Monday, October 24, 2022

ద ద ద

 “ద ద ద”

(శృ౦గేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి బోధలు)

అన్నింటికంటే ముఖ్యంగా మరొకరిపై దయ అనునది ఉండాలి. ఎందుకంటే మన ఎదురుగా ఎంతో మంది కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టానికి ఏ కొంత అయినా ఉపకారం చెయ్యడానికి మనకు సాధ్యం ఉంటే మనం ఎందుకు ఉపకారం చెయ్యకూడదు? మన పూర్వీకులు ఎన్నో ఉపయోగకరమైన పనులను చేసి వాళ్ళా జీవితాలను సార్థకత చేసుకున్నారు. మనం ఎన్నో పాత దేవస్థానాలను చూస్తాము కదా! ఆ దేవాలయాలను కట్టించిన వారి మనస్సులో ఏమి ఉన్నింది? వారికి స్వంతానికి ఒక పూజామందిరం కావాలి అంటే ఇంట్లోనే ఒక పూజామందిరం కట్టుకుంటే చాలు. ఇంత పెద్ద దేవాలయం కట్టాలా? దాని వెనక్నున్న ఉద్దేశము ఏమిటంటే వేలాదిగా భక్తులు ఇక్కడికి రావాలి. దైవసేవ చేసి ఆ దైవము యొక్క కృపకి పాత్రులై తమ జీవితాలను ధన్యం చేసుకోవాలి, కష్టాల నుండి దూరమవ్వని, సుఖం పొందని అనే ఉపాకారమైన దయా భావంతో ఆ దేవస్థానాలను కట్టించారు. ఎన్నో పాఠశాలలు కట్టించారు, ఎన్నో అన్నసత్రములు కట్టించారు. 

దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే కేవలం దయ మాత్రమే. దయాగుణం మనుష్యునకు అత్యావకశ్యము. అందుకే భగవత్పాదులు “భూతదయాం విస్తారయ” అన్నారు. దయను నాకు చాలా ఎక్కువగా ప్రసాదించు. అది ఉంటేనే కేవలం నేను మనుష్యుడిగా బ్రతకగలను. ఎవరి మనస్సులో అయితే దయ అనునది లేదో అతను మనుష్యుడే కాదు, ఖచ్చితంగా రాక్షసుడే. ఎందుకంటే రాక్షసులకు దయ ఉండదు. 

భృహదారణ్యకోపనిషత్తులోని ఒక ఆఖ్యానంలో ఇలా ఉంది. దేవతలు, మనుష్యులు, రాక్షసులు బ్రహ్మవద్దకు వెళ్ళి మాకు ఉపదేశం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ముగ్గురికి “ద ద ద” అని ఉపదేశించారు. ఎందుకంటే, వ్యత్యాసం చూపిస్తే గొడవలు జరుగుతాయి. వారికి పెద్ద ఉపదేశం చేశారు మాకు చిన్న ఉపదేశం చేశారు అని. అందుకే ముగ్గురికీ ఒకే ఉపదేశం చేశారు “ద ద ద” అని.

మీకు అర్థమయ్యిందా అని అడిగారు. హా అర్థమయ్యింది అని తలాడించారు. ద అంటే మీకేమర్థమయ్యింది అని దేవతలను అడిగితే, ‘దామ్యత’ అన్నారు. అంటే దేవతలు ఎప్పుడూ సుఖభోగములను అనుభవిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నన్ని సుఖములు వేరే ఎక్కడా ఉండవు. అందుకని ఎల్లప్పుడూ ఆ లౌకిక సుఖములలో మునిగిన వారికి మోక్షం పొందాలనే యోచన ఎక్కడిది? అందుకనే ఎప్పుడూ ఆ సుఖములలో ఓలలాడకండి మోక్షసాధనకు ప్రయత్నించండి అని. ఎందుకంటే దేవతలు కూడా మోక్షమును పొందవలసిన అవసరం, బ్రహ్మవిద్య నేర్చుకునే అధికారం ఉంది అని వేదవ్యాసులు తీర్మానం చేశారు. అందుకనే వారికి దామ్యత. 

మీకేమర్థమయ్యింది ద అంటే అని మనుష్యులను అడిగితే, ‘దత్త’ అని అన్నారు. అంటే దానం చెయ్యండి. ఎందుకంటే మనుష్యుడెప్పుడూ లోభబుద్ధితో ఉంటాడు. ఎంత డబ్బు సంపాదించినా చాలదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఖర్చు చెయ్యాలంటే మాత్రం ఇష్టముండదు. ఖర్చు చేస్తే ఉన్నడబ్బు తరిగిపోతుంది అని ఖర్చు చెయ్యడు.

మీకేమర్థమయ్యింది ద అంటే అని రాక్షసులను అడిగితే, ‘దయధ్వం’ అని అన్నారు. రాక్షసులకు మొదటి నుండి మరొకరిని హింసించడమే వారికి పని. దాన్నుండి వారికి ఉపయోగం ఉన్నా లేకపోయినా ఇంకొకరిని హింసించాలి. లేకపోతే విశ్వామిత్రుడు ఏదో యాగం చేస్తుంటే, ఎందుకా మారీచ సుబాహులు పైనుండి రక్తమాంసాలను హోమగుండంలో వెయ్యాలి. వాళ్ళకేమి ఉపయోగం అంటే ఏమి లేదు. ఆ ఋషుల యాగం పాడుచేసారు కదా వారికి అదే తృప్తి. ఈకాలంలోనూ చాలామంది ఉన్నారు. మరొకరికి ఇబ్బంది కలిగిస్తే వారికి అదొక సంతోషం. కాబట్టి దయ అనునది రాక్షసులలో కొంచం కూదా ఉండదు. కాబట్టి రాక్షసులు దయను సంపాదింంచుకోవాలని వారికి దయధ్వం అని ఉపదేశం చేశారు అని బృహదారణ్యకంలో ఉన్నది. 

ఇక్కడ శంకరాచార్యులవారు భాష్యం రాసేటప్పుడు ఒక మాట వ్రాసారు. ఈ దేవతలు, రాక్షసులు అంటే వేరెవరో కాదు మనుష్యులలోనే కొందరు. అత్యంత సుఖలాలసను పొందిన మనుష్యులను అక్కడ దేవతలు అని చెప్పి దామ్యత అని ఉపదేశించారు. అత్యంత క్రూర స్వభావం కలవారిని రాక్షసులు అని చెప్పి వారికి దయధ్వం అని ఉపదేశించారు. కాబట్టి దామ్యత దయధ్వం మాకు సంబంధిచినది కాదు అని అనుకోకండి. అది కూడా మనుష్యులకు చేరుతుంది.

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

No comments:

Post a Comment