Saturday, September 3, 2022

ఋషులు అంటే??? ఇంద్రియాలను, మనసును జయించి, మనసును ఆత్మయందు లీనం చేసి శాశ్వతసుఖాలు అనుభవించే వాడే...

 సాధారణంగా ఋషులు, మునులు, సాధకులు మోక్షమును పొందుతారు అని మనం అనుకుంటూ ఉంటాము. ఋషులు అంటే ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఇంద్రియాలను, మనసును జయించి, మనసును ఆత్మయందు లీనం చేసి శాశ్వతసుఖాలు అనుభవించే వాడే ఋషి. దానిని మనం కూడా పొందవచ్చు. కాకపోతే నిరంతర ప్రయత్నం సాధన ముఖ్యం. మనం మన పొట్టకూటికి, ధనం సంపాదించడానికి, సుఖాలు అనుభవించడానికి ఉపయోగపడే చదువులు కోసం దాదాపు 20 సంవత్సరాలు పాటుపడుతున్నాము. కనీసం అన్ని సంవత్సరాలు ఈ శాశ్వత సుఖం కోసం పాటు పడితే 30 నుండి 50 ఏళ్ల కు మనం కూడా ఋషిత్వము పొందవచ్చు. అందరూ అతనిని పూజిస్తారు. దాని కోసం సంసారము భార్య బిడ్డలను వదలనవసరం లేదు. కాకపోతే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి విడిచిపెట్టాలి. దైవధ్యానంలో గడపాలి. ఈ సాధనకు కావాల్సిన ముడి సామగ్రి ముందు మనం సమకూర్చుకోవాలి.

వాటిలో మొదటిది పాపాలను పోగొట్టుకోవడం. ఈజన్మలో కాకపోయినా పోయిన జన్మలలో చేసిన పాపాలు మన వెంట వస్తూనే ఉంటాయి. మనసు పాపంతో నిండి ఉంటే జ్ఞానం రాదు. కాబట్టి ముందు ఆ పాపాలను పోగొట్టుకోవాలి. పాపాలు పోవాలంటే పుణ్యకార్యములు చేయడం, సత్సాంగత్యము, ఇంద్రియ, మనో నిగ్రహము, నిష్కామకర్మ, భక్తి, ధ్యానము ఇవి ఆచరించాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి.

రెండవది సందేహాలను వదిలిపెట్టాలి. నాకు ఈ భక్తి అబ్బుతుందా అబ్బదా. దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే ఏ దేవుడిని కొలవాలి!
ఏ దేవుడు మంచి వాడు! ఏ దేవుడిని కొలిస్తే అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి అవీ మనకు వచ్చే సందేహాలు. ఈ సందేహాలను వదిలిపెట్టాలి. "దేవుడు ఒక్కడే అని నమ్మాలి.."

మూడవది ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం.. మనస్సు ఇంద్రియాలు, ప్రాపంచిక వస్తువుల మీదికి, విషయ వాంఛల మీదికి, కామకోరికల మీదికి పరుగులెడతూ ఉంటాయి. వాటిని కట్టడి చేయాలి. మన స్వాధీనంలో ఉంచుకోవాలి. వాటిని ఆత్మవైపు మళ్లించాలి. ఇది ప్రాధమిక విద్య. ఇది లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేము.

నాలుగవది సకల భూత హితేరతా: అంటే సకల భూతాలయందు, ప్రాణులయందు దయ, సహ అనుభూతి, ప్రేమ కలిగిఉండాలి.

🙏 కృష్ణం వందే జగద్గురూమ్🙏

No comments:

Post a Comment