Monday, June 7, 2021

మంచి పదాలు, చెడు అర్థాలు

మంచి పదాలు, చెడు అర్థాలు-
--సంకా ఉషారాణి

ఆధునిక కాలంలో భగవంతునికి, పూజకు, ఆరాధనకూ ఆధ్యాత్మిక అంశాలకు చెందిన హిందూధార్మిక పదాలను తెచ్చి అతి నీచమైన అర్థాలలో ప్రయోగించే ఒక అధమమైన ప్రక్రియ మన లోకి ప్రవేశించింది. ఎంతో చదువుకున్నవారు, తమ ధర్మాన్ని ప్రేమించేవారు కూడా తమకు తెలియకుండానే ఆ పదాలను వాడేసే విధంగా జనబాహుళ్యంలోనికి సినిమాల ద్వారా, ఇతర మీడియా విధానాల ద్వారా, ప్రచారసాధనాల మాధ్యమంగా సామాన్యులకు చొప్పించటం జరిగింది. ఇట్ల పదప్రయోగం చేయటం మన ధర్మానికి అవమానకరమే కాక, భాషకు ఉన్న సాహిత్య, ఆధ్యాత్మిక, ధార్మిక విలువలను దిగజార్చే ప్రయత్నం కూడా అవుతుంది. ఆధ్యాత్మిక బలం కలిగించి, సంస్కృతికి దర్పణాలైన చక్కని భావాలను ఇట్ల నీచమైన, హేయమైన అర్థాలలో వాడటం అనేది ఒక పైశాచికత్వమే అనిపిస్తుంది.

చక్కని తెలుగు పదాలలో చేరిన ఈ భావ కాలుష్యం గుర్తించి, ఇప్పటికైనా తీసేసే ప్రయత్నం జరగాలి. కనీసం కొందరైనా ఆ పదాల వాడకం గురించి తెలుసుకుని, ఇతరులకు వివరణతో సహా అందించి, ఆ ప్రయోగాలను వాడటం తప్పు అని, వారి చేత కూడా మాన్పింప చేయవలసిన అవసరం ఉంది. నాకు అందిన కొన్ని ప్రయోగాలు- వాటి అసలు అర్థం, కావాలని చెడిపి, వక్రీకరించిన అర్థం ఇక్కడ ఇస్తున్నాను.

1. భాగవతం - భాగవతమంటే భగవంతునికి, ఆయన భక్తులకు చెందిన చక్కని కథలు, ఆధ్యాత్మిక అంశాలకు నెలవు. ఈ పదాన్ని ముఖ్యంగా ‘నేరం, జుగుప్స కలిగించే ఉదంతం, విషయం’ అని చెప్పటానికి వాడుతున్నారు. “..ఈ భాగవతం బయటకు వచ్చింది”. “ఎన్నాళ్ళుగా సాగోతంది ఈ భాగవతం..?” అంటూ అసహ్యకరమైన సన్నివేశాలకు ఈ మాటను ప్రయోగించటం వ్యాసభాగవతానికి అత్యంత అవమానకరం.

2. కుంభకోణం - ఇది తమిళనాడులో ఉన్న ఒక దివ్యతీర్థక్షేత్రం. దీన్ని (తెలుగులో వేరే పదమే లేనట్టుంది) ఘోటాలా, గఫ్¬లా (పెద్ద ఎత్తున మోసపూరిత కార్యం) అనే అర్థాలలో వాడుతున్నారు.

3. సోది - ఇది ఒక దివ్యదృష్టితో భవిష్యత్తు చెప్పే పారంపరిక ప్రక్రియ. దానికి సంబంధించిన నియమాలు, పద్ధతులు అనాదిగా ఉన్నాయి. ఈ పదాన్ని ‘అనవసరమైన మాటలు, అసంబద్ధ ప్రేలాపనలు’ అనే అర్థానికి వాడుతున్నారు. “ఊరికే సోది పెట్టకు” అంటూంటారు.

4. కైంకర్యం - భక్తిభావంతో తమ ఇష్టంతో భగవంతునికి సమర్పణం చేసే వస్తువు, సేవ ఈ పదానికి అసలు అర్థం. ఇది దేవాలయ పరంపరలోని పదం. దీన్ని ‘ఏదైనా తమకు చెందని వస్తువును, ఆస్తిని, లేదా ధనాన్ని తమ స్వంతం కోసం వాడుకునేందుకు అనైతికంగా తీసేసుకోవటం’ అనే అర్థానికి వాడుతున్నారు.

5. తీర్థం పుచ్చుకోవటం - ఇది గుడిలో దేవునికి సమర్పించి, భక్తులకు ఇచ్చే తులసినీరు, పాలు, కొబ్బరి నీరు, లేదా కర్పూరాదులు కలిపిన పానీయం. ఈ పదాన్ని ‘మద్యపానానికి, కల్లు తాగటానికి’ బదులుగా వాడుతున్నారు. ఎంత అసహ్యకరం!

6. ప్రేమాయణం - రామాయణం అనే మాటకు చెడుపు. సమస్య ఏంటంటే చాలామటుకు సామాన్యులకు ప్రేమకు, కామానికి తేడా తెలియదు. స్త్రీపురుషులు పరస్పరం ఏరకమైన ఆకర్షణకు లోనైనా దాన్ని ప్రేమ అనుకోవటం కద్దు. అటువంటి వాటిల్లో కొన్నిసార్లు హేయమైన సంబంధాలు ఏర్పడుతుంటాయి. వాటికి కూడా ఈ పదాన్ని వాడటం చాలా కష్టకరంగా ఉంటుంది.

7. ఎగనామం పెట్టటం, పంగనామం పెట్టటం - ఇది వైష్ణువుల ఆచారం చూపించే ఒక సంకేతం. నుదుట పెట్టే మూడు నిలువు గీతలు. వాటిని తిరునామాలు అంటారు. ఆ పదాన్ని ‘బడికి పోకుండా ఇంట్లో ఉండటం, తప్పించుకుపోవటం, చెప్పకుండా మానివేయటం, తీసుకున్న రుసుము చెల్లించకపోవటం’ వంటి అర్థాలలో వాడి అవమానిస్తున్నారు.

8. నైవేద్యాలు - భగవంతునికి భక్తితో సమంత్రంగా ఇచ్చి, తరువాత భక్తులు సేవించే ఆహారం ఈపదానికి అర్థం. దాన్ని సామాన్యంగా తినే అన్నానికి వాడటం తప్పు. “మా ఇంట్లో ఇంకా నైవేద్యాలు కాలేదు..” అంటే మేమెవ్వరం ఇంకా అన్నాలు తినలేదు, మా భోజనాలు కాలేదని అర్థం. చివరకు లంచాలు తీసుకోవటంలో కూడా ఈ పదం ప్రయోగం కనిపిస్తోంది.

9. ఊరేగటం - భగవంతునికి చేసే వాహన సేవ. సామాన్యులు చూడటానికి అనువుగా ఆయన విగ్రహాలను నగర సందర్శనం చేయించటమే ఊరేగింపు. ఈ పదాన్ని ‘ఏ పనీ లేకుండా గాలికి తిరగటం’ అనే అర్థానికి, ఏ ప్రయోజనం లేకుండా సమయం గడుపుతూ, ఇంటి బయట కాలక్షేపం చేయటం అనే అర్థానికి వాడుతున్నారు. “ఇంతసేపు ఎటు ఊరేగి వచ్చావు..?” అంటూ దెప్పి పొడవటానికి వాడుతున్నారు.
'ఊరేగించుట' అన్నది తెలియక జానపదులు అనేమాట. మనం భగవంతుడి విషయంలో ఆ పదం వాడకూడదు. అసలు పదం = 'ఊరు ఎఱిగించుట' కాలక్రమేణా ఊరేగించుట అయింది. ఊరిలో ప్రతి ఇంటి ముందుకు స్వామిని పల్లకీలో తీసుకవెళ్లి తెలియజేస్తారు(ఎఱుక చేస్తారు).

10. స్వాహా చేయటం - ఇది స్వాహా అనే పవిత్రమైన మంత్రం. స్వాహాదేవి అగ్నిదేవుని భార్య కూడా. ‘అగ్నయే స్వాహా,’ అని ‘ఇంద్రాయ స్వాహా’ అని హవిస్సును ఆయా దేవతలకు చెందింపచేసే వాక్కు. ఈ పదాన్ని ‘అవినీతిగా, తనకు చెందని ధనం తస్కరించటం’ అనే అర్థానికి బదులుగా వాడుతున్నారు. “భూములు స్వాహా చేశారు.. గనులు స్వాహా చేశారు..” వంటి అతి నీచమైన అర్థంలో వాడకం కనిపిస్తున్నది.

11. (బూతు)పురాణం - పురాణాలు వ్యాసుడు రచించిన అమూల్య జ్ఞానభాండాగారాలు. వాటిని ప్రజల ధార్మిక ఉద్బోధ కోసం వాడారు. కానీ ఇప్పుడు అతి నీచమైన వ్యవహారాలకు ‘బూతు’ అనే పదం కూడా చేర్చి పురాణశబ్దాన్ని వాడుతున్నారు. “ఎప్పటి నుంచి సాగుతున్నదీ బూతు పురాణం” అంటూ అసహ్యకరమైన సందర్భాలలో అనైతికమైన ప్రేమవ్యవహారాలలో దీన్ని వాడుతున్నారు.

12. పురాణకాలక్షేపమా, హరికథాకాలక్షేపమా, పురాణం విన్నట్టు - పురాణాలు, హరికథలు కూడా మహాపురుషుల కథలను, భాగవదంశాలను శ్రద్ధగా వినటానికి, ఆలోచించి ఆచరణలో పెట్టే మంచి విషయాలను సులువుగా ప్రజలకు అర్థమ్యే రీతిలో అందించే ప్రయత్నం. పురాణం కూడా ఏం ఊరికే విని వదిలేసేది కాదు. మహర్షుల ఆలోచనా విధానాన్ని పట్టుకుంటే జీవితంలో చాలా ఉత్తమమైన సాధనమార్గంలో సులువుగా ప్రవేశించవచ్చు. కానీ దాన్ని విద్యార్థి పాఠం వినకపోతే “ఇదేం పురాణకాలక్షేపమా విని మర్చిపోవటానికి..?” లేదా, “హరికథలాగ వింటే ఏమీ అర్థం కాదు..” అంటూ దెప్పిపొడవటానికి వాడుతున్నారు.

13. మహాభారత యుద్ధం - చిన్న చిన్న సందర్భాలలో ఏదైనా గొడవ జరగిన వెంటనే వారిద్దరి మధ్య మహాభారత యుద్ధం జరిగింది అంటారు. మహాభారతం ధర్మయుద్ధం. అందులో కృష్ణుడు ధర్మపక్షపాతియై సక్రమంగా నిర్వహించాడు. ఆ సంగతి మరచి అనవసరమైన చిన్నాచితకా గొడవలకు దాన్ని వాడటం తప్పు.

14. పతివ్రత - భర్తయే తన సర్వస్వంగా భావించి, ఆయన సేవే తన వ్రతంగా కలిగిన స్త్రీ. కానీ ఇప్పుడు ఈ పదాన్నే ఎంతో అసహ్యకరంగా సరిగ్గా విరుద్ధార్థంలో వాడుతున్నారు. భర్తను గణించక, వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్త్రీ వరకు చాలా హేయమైన అర్థాలను ఈ పదానికి ఆపాదించారు.

15. విశ్వరూపం - ఇది భగవంతుని సమగ్రమైన తత్త్వాన్ని ప్రతిపాదించే రూపం. కానీ ప్రస్తుతం నిర్వస్త్రంగా ఉండటం అనే అర్థానికి ఈ పదాన్ని వాడుతున్నారు. విశ్వరూపసందర్శన యోగం అని భగవద్గీతను వినేవేళ అటువంటి అర్థాలు స్ఫురించటం వల్ల మనస్సుకు ధర్మగ్లాని కలిగి ఎంత విక్షేపమవుతుందో వివరించనవసరం లేదు.

16. చాదస్తం - ఛాందసం అనే మాటకు వికృతి. ఛందస్సు అంటే వేదం అని ఒక అర్థం. వైదికభావాలు కలిగి ఉండటాన్ని ఛాందసం అంటారు. కానీ ఇప్పుడు ఇదే పదం ‘పాతభావాలు పట్టుకుని వేలాడటం, ధర్మం, న్యాయం, నీతి నియమం అని మాట్లాడటా’నికి వాడుతున్నారు. పాతభావాలు అన్నీ వర్జ్యాలు కాదు. కొత్తది అంతా సరైనది అనీ కాదు.

17. గోవింద - గోవిందా గోవింద.. అని భక్తితో భక్తులు తమ వేంకటేశ్వరుని తలచుకుంటారు. కొండ ఎక్కుతూ స్మరణ చేస్తారు. గోవింద నామం అన్ని నామాలలో ప్రశస్తమైనదని భావిస్తారు. కానీ ఇప్పుడు అదే పదం ‘దొంగిలించిన వస్తువు’ కోసం ప్రయోగిస్తున్నారు. ఏదైనా వస్తువును మనం పోగొట్టుకుంటే, అది తిరిగిరాదని సూచిస్తూ, “ఇంకేముంది.. అంతా గోవిందా..” అంటారు. అంటే గోవిందునికి ఏదైనా అర్పిస్తే మంచిదంటారు. అట్లాంటిది దాన్ని ‘దొంగిలించిన వ్యక్తికి సమర్పించటం’ అనే అర్థంలో వాడటం ఎంతో హేయం.

18. తాండవం చేయటం - తాండవం అంటే శంకరుడి నృత్యం. ఆయన నృత్యప్రియుడు. సంధ్యావేళలలో నృత్యం చేసి అందరినీ ఆనందింపచేస్తాడు. ‘తలపు కదలికలే శివతాండవం’ అని ఆధ్యాత్మికసంకేతాలలో చెప్తారు. అటువంటి పవిత్రమైన తాండవ పదాన్ని ‘దేనికైనా రభస చేయటం’ గురించి, ‘కొట్లాట గొడవ చేయటం’ గురించి అంటున్నారు.

19. చిందు వేయటం - చిందు అంటే చక్కని లయప్రకారం భజనపాట పాడుతూ నృత్యం చేసే ప్రక్రియ. కోలాటం లాగ, తప్పెట్ల భజన లాగ అది కూడా ప్రసిద్దమైన ఒక దేశీ పద్ధతి. ఆ పదానికి ‘కోపంతో అరవటం, గొడవ చేయటం’ గురించి అర్థం చేర్చి వాడతున్నారు.

20. భజనచేయటం - భగవంతునికై పాటలు పాడటం అనేది అసలు అర్థం. వాయిద్యాలతో, చప్పట్లతో చిన్నచిన్న మాటలు, లేదా సరళమైన వాక్యాలతో కూడిన, సులువైన రాగాలతో కూర్చిన నామాల సంకీర్తనం భజన. దాన్ని ‘ఇతరులను అనవసరంగా పొగడటం, పని వ్యాజంగా ప్రశంసించటం’ అనే అర్థంలో వాడుతున్నారు.

ఇంకా కొన్ని-

21. భట్రాజు పొగడ్తలు -
22. శఠగోపం -
23. మాయదారి సంత -
--సంకా ఉషారాణి

Source - Whatsapp Message

No comments:

Post a Comment