Tuesday, September 6, 2022

తాపత్రయాలు

 తాపత్రయాలు

🔸🔹🔸🔹🔸..  

పృథు మహారాజు భూలోక చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రధాన దేవతామూర్తులలో ఒకరైన ‘వరుణదేవుడు’ రాజుకు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని అందజేశాడు. అదే ‘సూక్ష్మనీటి రేణువులను చిలకరించే ఒక ఛత్రం’ (గొడుగు) ! అటువంటి గొడుగే ఒకటి వేసవికాలంలోని మండుటెండల్లో మీ దగ్గరకూడా వుంటే ఎలా వుంటుందో ఆలోచించండి. కేవలం నీడను మాత్రమేగాక చల్లటి సూక్ష్మనీటి రేణువులనూ చిలకరిస్తూ అది మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా అందిస్తుంది.

మనుషులను ప్రధానంగా మూడు రకాల దుఃఖాలు చుట్టుముడుతుం టాయి..

అవి : 

అధ్యాత్మికమైనవి (తనువు, మనస్సుల వల్ల కలిగేవి), 

అధిభౌతిక మైనవి (ఇతర జీవులవల్ల కలిగేవి), 

అధిదైవికమైనవి (దైవ ప్రోద్బలంతో సంభవించే ప్రకృతి విపత్తులు వంటివి)

. వీటినే ‘తాప-త్రయాలు’గా పేర్కొంటారు. 

శ్రీకృష్ణుని విశుద్ధ భక్తుడైన ఉద్ధవుడు ఈ తాపత్రయాల నుండి ఉపశమనాన్ని కలిగించే అద్భుతమైన ‘రక్షణ ఛత్రాన్ని’ మానవాళికి అందించారు.

జనన, మరణాలతో కూడిన ఈ సంసారమనే భయానకమైన దారిలో తాపత్రయాలతో పరితపించే వారికి మీ పాదపద్మాలు అనే గొడుగు కంటే వేరే రక్షణ ఏదీ నేను చూడటం లేదు. ఈ గొడుగు ఎండనుంచి తప్పించడమేకాక అమృతాన్నికూడా వర్షిస్తుంది’. ఇలా ఉద్ధవుడు ‘వరుణ ఛత్రం’ కన్నా ఉత్తమమైన, అమృతవర్ష ధారలను కురిపించే ప్రత్యేక ఛత్రాన్ని గురించి వివరించారు.

తాప-త్రయాలతో నిత్యం సతమతమవుతున్న వారంతా ఆ ‘భవతాపం’ నుండి ఉపశమనాన్ని పొందేందుకు వెంటనే ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించా ల్సిందిగా ఉద్ధవుడు సూచిస్తున్నాడు.

మానవుడు జనన-మరణ చక్రం నుండి విడుదల కావాలంటే కేవలం ‘సైద్ధాంతిక జ్ఞానం’ చాలదు. ‘తాను భౌతిక శరీరం కాదు, జీవాత్మ’ అనే జ్ఞానం ఒక్కటే ముక్తికోసం సరిపోదు. 

ప్రతి ఒక్కరూ తమ స్వరూప స్వభావాన్ని అనుసరించి నడచుకోవాలి. ఇందుకు ‘భక్తియుత సేవ’నే శరణ్యం.

ఈ జన్మ కర్మ, పునర్జన్మల నుండి విముక్తిని సాధించేందుకు ఆచరణ యోగ్యమైన ఆ విధానంలో భగవంతుని పాదపద్మాలను అందరం ఆశ్రయిద్దాం.

భగవంతుని నేరుగా ఆశ్రయించడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు.

 దేవదేవుని ప్రతినిధి అయిన ఒక ప్రామాణిక ఆచార్యుడిని ముందుగా మనం ఆశ్రయించాలి. వారి సూచనల మేరకు భక్తి సాధన చేయడం ద్వారా ఈ ప్రపంచంలోని తాపత్రయాల నుండి ఉపశమనం లభిస్తుంది._

మనసులోనే భగవంతుని ఆశ్రయించి భగవన్నామాలను ఆరాధించేవారు తమ హృదయ తాపత్రయాల నుండి శీఘ్రంగా ఉపశమనాన్ని పొంది, ఆనందానుభూతి చెందగలరనడంలో ఎలాంటి సందేహం లేదు.

🔹🔸🔹🔸🔹🔸🔹🔸

No comments:

Post a Comment