Thursday, September 22, 2022

గర్వభంగం

                   గర్వభంగం
                 ➖➖➖✍️

శ్రీమదాంధ్ర మహాభారత అనువాదకుల్లో మొదటివాడు నన్నయ. ఆయన రచనా లక్షణాల్లో ‘నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం’ ఒకటి. నిధుల్లాంటి సూక్తులను బోధించడమని దాని అర్థం. అవకాశం, అవసరం కలిగినప్పుడల్లా కథల్లో అంతర్భాగంగా సామాన్య జనులకు అవసరమైన సూక్తులను, దానితోపాటు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో ధ్వని మాత్రంగా వివరిస్తాడు. 

వాటిలో భాగంగా ‘యయాతి’ చరిత్రలో చెప్పిన కొన్ని విషయాలు మానవ జీవన గమనానికి ఒరవడి దిద్దుతాయి.

‘యయాతి’ ధర్మ వర్తనుడు. అయినా శుక్రాచార్యుడి శాపానికి గురయ్యాడు. తరవాత అతడి ధర్మవర్తనలోని నిజాయతీ గురించి తెలుసుకున్నాడు శుక్రుడు. 

తన శాపానికి విరుగుడుగా ఒక సలహా ఇచ్చాడు. దాని ప్రకారం తన అయిదుగురు కొడుకుల్లో చివరివాడైన పూరుడి యౌవనాన్ని గ్రహించాడు యయాతి. 

సుఖాలను పొందిన అనంతరం రాజ్యభారాన్ని అతడికి అప్పగించాడు. ఆ తరవాత తపస్సు చేసి, దాని ఫలితంగా స్వర్గానికి చేరుకున్నాడు. 

ఈ సంఘటన ద్వారా- జ్ఞానులు సైతం ఒక్కొక్కసారి పొరబడతారని, ధర్మ వర్తనులు సైతం ఇబ్బందులకు గురవుతారని తెలియజేశాడు నన్నయ.

కాలాంతరంలో స్వర్గలోక వాసుల సమావేశంలో ఇంద్రుడు ‘రాజ్యభారాన్ని అప్పగించే సమయంలో నీ కుమారుడికి ఏమైనా నీతులు బోధించావా?’ అని యయాతిని అడుగుతాడు.

ఆ ప్రశ్నకు సమాధానమిది- ‘ప్రతివారూ జ్ఞానం కలవారి చరిత్రలు, సజ్జనుల ప్రసంగాలు విని ధర్మం తెలుసుకుంటూ, తెలుసుకున్న దాన్ని మరచిపోకుండా న్యాయంతో కూడిన బుద్ధితో జీవించాలి.

అర్హత కలిగిన వారికి తగిన ధనం ఇవ్వాలి.
ఇంకొకరిని అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు.
యాచకులను నిరాశపరచకుండా దానం చేయాలి.

సకల జీవులకూ సంతృప్తిని కలిగించాలి.
సభల్లో మనసుకు ప్రీతి కలిగించేవి, మేలైనవి, ఉచితమైనవి, సత్యమైనవి, తీయనివి, విస్తృతం కానివైన మాటలనే పలకాలి.
అవి ధర్మంతో కూడుకొని ఉండేటట్లుగా జాగ్రత్త వహించాలి.
దయ, రుజుత్వం, ఇంద్రియ నిగ్రహం, సత్యం, శుచిత్వం తదితరాల్ని హృదయంలో నిలపాలి.
అప్పుడే మనసును ఆవరించుకునే అంతఃశత్రువులను, గర్వం, కామం, కోపం, మత్సరం, పిసినారితనం, అజ్ఞానం లాంటి బహిఃశత్రువులను ఓడించగలవు’ అని నా కొడుకైన పూరుడికి బోధించానని యయాతి ఇంద్రుడికి సమాధానం ఇచ్చాడు.

ఆ మాటలకు ఇంద్రుడు ‘ఓ మహారాజా! వందల వేల ఏళ్ల తపో మహాత్మ్యం వల్ల స్వర్గాదిలోకాల్లోని సౌఖ్యాలను అనుభవించావు. ఇది అసాధారణమైన విషయం. దీని కోసం నువ్వు ఎలాంటి తపస్సు చేశా’వని అడిగాడు.

దానికి యయాతి ‘ఇంద్రా! దేవతలు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, మానవులు, ఆకాశ సంచారులు, సిద్ధులు, మునులలో శ్రేష్ఠులైనవారు ఆచరించే తపస్సులు, చేయశక్యం కాని తీవ్రమైన నా తపస్సుకు సమానం కావు.
ఒక్క మాటలో చెప్పాలంటే నా తపస్సు సుర దైత్యాదుల తపస్సుకంటే మించినది, అసమానమైనది’ అని పలికాడు.
ఆ మాటల్లో గర్వం తొణికిసలాడటం గమనించాడు ఇంద్రుడు.
‘మహామునుల తపస్సులను తక్కువ చేసిన నీ గర్వంతో స్వర్గలోక సుఖాలను అనుభవించే పుణ్యం క్షీణించింది.
నీ గర్వమే నీకు హానికారకమైంది. కాబట్టి అధోలోకాలకు వెళ్ళు’ అన్నాడు.
ఏ పరిస్థితుల్లోనూ అంతర్గతంగానైనా గర్వం ఉండకూడదని, మాట్లాడటంలో జాగ్రత్త తప్పకూడదని తెలియజేయడమే ఈ సంఘటన ఆంతర్యం.
 ఇలాంటి ఎన్నో నీతిబోధలు చేసింది మహాభారతం.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment