా తీసేశారు !
కుదురుగ నిలుచుని తినమన్నారు !
తల్లీ పిల్లా తల్లడిల్లినా ,
ముసలీ ముతకా ముక్కి చూసినా !
బఫే తీరులో బలముందన్నారు !
గొర్రె మూక విని తలవంచారు !

పెద్దా చిన్నా పరుగులె పరుగులు !
ముద్ద కోసమొక యుద్దపు తలపులు !

సాపాటు--గ్రహపాటు

ఔనండీ సుబ్రహ్మణ్యం గారు
అది బఫే మీల్స్ కాదు
బఫెల్లో మీల్స్

దానికి తోడు
హనుమంతుడు
సంజీవ పర్వతం మోస్తున్నట్టు
చేతిలో బరువైన ప్లేటు

ఏ ఐటమ్ కి అది కొద్దిగా
పెట్టించు కుందామంటే
కొండ వీటి చాంతాడు
లాంటి లైను,

ఎంగిలి ప్లేటుతో
ఈదుకుంటూ ప్రయాణం
ఎడమ చేతి బరువు.

లంక మేత గోదారీత లా
మంచినీళ్ళు ఎక్కడో.

మధ్యలో ఆద మరిస్తే
ఏ పిల్లాడో/పిల్లో/పెద్దో
మనకి ఎవరు డాష్ ఇస్తారో

కొంచెం వేగంగా నడిస్తే
ఈ చలవరాతి ప్లోరింగ్ పై
పడిన నీటి చుక్కలకి
నడుం జారుతుందో

వండే వాడెవడో
వడ్డించేవాడెవడో

చక్కగా తిందామంటే
నలుగురికి పరిచయమైన
వారికి కత్తి సామే

ఎవరో ఒకరి పనికి
మాలిన ముచ్చట్లు

ఎక్కడేమున్నాయో
తెలవక అర్ధాకలితో
భోజనం ముగింపు

చెత్త కాయితాలేరుకునే
వాడిలా ఎక్కడ ఏమి
ఉన్నాయో

చూసుకుంటూ
తిరుక్కుంటూ
అభోజనం.

నిజమే నిలబడి
భోజనం నిజంగా
నాగరికుల దౌర్భాగ్యం

అందుకే వెళ్ళక పోతే
ఎవరితో కలవమనుకుంటారు
కనుక ఇంట్లోనే తిని వెళ్ళాలి
అందరితో కలిసి భోజనం చేయాలి
కాదు కాదు చేసినట్లు నటించాలి

పేరుకు విందు దానికి ఓ టైము
కరెక్ట్ టైముకు వెలితే ఎవరూ ఉండరూ,

అలా అని ఆలశ్యంగా
వెళితే పదార్ధాలు నిండుకుండు
నిలబడి పెట్టే భోజనం

యజమానికి సంతోషం లేదు
అతిధికి ఆనందం లేదు

నిజంగా కూర్చుని తినే పంక్తి భోజనం దొరకటం ఈ రోజుల్లో
చాల అదృష్టం.
భోజన కాలే హరి నామ స్మరణ
గోవిందా గోవింద.🚶🚶

No comments:

Post a Comment