Sunday, January 24, 2021

మాటతీరు

మాటతీరు

ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న అమాయకుడు. తమ్ముడు లౌక్యం, వ్యవహార దక్షత తెలిసినవాడు. అంతమాత్రం చేత అన్నను మోసం చేయాలనే మనస్తత్వం కలవాడు కాదు. అన్న పట్ల ప్రేమ, అభిమానం చూపించేవాడు. వారికి తండ్రి నుంచీ వారసత్వంగా కొంత పొలం వచ్చింది. అన్న పనివాళ్లతోపాటు నడుము వంచి పని చేసేవాడు. తమ్ముడు అందరి మీదా అజమాయిషీ చేస్తూ పని సక్రమంగా జరిగేటట్లు చూసేవాడు.

కొంతకాలం తర్వాత ఇద్దరికీ పెళ్లిళ్లు అయినాయి. అన్న భార్య వీరిద్దరి వ్యవహారం అంతా చూసి, ‘ఏమండీ! పెద్దవారు మీరు అజమాయిషీ చేయాలి. చిన్నవాడు మీ తమ్ముడు పనీపాటలు చేయాలి. నాకు అవమానంగా ఉంది. రేపటి నుంచీ మీరే పెత్తనం చేయండి’ అని చెప్పింది.

‘ఆ వ్యవహారాలు అన్నీ వాడికే అలవాటు. నాకేం తెలుసే?’ అన్నాడు అన్న.
‘ఇదేం బ్రహ్మవిద్యా తెలియక పోవటానికి? మీ తమ్ముడు పెత్తనం ఎలా చేస్తున్నాడో గమనించండి. మీరూ అలాగే చెయ్యండి’ అన్నది.

భార్య రోజూ పోరు పెడుతూ ఉండేసరికి అన్నలో కూడా అదే కోరిక పడగ విప్పింది. తమ్ముడు పెత్తనం ఎలా చేస్తున్నాడో గమనించాలనుకున్నాడు. ఆ రోజు పెద్దవాడు పొలంలో పని చేస్తున్నాడు. తమ్ముడు గట్టు మీద కూర్చుని వచ్చే పోయే వారితో కాలక్షేపం చేస్తున్నాడు.

ఇంతలో ఒక వ్యక్తి అటుగా వచ్చాడు. అతనిని చూసి తమ్ముడు ‘ఓహో! రామయ్యా! ఏవిటీ ఈ మధ్య ఎక్కడా కనిపించటం లేదు? బొత్తిగా నల్లపూసవై పోయావు. అంతా బాగున్నారా?’ అని పలకరించాడు.

‘ఏం చెప్పమంటావు బాబూ! ఈ మధ్యనే మా తల్లిగారు పోయారు. కర్మకాండలు మొన్ననే ముగిసాయి. ఇంటి పనుల్లో తీరిక లేక బయటకు రావటం లేదు’ అన్నాడు రామయ్య.
‘అయ్యో! అలాగా! నాకు తెలియనే తెలియదు. ఆమె దొడ్డ ఇల్లాలు. నీకొక్కడికే కాదు అందరికీ తల్లి లాంటిదే!’ అన్నాడు సానుభూతిగా. రామయ్య మొహంలో సంతృప్తి కనపడింది. ‘నీది ఇంత మంచి మనసు కాబట్టే అందరూ గౌరవిస్తున్నారు. వెళ్లొస్తాను. ఇంకా బోలెడన్ని పనులు ఉన్నాయి’ అంటూ వెళ్లిపోయాడు.

పొలంలో పని చేస్తూ అన్న ఇదంతా గమనిస్తున్నాడు. ఆ మర్నాడు తమ్ముడుతో ‘ఒరే! పెద్దవాడిని నేను పెత్తనం చేయాలి. నువ్వు నా మీద అజమాయిషీ చేయడం ఏమిటి? రేపటి నుంచీ పొలం పని నువ్వు చెయ్యి. నేను గట్టు మీద కూర్చుని పెత్తనం చేస్తాను’ అన్నాడు. తమ్ముడు ఒక్కక్షణం అన్న వంక చూసి సరే అని అంగీకరించాడు.

ఆ మర్నాడు తమ్ముడు పొలంలో పని చేస్తున్నాడు. అన్న గట్టు మీద కూర్చున్నాడు. ఇంతలో అటుగా సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చాడు. ‘ఓహో! సుబ్బయ్యా! ఏమిటీ ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. బొత్తిగా నల్లపూసవై పోయావు. అంతా బాగున్నారా?’ అని పలకరించాడు అన్న.

‘నా భార్యకు జబ్బు చేసిందయ్యా! బస్తీలో ఆస్పత్రిలో చేర్పించాను. అందుకే కనిపించటం లేదు. ఆమె రెండు రోజుల క్రితమే పోయింది’ అన్నాడు సుబ్బయ్య విచారంగా.

‘అయ్యో! అలాగా! నాకు తెలియనే తెలియదు. ఆమె నీకొక్కడికే కాదు. ఊళ్లో అందరికీ భార్యే!’ అన్నాడు అన్న.
‘ఏమన్నావ్? నోర్ముయ్!’ అంటూ సుబ్బయ్య అన్న చెంప ఛెళ్లుమనిపించాడు. సుబ్బయ్య వెంట వచ్చిన వారు అందరూ కలిసి ‘ఎంత మాట అన్నావురా! బుద్ధిలేని వెధవా!’ అంటూ వంగదీసి ఎడాపెడా కొట్టారు.

అన్న కేకలు విని దూరంగా పని చేసుకుంటున్న తమ్ముడు పరుగున వచ్చి ‘క్షమించు సుబ్బయ్యా! మా అన్న అమాయకుడు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. మా వదినగారి కోరిక మీద పెత్తనం చేయాలని వచ్చాడు. నిన్న నేను రామయ్య తల్లి పోయిందంటే విని ‘ఆమె నీకొక్కడికే కాదు, అందరికీ తల్లి లాంటిదే’ అన్నాను. ఆ మాటలు విన్నట్లున్నాడు మా అన్న. తెలియక యథాతథంగా మాట్లాడాడు. ఇంకెప్పుడూ అలా చేయడు’ అని చెప్పాడు.

తమ్ముడి మంచితనం తెలిసిన సుబ్బయ్య ఊరుకున్నాడు. అన్న వంక చూసి ‘ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇకనైనా బుద్ధి కలిగి ఉండు’ అని అన్నను చివాట్లు పెట్టి తన దారిన తాను పోయాడు.👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment