Thursday, September 1, 2022

శరీరంలో శక్తి ఉన్నప్పుడు, ఈ శరీరం పడిపోకముందే సాధన చెయ్యాలి. మన అదృష్టం కొచ్చీ అరుదుగా వచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి.

 మోక్షము ఎక్కడో లేదు, ఎప్పుడో రాదు, ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే వస్తుంది. దానికి కావాల్సిన సామగ్రి ఇక్కడే దొరుకుతుంది. ఆ సామగ్రిని మనం సమకూర్చుకోడంలోనే మన విజ్ఞత చూపాలి.

ఎందుకంటే భూలోకము కర్మభూమి. ధ్యాన, యోగ, సమాధులకు, ఇదే అనువైన లోకం. స్వర్గంలోకం, నరకం అనుభవించడానికే పరిమితం.
కాబట్టి ఈ జన్మలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి అని భగవానుడు చెబుతున్నాడు. అదీ కూడా ఈ శరీరం వదలక పూర్వమే అని స్పష్టంగా చెబుతున్నాడు. మరణం రాకముందే మనం కామ,క్రోధాలను వదిలిపెట్టాలి. వాటి ప్రభావానికి లోనుకాకుండా, వాటిని అదుపుచేయగలగాలి. అందరి ఎడల సమభావం కలిగి ఉండాలి. మనస్సును పరమాత్మలో లగ్నం చేయాలి.. చేరుకోవాలి.

మనం ఈ జన్మలో మానవులుగా పుట్టాము. కానీ మరు జన్మ కూడా మానవ జన్మ వస్తుంది అని నమ్మకం లేదు. ఏజన్మ వస్తుందో తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఈ జన్మలోనే మోక్ష సాధనకు ప్రయత్నం చేయాలి. ఈ శరీరం ఎప్పుడు రాలి పోతుందో తెలియదు. నిండు నూరేళ్లు జీవిస్తాము అన్న నమ్మకం కూడా లేదు. ఈ శరీరం ఎప్పటి దాకా పటుత్వంగా ఉంటుందో తెలియదు.
"ఇప్పుడేం తొందర తరువాత అదీ రిటైర్ అయిన తరువాత చూద్దాంలే ఇప్పుడు చక్కగా అనుభవిద్దాము" అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం అవివేకము అజ్ఞానము. కాబట్టి..
*శరీరంలో శక్తి ఉన్నప్పుడు, ఈ శరీరం పడిపోకముందే సాధన చెయ్యాలి. మన అదృష్టం కొచ్చీ అరుదుగా వచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి.*

        🚩🙏 హరే కృష్ణ.🙏🚩

No comments:

Post a Comment