*అర్హమైనది తప్పక పొందుతాం*
ప్రస్తుతం మనం కోరుకొనే కర్మ ఫలాలు మనకు మంచివో, చెడ్డవో అర్థం చేసుకోనేటంత తెలివితేటలు మనకు సాధారణంగా ఉండవు. ఒక సమయంలో ఒక జంట కలిసి ఉండాలనుకుంటారు. కానీ కొంత సమయం తరువాత విడిపోవాలనుకుంటారు. వాస్తవానికి... నేటి సమాజం బాగా పశ్చాత్తాపపడడానికి కారణం... వారు గతంలో తీవ్రంగా కోరుకున్న కర్మఫలాన్ని పొందిన తరువాత... అలా దక్కించుకున్న కర్మఫలం కాలక్రమేణా వినాశనకరంగా మారడమే. దీనికి విరుద్ధంగా, మామూలు అనుభవాలను పరిశీలించి చూస్తే... గతంలో ఏదో ఒక సమయంలో తాము కోరుకున్న కర్మఫలాన్ని పొందకపోవడమే తమకు జరిగిన గొప్ప మేలు అని చాలామంది భావిస్తారు.
కాలానుగుణంగా పొందిన ఈ జీవిత అనుభవాలు.. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మిణి’ అనే భగవద్గీతలోని శ్లోకాన్ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడతాయి.
మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ, కర్మఫలం మీద అధికారం లేదని ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రపంచం ద్వంద్వమైనది. ప్రతీదీ దాని వ్యతిరేక అవస్థలో కూడా ఉంది. ఇదే కర్మఫలానికి కూడా వర్తిస్తుంది. మొదటి సందర్భంలో ఉన్న సంతోషం (సుఖం, విజయం, లాభం) అనే ధ్రువం.... కొంత సమయం తరువాత బాధ (దుఃఖం, ఓటమి, నష్టం) అనే ధ్రువంగా మారింది. రెండవ సందర్భంలో మొదటిదానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. జీవితంలోని ఈ నిత్య ధ్రువాలను తెలుసుకోవడం ద్వారా... వాటిని అధిగమించమని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. కర్మఫలం మీద కోరిక... అటువంటి ధ్రువాలలో ఒకటి. దాని ఉచ్చులో పడకుండా అనుభవించాలి.
సృష్టికర్తకు (చైతన్యానికీ, సృజనాత్మకతకు) కోట్లాది సంవత్సరాలకు పైగా ఈ విశ్వాన్ని నడిపిన అనుభవం ఉంది. అలాంటిది, మన కర్మఫలం విషయంలో ఆయన ఎందుకు తడబడతారు? ఆయనకు ఎటువంటి తడబాటూ ఉండదు.. మనకు అవసరమైనది లేదా అర్హమైనది మనం తప్పకుండా పొందుతాము.
కె.శివప్రసాద్. ఐఎఎస్
🔹🔸🔹🔸🔹🔸
No comments:
Post a Comment