Friday, June 18, 2021

నేటి చిట్టికథ, అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు.

✍️... నేటి చిట్టికథ
🌹🌹🌹🌹🌹🌹

వంగదేశాన్ని సుశేనుడు అనే రాజు పాలించేవాడు.

అతనికి బలమైన సైన్యం ఉండేది. పక్కదేశాలపై దండెత్తాడు. ఆక్రమించాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నీ సామంత రాజ్యాలయ్యాయి.

ఐశ్వర్యంతో, అధికారంతో సృష్టిలో తనని మించినవాడు లేడని రాజు గర్వించాడు.

చుట్టూ కావలసినంత మంది భజనపరులు రాజుకు ఉంటారు. వారి పని రాజును కీర్తించడమే. ఒకడు ఇంద్రుడంటాడు, ఇంకొకడు చంద్రుడంటాడు. మరొకడు దాన కర్ణుడంటాడు. ఇట్లా ఎందరు ఎన్ని రకాలుగా కీర్తించినా ఇంకా ఏదో అసంతృప్తి రాజుకు మిగిలింది.

భజనలో ఆరితేరిన ఒకడు “రాజా! రాజమార్తాండా! నువ్వు సృష్టికర్త కన్నా గొప్పవాడవు. భగవంతుని కన్నా బలమైన వాడవు” అని పొగిడాడు.

అప్పటిదాకా విన్న పొగడ్తలకన్నా ఇది రాజుకు బాగానచ్చింది. భట్రాజును ఘనంగా సత్కరించాడు.

ప్రతిరోజూ భగవంతుడి కన్నా గొప్పవాడు ఈ రాజు అని అర్థం వచ్చే పాటలు, కవులు రాసినవి గాయకులు ఆలపించేవారు.



ఈ వార్త దేశమంతా వ్యాపించి అందరూ ముక్కుమీద వేలు వేసుకున్నారు.

ఆ మాటలు విన్న రాజగురువు రాజుగారి సభకు వచ్చి “రాజా! మీరు దేవుడికన్నా గొప్పవారు” అన్నారు.

రాజు “ఆ సంగతి మాకు తెలుసు, దాన్ని మించింది ఏదైనా ఉంటే చెప్పండి” అన్నాడు పొగరుగా.

గురువు గారు “మీరు ఎంత గొప్పవారంటే మీరు చేసేపని దేవుడు కూడా చేయలేడు” అన్నాడు.

“ఇది బాగుంది. మరి ఆ పని ఏదో చెప్పండి” అన్నాడు రాజు ఆసక్తిగా.

గురువుగారు “రాజు! దేశంలో ఎవరయినా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు అతనికి దేశ బహిష్కార శిక్ష విధించవచ్చు. అంటే అతన్ని దేశం నించీ తరిమేయవచ్చు. కానీ పాపం దేవుడు తనకు ఎదురు తిరిగిన వాణ్ణి తన రాజ్యంనించీ తరిమెయ్యలేడు. ఎందుకంటే ఈ అనంత విశ్వం ఆయన సృష్టే కదా!” అన్నాడు.

ఆ మాటల్తో రాజు అహంకారం ఆవిరైపోయింది.

గురువుగారి పాదాలపై పడి క్షమాపణలు కోరాడు.

🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴

అహమున జిక్కిన మనుజుల
బహుపూజల ఫలితమెల్ల బూదిని గలియున్
ఇహపరముల జెడిపోదురు
మహనీయత నందబోరు మహిలో సత్యా

అహంతో విర్రవీగే మనుషులు ఎన్నెన్ని పూజలు చేసినా వారికి ఫలితం అంటూ ఏమీ ఉండదు.వాటి ఫలితం అంతా బూడిదలో కలిసిపోతుంది. అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment