Friday, May 6, 2022

🎊💦సాధన 🏵️

🎊💦సాధన 🏵️
🌈🌟🌹🦚🚩

సాధన చేస్తే ఈ భూమ్మీద ఏదైనా సాధించవచ్చును అంటారు. నిజమే. కాని ఏ సాధన చేస్తున్నాం? ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏయే నియమాలు పాటిస్తున్నాం, అన్నీ సరిగ్గా ఉన్నాయా, శాస్త్రీయ పద్ధతిలో సాధన సాగుతోందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి.

సాధన అంత సులభం కాదు. సాధనలో వచ్చే అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఒక లౌకికమైన విషయం సాధించడానికి చాలా కష్టపడాలి. అలాంటిది అలౌకిక సాధనలకు ఎంత ఏకాగ్రత, పట్టుదల, అంకితభావం, దీక్ష ఉండాలి ?

పుస్తకాల్లో చదివినప్పుడు అవి చేతికి అందినట్లుగానే ఉంటాయి. ఆ సూత్రాలను పాటించినప్పుడు, ఆ నియమాలను ఆచరించినప్పుడు సాధకుల గొప్పతనం బోధపడుతుంది.

పతంజలి యోగ సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, యోగమార్గాలు అని వీటికి పేర్లు. ఋషులు ఎంతో గొప్ప కృషి చేసి, సాధన చేసి లోకానికి అందించారు. వీటిని ఆచరణలోకి తీసుకురావడమన్నది సాదాసీదా వ్యక్తులకు అయ్యే పని కాదు. చంచల మనస్కులకు అసలు సాధ్యం కాదు. నేను-నాది అనే అహంకారులకు అసలే అంతుచిక్కదు.

సాధన చెయ్యాలనే కోరిక కలగడం కూడా పూర్వజన్మ సుకృతమేనంటారు. పట్టు విడవకుండా దాన్ని కొనసాగించడం పురుష ప్రయత్నం. దానికి దైవానుగ్రహం తోడవ్వాలి.

సాధనలో లోపాలు నాచుమీద నడకలా వెనక్కి లాగేస్తుంటాయి. చిల్లికుండతో నీళ్లు తెచ్చిన చందంలా ఎంతో చేస్తే, ఇంతేనా అని అనిపిస్తుంటాయి.

సరైన గురు సన్నిధిలో వినయ విధేయతలతో, నిజాయతీగా, నిరాడంబరతతో నేర్చుకోవాలనే తపన కలిగిన సాధకుడికి మాత్రమే అనుకూలమవుతుంది సాధన అని చెబుతారు పెద్దలు.

ధ్యానం చేసే వ్యక్తికి ఏకాగ్రత కావాలి. ప్రార్థన చేసే వ్యక్తికి ఆర్తి కావాలి. జపం చేసే వ్యక్తికి భావం కావాలి. పూజ చేసే వ్యక్తికి విశ్వాసం ఉండాలి.

సాధనను మనం నమ్మితే, సాధన మనల్ని నమ్ముతుంది. చేసిందే మళ్ళీ మళ్ళీ పట్టుదలతో చేస్తుంటే, ఆ విషయం మీద పట్టు వస్తుంది. నైపుణ్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాని ఆత్మ పట్టుబడుతుంది. చివరికి సాధన మనకు మోకరిల్లుతుంది.

అర్జునుడి సాధన అతణ్ని గొప్ప విలుకాడిగా మార్చింది. హనుమంతుడి రామనామ సాధన అతణ్ని గొప్ప భక్తుడిగా తీర్చిదిద్దింది. సాధన అనేది పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉందని శ్రీరాముడికి వసిష్ఠుడు తెలియజేశాడు.

సత్యం తెలుసుకొని అరుణాచల కొండను ఆశ్రయించిన రమణ కూడా నిత్యం తన మౌన సాధనను కొనసాగించారు. సత్యం తెలుసుకోవడానికి మొదట సాధన చెయ్యాలి. తరవాత తెలుసుకున్న సత్యాన్ని నిలబెట్టుకోవడానికి సాధన చెయ్యాలి.

మెట్టు మెట్టు ఎక్కి శిఖరాగ్రాన్ని చేరుకోవాలి. బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రమవుతుంది. మనం చిత్తశుద్ధితో చేసింది ఏనాడూ పోదు. క్రమం తప్పకుండా సాధన చేస్తే, లోపాలు వాటంతట అవే సరి అవుతాయి.

శాస్త్రం మీద, గురువు మీద, సాధన మీద నమ్మకం ఉన్నవారు విజేతలవుతారు. భావితరాలకు మార్గదర్శి అవుతారు. సాధ్యం కానిది లేదని నిరూపిద్దాం !

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment