దైవీభావనతో అంతా ఆనందమే...
🌷🌷🌷🌷
చేతన భగవంతుడు. ఆ చైతన్యమే జగత్తంతా నిండి ఉంది.
సర్వప్రాణులలో ‘చేతనాచేతన’ అన్నప్పుడు.. అచేతనమయిన విషయ వస్తుసముదాయాలకు కూడా వర్తిస్తుంది. గుట్టలు, పుట్టలు, మేడలు, మిద్దెలు మొదలైనవన్నీ భగవదంశ కావటం వలన అన్నిటిలోనూ భగవంతుడున్నాడన్న విషయం మహాపురుషులు ఎందరో ఇదివరకు చెప్పిందే.
‘‘చేతనలో సుఖం ఉందా.. అచేతన లేదా నిశ్చేతనలో సుఖం ఉందా! దేన్ని మానవుడు కోరుకుంటున్నాడు. దేనిని భగవంతుడు ఆమోదిస్తున్నాడు?’’ అంటే.. భగవంతుడు రాగద్వేషాలకతీతుడు కనుక దొంగ నుండి ముముక్షువు వరకూ అందరిని సమదృష్టితో చూస్తాడు.
ఇంట్లో తల్లిదండ్రులు తమ సంతానాన్నంతా ఒకే విధంగా చూడకపోవచ్చు. రాజు తన మంత్రులను, ఉద్యోగులను ఒకే విధంగా చూడకపోవచ్చు. కానీ భగవంతుడికి ఆ తేడాలేవీ ఉండవు.
ఆశాపాశాలు, క్రోధ, లోభాలు దూరమైతే చేరే స్థాయి కోసమే దివ్య పురుషుల జీవనమంతా గడుస్తుంది. అక్కడ అనుమానం లేదు. అనుమానింపబడటమూ లేదు. అవమానం పొందడం లేదు. అవమానించడమూ లేదు. అసూయ లేదు. కాంక్ష లేదు. నిరాశ లేదు. అటువంటి స్థితిలో మనసు, హృదయం, ఆత్మ.. జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతాయి. అద్భుతమైన శక్తి సంపదలు కలిగి ఉంటాయి.
ఆ స్థితి చేరడానికి, ఆ నిర్మలత్వానికి, ఆ బాంధవ్యరహిత, బాధారహిత జీవన ప్రాప్తికి ఒక విశ్వాసం, ఒక భక్తి, అకుంఠిత దీక్ష అవసరం.
సర్వప్రాణుల ఎడ దయగలిగి ఉండటం ఎంతో ఉత్తమమైన లక్షణం. సహనం, సంయమనం మనిషికి ఏ గెలుపును అయినా సాధించే శక్తినిస్తాయి. మాత్సర్యం, క్రోధం, లోభం మొదలైన దుర్లక్షణాలు మదమనే మరో దుర్లక్షణాన్ని ద్విగుణీకృతం చేస్తాయి.
అహంకారం, పొగరు, ఆధిక్యతాభావం మానవుణ్ని తాత్కాలికంగా ప్రకాశింపజేసినా.. శాశ్వత కీర్తికాంతులను అందించవు.
వాటిని దూరం చేసుకుంటే మనసు, ఆత్మ, బుద్ధి పరిశుద్ధమై కల్మషరహితమై.. ఆనందమయం, అనుసరణీయం అవుతాయి.
అప్పుడు కోరుకోవడానికి ఇక ఏదీ ఉండదు.
కోరిక అన్ని అనర్థాలకూ మూలం. ఆ నిజాన్ని తెలుసుకుని.. కోరికను జయించాలని మునులు, ఋషులు, ముముక్షువులు ఎందరో ప్రయత్నించారు. బుద్ధుడు ఏకంగా తన రాజ్యాన్నే వదులుకున్నాడు. ఆ ప్రయత్నంలో వారు.. కోరికలమయమైన, కోరికలను తీర్చుకునే వ్యామోహ సాధనాలమయమైన సమాజాన్ని వదిలి అడవులకు వెళ్లారు. వారి బాటలోనే అందరూ నడిచి దైవీభావనతో మెలగితే ప్రపంచమంతా ఆనందమయమే.
🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment