1. అజ్ఞానం : - అంటే ఏమిటి ?
నన్ను నేను తెలియక విషయాదులయందు ప్రవర్తించుట, శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు, మనసు వీటివల్ల కలిగే సుఖదుఃఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకొనుటే అజ్ఞానము.
2. జ్ఞానము :- అంటే ఏమిటి ?
నేను దేహమును తెలుసుకొను వాడను కాని నేను దేహమును కాను. నేను ఆత్మ స్వరూపుడను, నేను మనసును తెలుసుకొనువాడను కాని మనసు యొక్క అనుభవములు నావి కావు. నేను మనసును కాను. నేను ఆత్మస్వరూపుడను. నేను ప్రకాశరూపుడను. ప్రజ్ఞా స్వరూపుడను. ఈ ప్రజ్ఞయే పిపిలికాది బ్రహ్మపర్యంతము 'నేను' గా ప్రకాశింప బడుతున్నదని తెలుసుకొనటయే జ్ఞానము.
3. విజ్ఞానము :- అంటే ఏమిటి ?
ఇట్లు తెలిసిన జ్ఞానమును తనకు అన్వయించుకొని, తన స్వరూపమే జ్ఞానమని, తక్కినదంతయు అన్యముగా నిరశించి, జ్ఞానమే తానైన స్థితి విజ్ఞానము.
4. సుజ్ఞానము :- అంటే ఏమిటి ?
పైన చెప్పిన అనుభవములకు కారణము ఎఱుక అనియు. (ఎఱుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే). ఈ ఎఱుకే జీవుడి అజ్ఞానమును, ఈశ్వరుడిగా జ్ఞానస్థితినీ, పరబ్రహ్మగా మౌనస్థితిని పొందుతున్నదనియూ, కాలప్రభావమున మరలా ఎఱుక సంకల్పించి, జీవేశ్వర జగత్తుగా మారవచ్చుననియూ, త్రిగుణముల యొక్క సామ్యావస్థే పరబ్రహ్మమనియు, త్రిగుణముల యొక్క వ్యవహారమే సృష్టి అనియూ, ఇది కాలచక్రముగా అనేక బ్రహ్మాండములను పరిపోషించుచున్నదనియూ ఎరిగి, త్రిగుణములను నిరశించి, ఎరిగే ఎఱుకను వీడి, ఎఱుకను నిరశించి బయలగుటే సుజ్ఞానము.
.
No comments:
Post a Comment