🙏🙏🙏🙏🙏
శరీరము అద్దెఇల్లు
మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము.
ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము.
అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము. ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటివేయబడుతుంది. దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.
అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది
అవే సంచితకర్మలు.
ప్రారబ్ధ కర్మలు - అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు . ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ కర్మలు అయితే పక్వానికి వస్తాయో , లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ.
ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే.
ప్రారబ్ధం తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.
ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు, బంధవులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము.
ఆయా వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.
ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయుపోగా , జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి.
ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడా నికి సిద్ధమవుతాయో, అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది.
ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది .
అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
అని అన్నారు.
మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము , అంటే ఇదే.
మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము.
విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment